ఎర్రగాళ్ళ కొంగల గుంపు మశెమ్మ
వాగు మీద వరదగూడు గట్టినట్టు
నీరుకోళ్లను తరుముతున్న
సోలువలు బొత్త జగ్గల మీద
తాటి శిబ్బి కింద ఆరుద్ర
పురుగుల ఇల్లటం
కుందెనగొమ్మను పరగడుపున
మింగుతున్న పంపుకం
పలుగురాళ్లను పుదిచ్చి
పసుపు, కుంకుమ దిద్ది
శిరసాన రెండు చేతులెత్తి
తల్లి గంగదేవమ్మకు
నిలువెల్ల శెణార్ధులు
తనువెళ్ళ మత్తగొల్పులు
మొగులు పొట్ట పక్కున పలగజీరుకొని
నెర్రెలిడిసిన నేలమీద ఉమ్మనీటిని
కుండపోత కుమ్మరిస్తున్నది
దుమ్ముల దుక్కిల వడ్డ సినుకు
ధూపగొన్న భూమికి సాకవోస్తున్నది
తూర్పు శెల్కల మీదికెళ్ళి గాలిదుమారం
టైర్లాట ఆడుతున్న రేగ్గంప దట్టలు
గాలిపంకలై ఎగురుతున్న శిలికేసరి కాయలు
అర్జున, ఫల్గుణ అర్రర్రర్రర్రర్రాని
ఉరుముల పుట్టిన మెరుపునకు
కొట్టముల చెవులు మూసుకుంటున్న
పోలీస్ పటేల్ ఎంకటయ్య
పరుపులకిడిసిన వంపుతాటి మీదికెళ్లి
రాలిపడ్డ మూడిత్తుల తాటిపండు
నిప్పుల కుమ్మున నాలుగు
కమ్మలేసి కాలుస్తున్న పొద్దుకు
వాసనకే కడుపు నిండి
అంగిట్ల ఊరుతున్న నీళ్లు
దీపం సుట్టు దడిగట్టినట్టు
కోటివెయిల ఉశిళ్ళు
రెక్కల చీమలు సల్లకామలు
దీపం మలిగిన దుగిలి నిండా
రెక్కలు కాలిన వాసన
జీవరాశిని మింగుతున్న కప్పలు
కప్పలకు మండ్రగప్పలు జేరుగొడ్లు
గూన పెంకల మీద గయ్యాళి వాన
షేడెవోయిన సౌడు మిద్దెకు దిమ్మీస తాళం
కవేలు కింద గిన్నెలు జబ్బలు తాంబాలాలు
ఈడ్చికొడుతున్న వానకు ఇల్లంత ఇగము
చిత్రమూలం దుస్సేరుతీగ పాలకుర్శె
అయిదు పల్కల జమ్మేడు
భూతరాకాశి దయ్యం కంప
తేలుకొండి పూలు
తెల్ల తుమ్మ పుచ్చు ఏకోనారాయణ
తలాకిటి వేరు
ములిపిచ్చ ఉప్పురాయి కాపుడం
కలం రాళ్లు రెండు దినుసులు
సవలచ్చకోటి జగిలు నిండ
కమ్మరి పిచ్చయ్యను
మెల్తాము జేసుకునేందుకు
వాకిలి నిండా ఆసాములు..భూసాములు
తూటువోయిన బొక్కెనకు జవ్వ మాటు
ఊడుగు చెక్క చిడ్తబద్ధ పల్లుగోల
రేగుది రోకలిబండ సండ్రది కుమ్మరి సల్ప
యెలుతురు తెడ్డు తాటిది మిద్దెచెక్క
తుమ్మ నాగలి నెమిలినార నొగలు
బల్లెపీటకు బస్తొడ్ల బయాన
అల్లుసాపుతందుకు
ఉడ్తే సాంచకు మార్కట్టే
పెద్దగొల్లకు కీలుకత్తి
గొర్లమందకు దుడ్డుగర్ర
మాసాయి పనికత్తి గౌన్లాయిన గీసకత్తి
సకులం సర్వం సమస్తం
సబ్బండం కొలిమికాన్నే
వానవడితే ఆకిలి
పనిముట్ల నిండుముత్తయిద
– విశ్వనాథుల పుష్పగిరి
9666435426