చదువ దేలయన్న పదము పలుకరాదు
చదువు లేనివాడు జంతుసముడు
బతుకు బాగుపడగ బాటవేయు చదువె
చీకటందు వెలుగు రేకవోలె
ధనము కొరకు చదువులను క్రయ మిలన
బేరసారములకు దారి కాదు ఇది
చింతల దీర్చు చింతామణి వలెను
చదువు జీవితమును చక్కబరుచును
మీరు పొందలేని భూరి విద్యలనన్ని
సంతును చదివించ పంతమూని
పాల మనసులందు పని యొత్తిడిని పెంచ
తల్లిదండ్రులార తగదు మీకు
ధనము పొందుటొకటె ఘనముగా నెంచెడు
వ్యక్తిగతములైన బడులు నేడు
విద్య నేర్పుటందు విఫలమగు చునుండె
పుత్తడనుచు పోవ నిత్తడౌను
తెలివి యెంతయున్న కలుగునంత చదువు
బలిమి చేత రావు ఫలములెపుడు
నీటనీదు చేప నింగిలో నెగురుట
సాధ్యమగునె ధరను శ్రమయెగాక
విషయమేదైన శ్రద్ధగ వివరమరసి
చదువుకొన్ననె లాభము సంఘమందు
కొన్ని మాత్రమే మంచిని కూర్చుననెడు
భావదారిద్య్రమును వీడు త్రోవగనుడు
చిలకమఱ్ఱి
కృష్ణమాచార్యులు
‘రాత్రిసింఫని’కి సాహితీ అవార్డు
ప్రముఖ కవి డాక్టర్ బాణాల శ్రీనివాసరావు రచించిన ‘రాత్రి సింఫని’ కవితా సంపుతం 2023కు గాను పాలమూరు సాహితీ అవార్డుకు ఎంపికైంది. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 1న మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని లిటిల్ స్కాలర్స్ హైస్కూల్లో గల కాళోజీ హాల్లో ఉదయం 10 గంటలకు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే.
– డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ వ్యవస్థాపకులు, పాలమూరు సాహితీ అవార్డు