అంతెత్తు బాయిగడ్డ మీద నిలబడి దునికే
ఈతగొట్టే పోరగానిలా
చెరువు అలుగు దునుకుతున్నది..!
అమ్మ చేతి గోరుముద్దకే కడుపు నిండిన
బుడ్డోడు ఇల్లంతా అంబాడుతున్నట్టు
చెరువు ఊరంతా పారాడుతున్నది..!
గాదె నిండు సంబురం
ఆకాశమంత కన్నై పంట కాపు గాస్తున్నది
ఉండీ లేని ఉపవాసం
పరమాన్నం పండుగ తోరణం కడుతున్నది..!
నాగలింట బుసకొట్టిన
పంట మీది అప్పు పత్రం తోక ముడుసుకున్నది
నెత్తురు తాగి బలిసిన
నల్లబజారు నకిలీ విత్తనం తెల్లబోయి చూస్తున్నది..!
నీరు.. శంఖంలో పోస్తే తీర్థమయినట్టు
ఈ మట్టిలో ఇంకిన అప్పటి కన్నీరు
ఇప్పుడు పన్నీటి వాగయ్యింది
నిన్నటి ముళ్ళకిరీటం
నేడు దూదిపూల తలపాగా చుడుతున్నది..!
ఏ తీగ మీద పాకితే
బతుకు దారి అగుపడుతుందో
ఏ కొమ్మ పైన వాలితే
కలలగూడు పదిలమవుతుందో
ఆ తావూ… ఆ నెలవూ…
తాత నాటిన విత్తనంలా
ఫలాలిస్తున్నది!
నువు నమ్మవు గానీ… ఈ నేల మీద
అమృతం దొరకని రాక్షసుల కన్నుంటది!!
– గజ్జెల రామకృష్ణ, 8977412795