సీ: తెలంగాణ పోరాటములలోని తొలికాంతి
కిరణాల కొంగొత్త కెరటమీవు
మూలవాసుల గుండె మూలలో గుడికట్టి
వమ్ము కాలేని దైవమ్ము నీవు
తమ్ముల నాల్గు పాదమ్ముల ధమ్మాన
పాలించు కడు దక్షురాలవీవు
ఆత్మ గౌరవమునకై రౌరవము జేసి
బిట్టు కొట్లాడిన బిడ్డవీవు
తే.గీ: తెగని రక్షింపగా యెడతెగని పోరు
బాటపట్టిన ముద్దుల పట్టివీవు
పట్టుదలలోని శక్తికి పట్టుగొమ్మ
వడివి కడుపులో జెలగు సందడివి నీవు
తే.గీ: రాచరికము దండంబెత్తి ప్రజల మీద
పెత్తనము చేయు కాలాన నెత్తుకొంటి
వమ్మ జనులకై నెత్తుటుద్యమ పతాక
అందుకే గద వారికత్యంత భక్తి
ఉ: పక్క జనాల కోసరమెవండు సరమ్ములు పేని ప్రేమతో
చక్కనలంకరించునొ నిజానికతండె వరించు మించు న
ల్దిక్కుల కీర్తి చంద్రికలు దిక్కుగమారునతండె తల్లి స
మ్మక్క విధాన నంచవని నందరు నిన్ను నుతింతు రెప్పుడున్
క: నువ్వాడిన ఆటలు నీ
నవ్వులలో పరిమళించు నవ సూనమ్ముల్
జివ్వుమని దూయు బాణము
లవ్వా! ధ్వనియించు నేడునడవి గడపలో!
ఆ.వె: ప్రజల మేలు కొరకు పరితపించెడు వారె
కొలువు దీర గలరు గుండె గుడుల
ఎన్ని యుగములైన ఇగిరిపోజాలదు
వారి కీర్తి జలధి వసుధ మీద
-తోకల రాజేశం
96767 61415