‘ఎల్లుండి చెయ్యగల ఏ పనీ రేపే చేసెయ్యబోకు సుమా!’ అన్నాడట మార్క్ ట్వెయ్న్. అదేదో సరదాకు అన్నమాటే కావచ్చు- కానీ, ‘నువ్వు నిజం మాత్రమే మాటాడతావనుకో- నీ మాటలు నువ్వు గుర్తుపెట్టుకోవలసిన అవసరమే ఉండదు!’ అనే మాటను అలా కొట్టిపారేయగలమా? ‘అధ్యయన క్రమంలో, పాఠ్యాంశాలను చొరబడనివ్వకు సుమా!’ అనే హెచ్చరిక కేవలం చమత్కారమే కాదనీ, దాని వెనక మన బోధన పద్ధతులపై తీవ్రమైన విమర్శ దాగుందనీ వేరే చెప్పాలంటారా?
‘నీ అవగాహన- అత్యధికుల అభిప్రాయం ఒకేలా ఉన్నాయనుకో, ఉన్నచోటనే ఒక్క నిమిషం నిలబడి, ఆత్మవిమర్శ చేసుకో!’ అని సూచించిన ప్రజాస్వామ్యవాది విచక్షణ ఎలాంటిదో విశ్లేషించి చెప్పాలా? ‘భూమి ఎంత దొరికితే అంతా తక్షణం కొనిపారేసేయ్- ఎందుకంటే, దాని ఉత్పత్తి ఏనాడో నిలిచిపోయింది మిత్రమా!’ అన్న వ్యక్తి లౌకిక పరిజ్ఞానం ఎంతటిదో వివరించాల్సిన అవసరం ఉందా? ఇంతకీ ఈ మాటలన్నీ అన్న మనిషి ఒక్కడే- ఆయన పేరు మార్క్ ట్వెయ్న్! అతగాడి అసలు పేరు శామ్యూల్ ల్యాంగ్హార్న్ క్లెమెన్స్ అనే విషయం తెలిసినవాళ్లు చాలా తక్కువమంది!
1835లో హేలీ తోకచుక్క కనిపించినప్పుడు పుట్టి, 1910లో మరోసారి హేలీ తోకచుక్క కనిపించినప్పుడే కన్నుమూసిన మార్క్ ట్వెయ్న్ వేగుచుక్కగా ఓ వెలుగు వెలిగాడు. అమెరికన్ కథానిక రచయితల్లో ప్రథమ గణ్యుడిగా, ఉత్తమ నవలాకారుడిగా, ఆలోచనలను రేకెత్తించే వ్యాసకర్తగా, మహావక్తగా అంతర్జాతీయ ప్రాచుర్యం పొందాడు ట్వెయ్న్.
1884లో మార్క్ ట్వెయ్న్ రాసిన ‘హక్ల్బెరీ ఫిన్’ అనే పుస్తకంలోంచే ఆధునిక అమెరికన్ సాహిత్యమంతా పుట్టుకొచ్చింది’ అన్నాడట ఎర్నెస్ట్ హెమింగ్వే. (హెమింగ్వే వేసిన ఈ జాతకచక్రాన్ని కాదన్న మాదన్నలూ ఉన్నారు. రెబెకా హార్డింగ్ డేవిస్ రచనలే, ఆధునిక అమెరికన్ సాహితికి శ్రీకారం చుట్టాయన్నది ఈ తరం అమెరిన్ సాహిత్య చరిత్రకారుల అంచనా! ఆమె గురించి మరోసారి మాటాడుకుందాం!). మార్క్ ట్వెయ్న్ కథానికలు చాలావాటిల్లో ‘కల్తీలేని అమెరికన్’ వ్యంగ్య కథనం కనబడుతుంది మనకు! శ్రుతిమించిన వెట‘కారాలు’ కానీ, వెకిలి ‘ఆసికాలు’ కానీ ఆ కథల్లో కనిపించవు. భాషలోనూ, భావంలోనూ తూకం తప్పని సుతిమెత్తని వ్యంగ్యాన్ని నిర్వికారంగా వడ్డించే కళ -డెడ్ప్యాన్ సెటైర్ – మార్క్ ట్వెయ్న్కు అలవాటైన అభ్యాసం! ముప్ఫయ్యో యేట ట్వెయ్న్ రాసిన ‘ద సెలెబ్రేటెడ్ జంపింగ్ ఫ్రాగ్ ఆఫ్ కెలావెరస్ కౌంటీ’యే అతనికి గుర్తింపు తెచ్చిపెట్టిన తొలి కథ అంటారు. ముధుశాలలో పనిచేసే ఓ వ్యక్తి బార్టెండర్- తనకు ఆ కథ చెప్పాడని అంటూ, జిమ్ స్మైలీ అనే జూదరి కథను మనకు వినిపిస్తాడు రచయిత.
మధుశాలకు చుట్టం చూపుగా వచ్చిన ఓ చిరుకప్ప గమనంపైనే జూదం ఆడేందుకు అందరినీ ముగ్గులోకి దించిన ద్యూతశిఖామణి స్మైలీ. ‘ద న్యూయార్క్ శాటర్డే ప్రెస్’ పత్రికలో అచ్చయిన ఈ తొట్టతొలి కథానిక రచయితకు ఎనలేని కీర్తిప్రతిష్ఠలను కొనితెచ్చింది. మరెన్నో పత్రికలు ఆ కథానికను పునర్ముద్రించి దాని ప్రాచుర్యం మరింత విస్తరించడానికి కారకులయ్యాయి.
ఈ కథానికకు మరో 26 కథానికలనూ గల్పికలనూ చేర్చి తన తొలి కథానికల సంకలనం వెలువరించాడు మార్క్ ట్వెయ్న్. తన సాహిత్య జీవితం మొత్తంలో ట్వెయ్న్ ఆరుపదుల కథలూ, కథానికలూ, గల్పికలూ రాశాడు. వాటిల్లో అత్యధికం కథానిక నిర్వచనానికి సరిపోయే రీతిలోనే ఉండడం గమనార్హం. మంచి రచయితల్లో అత్యధికులకు తెలిసిన ఈ శిల్ప రహస్యం, మార్క్ ట్వెయ్న్ లాంటి చెయ్యితిరిగిన రచయితకు తెలియకుండా ఉంటుందా? శిల్పం గురించి ఎలాగూ ప్రస్తావన వచ్చింది కనక, కొత్తతరం అమెరికన్ కథానిక రచనలో ట్వెయ్న్ ప్రవేశపెట్టిన ఓ కొత్త స్వరం గురించి ఇక్కడే ఒక్క ముక్క అనుకుందాం!
స్థానిక సంస్కృతిని జీవద్వంతంగా చిత్రించేందుకు జీవద్భాష అయిన వాడుకభాషను మించిన సాధనం మరొకటి ఏముంటుంది? అందుకే సాంప్రదాయికమైన గ్రాంథిక భాష స్థానంలో ప్రాంతీయ పలుకుబడిని విస్తృతంగా వినియోగించాడు ట్వెయ్న్. మన వట్టికోట ఆళ్వారుస్వామి, మన పొట్లపల్లి రామారావు, మన దాశరథి రంగాచార్య, మన ‘యాది’ సదాశివ, మన నెల్లూరి కేశవస్వామి చేసింది ఇదే కాదా? అంతకుముందు, శ్రీపాద, వేలూరి, మల్లాది, జలసూత్రం, తెన్నేటి సూరి, రా.వి.శాస్త్రి, కాళీపట్నం మేస్టారు చేసిందీ ఇదే! అంబల్ల జనార్దన్ లాంటివాళ్లు ముంబయ్‌లో బతికే తెలుగువాళ్ల జీవితాన్ని వాళ్ల భాషలోనే పరిచయం చెయ్యలేదా? ఇది మంచి రచయితలు అందరికీ తెలిసిన శిల్ప రహస్యమే!
మన విమర్శకుల్లోనూ, సాహిత్య చరిత్రకారుల్లోనూ చాలామందిలో ‘తా వలచింది రంభ’ సిండ్రోమ్ ప్రబలంగా కనిపిస్తుంది. వాళ్లలో చాలామంది, ఉత్తమ పురుష కథనానికి మార్క్ ట్వెయ్నే ఆద్యుడని సిద్ధాంతీకరించారు. మరికొందరు ‘అబ్బెబ్బే, విలియమ్ సోమర్సెట్ మామ్ ఆ ధోరణికి శ్రీకారం చుట్టా’డన్నారు. వాస్తవం ఏమిటంటే, పురాతన పాశ్చాత్య సాహిత్య చరిత్రను చూస్తే, సామాన్య శకం రెండో శతాబ్దికి చెందిన రోమన్ రచయిత ఎప్యూలియస్ రాసిన ‘బంగారు గాడిద’ ఉత్తమ పురుష కథనాల్లో అత్యంత పురాతనమైనదంటారు. గొప్ప రచయితలను చిల్లర తగాదాల్లోకి ఈడ్చేవారి ‘విచక్షణ’ను లోకం హర్షించదు!
– మందలపర్తి కిశోర్ 81796 91822