ఊహించలే..మళ్లీ పొలం బాట పడుతామని
పుల్లల కోసం అమ్మల ఉరి బాధ
మునిమాపున పొయ్యి పొగచూరి
గిన్నెలో బియ్యం ముద్దలు
ఊదురుగొట్టం ఊదూది కండ్లనిండా మబ్బులు
ఊపిరితిత్తులు..ఆస్తమా తిప్పలు
హఠాత్తుగా గుండెలు బరువెక్కుతున్నాయి
కర్ఫ్యూలా హోటళ్లు మూత
ప్రయాణ రవాణాదారులకు సంకెళ్లు
వొంటరిగా వెక్కివెక్కి ఏడుస్తున్న వంటగదులు
వానొచ్చినా గాలొచ్చినా
ఒడిలో ఒడిబియ్యమున్నట్లు
అమ్మ చేతుల్లో సిలిండరు
ఏ రాత్రైనా నిమిషాల్లో ఒక కప్పు ఛాయ్
బత్తెము లేకున్నా భరోసానే
కదలని వాహనాలు
వ్యవహారాలన్నీ గ్యాస్తోనే ముడిపడ్డాయి
ఆసుపత్రికి కరువైతున్న ఆక్సిజన్
శ్మశానంలో దహనవాటికలు
ఖననవాటికలుగా మారుతున్నయి
గ్యాస్ అందక బతుకులు ఆగం
మరో కరోనాలా మారిన గ్యాస్ గోస
అభివృద్ధి దేశాలు అధికార దాహాల యుద్ధాలు
దేశాల ధాన్యాగారాలన్నీ ఆయుధాలు,
ఆక్రమణలకే అయినప్పుడు
బడుగుదేశాల జీవనమెట్లా?
నిమిషంలో ఓటీపీ వచ్చే ఆన్లైన్
కాలింగ్..నో బుకింగ్
గ్యాస్ బండికై దారులన్నీ నిలువు కండ్లు
భూకంపం లేకుండానే కాళ్లు వణుకుతున్నాయి
కట్టెలపొయ్యి కష్టాలు కాళ్లరిగిన బాధలు
ముడుసుకుపోతున్న వెలుగురేఖలు
తగవులు తీరుతాయనుకంటే
తెల్లారేలోగా సరిహద్దుల్లో కుమ్ములాటలు
ఎంతసేపూ పరాయి రాజ్యం
పరాయి ఆస్తి, రక్తదాహం
అగ్రరాజ్యాలు గిల్లికజ్జాలు మాని
యుద్ధం నివారణకు కరచాలనాలు చేయండి
ఐ వాంట్ ఎల్పీజీ గ్యాస్ ప్లీజ్..
వన్ సిలిండర్ గివ్ మీ
– వనపట్ల సుబ్బయ్య9492765358