పాలకుడు మారాడు పక్షికి బంగారు పంజరం అమరింది
పిడికెడు కూడా లేని పక్షి హృదయం గర్వంతో ఉప్పొంగింది
పాచిపోయిన పచ్చి జాంకాయ బదులు దోరమగ్గిన పండు దినదినమూ లభించింది
చారెడంతైనా లేని పక్షిపొట్ట తృప్తితో నిండిపోయింది
ఎక్కడో చూరుకు వేలాడే పక్షి డ్రాయింగ్ రూపంలో అతిథులకు ఆహ్లాదాన్ని పంచింది
పాలకుడి పక్షి ప్రేమ పలుతెరంగుల కీర్తించబడింది
ఇనుమైనా, బంగారమైనా పంజరం, పంజరమేనని గ్రహించేసరికి పక్షి అవసానదశకు చేరింది
పిట్టపోరు, పాలకుడికెందుకో గర్వభంగమైంది ముసలి పక్షిని నిర్దయగా బయట విడిచాడు
రెక్కలున్నా, ఎగురడం తెలియని ఆ పక్షి బంగారు పంజరపు గొప్పలు చెప్పబోయింది
పక్షి భాష తెలియనివారి విందులోజిహ్వ చాపల్యానికి అది, అసువులు బాసింది
కానీ, పక్షి భాష తెలిసినవారు దాని అమరత్వంపై అద్వితీయ గీతాలు విరచించి, ప్రభువుకు కానుక చేసి బంగారు పంజరం చుట్టూ ఆశగా గిరికీలు కొట్టసాగారు
దేశరాజు