ఒక కాలాన్ని దహిస్తూ
మరో కాలం
కొత్త పొద్దులా ఉదయిస్తుంది
ఉదయాన్ని ఊహించిన మనసు
సాయంత్రపు సంజెను కలగంటుంది
కళ్లముందు ఉన్నదేదీ
దృశ్యమై కనపడదు
మరలి, తరలినదే తర్జుమాలా
నిన్ను వెంటాడుతుంది
మస్తిష్కాన్ని అలజడుల భావజాలాలు
గుమ్మనంగా నిన్ను వేటాడుతాయి
ఒక నమ్మకం
ఒక అమ్మకమై నిలుస్తుంది
భుజాల మీదున్న చేతులు
అనూహ్యంగా అదృశ్యమవుతాయి
నడిచిన దారులు సైతం
కొత్త చీలికల పేలికలవుతాయి
నిలకడగా ఆలోచిస్తే
బుర్రలో పగుళ్లు ఏర్పడుతాయి
వెన్నుపోట్లు వెయ్యి తలల కుబుసమై
సమాజాన్ని నిలువరిస్తుంది
దుమ్మెత్తి పోసుకొన్న చేతులు
అలయ్బలయ్లతో బంధాన్ని ముడేస్తాయి
కారుకూతల పర్వాల్ని మరచి
చూసే కళ్లకు కనికట్టు కథను చూపిస్తారు
అధికార దాహానికి అన్ని దారుల్నీ తెరిచి
అనూహ్యంగా కుర్చీని అలంకరించి
నడుస్తున్న చరిత్రలో
నాయకులుగా కాక సేవకులుగా మారిపోతారు!
మహబూబ్ బాషా చిల్లెం
95020 00415