ఏం జరుగుతున్నది?
శీతల గాడ్పులు
అతను ఉన్నప్పుడు మొదలైనవే…
చెట్టు కూలే దశకు వేర్లు
బలంగా వూనుకొని ఉండవు, అని
ప్రజలు బాంధవ్యంతో సర్దుకున్నారు
అభిమానపు ఉచ్ఛ్వాసనిశ్వాసలు
వేడిగానే వీస్తాయి గుర్తుంది కదా?
శీతల క్రియ పూర్తిస్థాయిలో
కమ్ముకోలేకపోయింది!
ఎన్నెన్నో స్పందనలకు ఆత్మ ఉంటుంది
అవమానించబడనీయకండి
ఆ వెలిగిన దివిటి ఇప్పుడే ఆరిపోదు
కలిసి నడిచిన నీ మీదే కొన్ని బాధ్యతలు ఉంటాయి
ఎంత దుఃఖపడ్డావో, వేదనకు గురికాబడ్డావో
వాటి సారం నీకు తెలుసు!
నీ కన్నీటి ధార పరాయి చెంగుతో తుడ్చుకోబోకు
శత్రువులు వచ్చిపోతున్నారు
నీలాంటి త్యాగతల్లులు ఎందరెందరో..
నీకు తెలియంది కాదు,
ఆ గజ్జెల రవళికి ఉర్రూతలూగి,
ఆగిన హృదయ స్పందనలెన్నో…
ఎవరి దుఃఖం ఇంకెవరూ తుడవలేరు
మన కన్నీళ్లను మన జ్ఞాపకాల్లో కార్చాలి,
సానుభూతిలో కూడా…
మాసిపోయిన నీడలను ఉన్నతీకరించాలి!
– హనీఫ్ 9247580946