కాలాలు మారుతూ ఉంటాయి
మనుషులు మారుతుంటారు
పయనం మాత్రం ఆగదు!
పరిమళం వికసించిన చోట
వాడిపోయే వికారమూ ఉంటుంది,
గెలుపు ఉన్నచోట
ఓటమి కూడా సిద్ధంగా ఉంటుంది!
అన్నింటినీ ఎదుర్కొనేవాడే
ముందుకు సాగిపోతాడు,
కాదని అక్కడే ఆగిపోతే
మిగిలేది చివరికి శూన్యమే!
కొత్త అడుగు వేసే ప్రతిసారి
కొండంత అడ్డంకులు ఎదురౌతాయి,
అన్నింటినీ జీర్ణించుకుంటేనే
జీవించగలుగుతాం!
కొత్తదనం ఎప్పుడూ
పాతదనాన్ని తిరస్కరించదు,
అన్నింటినీ కలుపుకొని
నూతన ఉత్సాహంతో సాగమంటుంది!
ఏడాది గడిచేకొద్దీ
ఏం సాధించామని ప్రశ్న ఉదయిస్తుంది,
సమాధానం వెలుగొందినప్పుడే
కక్ష గట్టిన కాలం మౌనంగా ఉంటుంది!
ఎదురీదితే
ఏదైనా తల వంచాల్సిందే,
వెంటపడితే
ఏదైనా గుప్పిట్లో చేరిపోవాల్సిందే!
– పుట్టి గిరిధర్ 94949 62080