అర్ధరాత్రి నిశ్శబ్దంలో
మనసు తలుపు మెల్లగా
తెరుచుకుంటుంది
అది సిమెంటు ఇటుకలతో
కట్టిన భవనం కాదు
జ్ఞాపకాలతో కట్టిన
అంతర్ముఖ ప్రాంగణం
అక్కడ ఒక పుస్తకాల
బీరువా కనబడుతుంది
దాంట్లో వందలకొద్దీ
దుమ్మూ ధూళి పేరుకున్న పుస్తకాలు
ప్రతి పుస్తకం ఒక
జీవితమంత లోతయింది
మనం జీవించని జీవితం
మొత్తంగా మనం కాని మనమే
పుస్తకాలు నాతో
ఇలా సంభాషిస్తాయి
ఆ రోజు నువ్వు
అవునని చెప్పి ఉండి ఉంటే
అని ఓ పుస్తకం అంటుంది
ఇంకాస్త ప్రేమించి ఉండి ఉంటే
మరొకటి గుసగుసలాడుతుంది
నువ్వా కలను వదిలి
పెట్టకపోయి ఉంటే
అని ఇంకో పుస్తకం
ముల్లులా గుచ్చుతుంది
ఏది ఏమయినా ప్రతి
పుస్తకం ఒక జీవితమే
మనం నిజంగా జీవించని జీవితం
అందులోని ప్రతి పేజీ
నిండా ఒక పశ్చాత్తాపం
అన్నీ మూసివేయలేని
మూసుకోలేని పేజీలే
పశ్చాత్తాపం తెల్ల పురుగులాగా
మనసును లోపల
నుంచి కొరుక్కుతింటుంది
బయటికి కనిపించేది మాత్రం శాంతి
లోపల వినిపించేది
కృంగిపోతున్న గుండె శబ్దం.
ఇతరుల కళ్లద్దాలు పెట్టుకుని
మనల్ని మనమే చూసుకున్నప్పుడు
మన ముఖం కూడా
మనకే పరాయిదిగా కనిపిస్తుంది
వాళ్లు కోరుకున్న రూపం అదే
వాళ్లు ఊహించిన విజయమే అది
వాళ్లు నిర్ణయించిన మన విలువ
మన అసలైన రూపాన్ని కప్పేసే ముసుగు
కానీ మనసు గ్రంథాలయంలో లోనెక్కడో
ఒక చిన్న పుస్తకం ఉంటుంది
దాని పేరు ‘ఇప్పుడు… నౌ… అబ్…’
అది మెరవదు గంభీరంగానూ కనిపించదు
అవును అదొక్కటే గుండెలనిండా శ్వాసిస్తుంది
ఇతర పుస్తకాలు కేవలం ఊహల ప్రతిబింబాలు
ఇది మన గుండెను తడిపిన నిజం
జీవించని జీవితం ఒక కల
జీవిస్తున్న జీవితం ఒక నడక
కలలను వెంబడిస్తూ
నడకను మరచిపోకూడదు
అర్ధరాత్రి పుస్తకాల బీరువా మూసుకున్నా
ఉదయం తలుపు తెరుచుకుంటుంది
అక్కడ పశ్చాత్తాపం కాదు
ప్రస్తుతం అనే వెల్తురుంటుంది
ఎందుకంటే నువ్వు
రూపొందలేదనుకున్న ప్రతి రూపం
ఒక నీడ మాత్రమే
నువ్వు ఇప్పుడు రూపొందుతున్న రూపం
అదే వెలుగు అదే జీవితం
– వారాల ఆనంద్