కాల గమనం చాలా విచిత్రమైనది.మనుషుల జీవితాల్లో ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియదు. ఎన్నో చూస్తుంటాం. కానీ, మన రజిత అనే భావం వల్లనేమో.. అనిశెట్టి రజిత మరణాన్ని భరించలేకపోతున్నాం.
రజిత 11 కవితా సంపుటాలను ప్రచురించగలిగారంటే చిన్న మాట కాదు. ఏదో తన కవిత్వం తాను వేసుకుంటూ వెళ్లలేదు. ఎన్నో సంకలనాలకు సంపాదకత్వ బాధ్యతలను వహించారు. ఎన్నో ఉద్యమాలు చేశారు. ఉద్యమాలు చేయగానే సరిపోయిందా కాదు, ఎన్నో సాహిత్య సభల్లో మాట్లాడారు. ఇన్ని కారణాల వల్ల… బహుశా మనిషి తత్వం మానవీయతత్వం అనేవి ఉండటం వల్ల, అభిమానులను సంపాదించుకోగలిగారు.
‘అత్తరు కావడమే వాటి జన్మకు పరమార్థమని రసికుల దప్పిక తీర్చడమే వాటి జీవిత ధ్యేయం కాబోలని అందరి వలె నేనూ నమ్మిన.. నన్నూ నా నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఆ గులాబీలు గుబాళించడం లేదు సరికదా..జ్వలిస్తున్నాయి.. గులాబీలు జ్వలిస్తున్నాయి’అంటూ most powerful కవిత్వం రాసి, చీకటిలో మగ్గుతున్న స్త్రీల పక్షాన వెలుగులు విరజిమ్మే కాగడా అయ్యారు రజిత. ముప్ఫై ఏండ్లు నిండనప్పుడే ఇంతటి అభ్యుదయ భావాలు!
స్త్రీని భోగ వస్తువుగా చేసిందెవరు? వాళ్ల జీవితాల్లో పెను తుపాన్లు సృష్టించి, కీలుబొమ్మలుగా చేసిందెవరు? ఎదిరించగలిగే సామర్థ్యం ఉన్న ఆడవాళ్లకు ఈ కవితలో జవాబులూ దొరుకుతాయి. అందుకే రజిత కలం అగ్ని పాళి అనేది! కవిత్వంలో కళా సౌందర్యాన్ని చూడాలా? తాత్వికాభివ్యక్తిని చూడాలా? కవిత్వ నిర్మాణాన్ని చూడాలా? ఏమో! నేనైతే ఈ కవిత్వంలోని హృదయాన్ని చూస్తున్నాను. ప్రత్యేకంగా రజిత కవిత్వంలోని మానవీయ కోణాన్నీ, చలింపజేసే భావ గాంభీర్యతనూ చూస్తున్నాను. Direct Speech, Indirect Speechలోనో రజిత చెప్పాలనుకున్నదేమిటి? స్త్రీల కష్టనష్టాలు. ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టినోళ్లు, అమానవీయ పరిస్థితులను ఎదిరించి బయటపడుతున్నోళ్ల గురించి చెప్తున్నారంటే, ఆమె ఉద్దేశం ఏమిటి? ఎటువంటి పరిస్థితుల్లోనూ బెంబేలు పడిపోయి మానసికంగా దిగజారిపోవద్దని, స్త్రీ శక్తి అపారమైనది, తనంత తానుగా శక్తిని అందిపుచ్చుకోవాలనే సందేశాన్ని ఆమె ఇచ్చారంటాను.
ఎవరైనా సరే ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడాన్ని కష్టతరమైనదిగా భావించారంటే, వాళ్లు జీవితంలో విఫలమైనట్టే. నిలుపుకొంటే గెలిచినట్టే. ఈ విజయం పట్టుదలతో వస్తుంది. పట్టుదల మంచి లక్షణం. రజితకు కొన్ని సిద్ధాంతాలు, కొన్ని నియమాలున్నాయి. కోపం ఆమెకు ఆభరణం. ఆడవాళ్లంటే ఇలాగే ఉండాలన్న అలంకరణను ఖండించిన తత్వం. ఏదైనా పని చేయాలనుకుంటే చేసే తీరే తీరు. పట్టుదలను సాధించుకున్న స్త్రీలు ఆత్మతృప్తితో ఎవరిని లెక్కచేయరు, ఎవరికీ లొంగరనేది రజిత జీవితంలో గమనిస్తాం. వరంగల్ జిల్లా ఉద్యమాల గడ్డ. ఈమె స్వభావానికి తగినట్టుగా అక్కడ కాళోజీ పోరాటాల స్ఫూర్తి ఉంది. పేదవాళ్ల కష్టాలకు కన్నీరు కార్చిన కాళోజీని అంత దగ్గరగా చూసిన అనుభవం ఉంది. ఇవన్నీ రజిత కవిత్వంలో చొరబడ్డాయి.
‘మేము అసంఖ్యాకంగా పునాదిరాళ్లమైఉన్న చోటంతా మీరు మాపై ఉన్నత సౌధాలై వెలిగిపోతుంటారు మా మాటలు పదునుగా రాలితే మా ఆవేశం గట్లు దాటి ప్రవహిస్తే మీకు నవ్వులాటగా ఉంటుంది’.. ఎంతో పకడ్బందీ కవిత్వమిది. నిర్దిష్టమైన భావోద్వేగాలు కవిత్వానికి అవసరం. కొన్ని కవితలు ఇలా లేవు. సందేశాన్ని వాక్యంగా చెప్పకూడదు, అందుకే తన చెమట చెట్టు (1998) కవితా సంపుటిలో ముందుమాటలో.. ‘ఈ నా (చెమట చెట్టు)లోనివి ఒకటిన్నర సంవత్సరకాలానికి పరిమితమైనవి. ఇందులో కవిత్వపు సొగసులు వెతికితే ఎక్కువగా దొరకకపోవచ్చు. కొన్ని అత్యాచార ఘటనలను గర్హిస్తూ రాసినవి. ఉద్యమాలకు సంబంధించినవి, మరికొన్ని విభిన్న పోకడలవి ఉన్నాయి’ అంటూ చాలా అమాయకంగా చెప్పారు.
కవిత్వం రాసేవాళ్లకు ఈ స్పష్టత ఉండాలి. అప్పటికే ఇంత నిక్కచ్చిగా తన అభిప్రాయాన్ని చెప్పుకొన్నారు రజిత. ఇంత ధైర్యం, ఇంతటి స్పష్టత అందరికీ ఉండదు. ఈ పుస్తకంలో మొండాలకు తలలు మొలుస్తాయి, బొగ్గు పూలు, క్షమించొద్దు పాపా, నలుపంటే భయమెందుకు వంటి ఉత్తమ శీర్షికలతో కవితలున్నాయి. ఏవో కొన్ని కవితలు వచన కవిత్వ లక్షణాలతో లేవు అంతే! అయినా అట్లా చెప్పారంటే ఆశ్చర్యం. ఎందుకు ఈ విషయాన్ని చెప్పాల్సి వస్తుందంటే.. కవిత్వం రాస్తే పేరు వస్తుందనుకొని కవిత్వం రాస్తున్న వాళ్లను చూస్తున్నాం. కవితల్లో కవిత్వం ఉండట్లేదు. ఇది సాహితీ ప్రపంచంలో ఆరోగ్యకరమైన వాతావరణం కాదు. నిర్దిష్టమైన భావాలు, కవిత్వ శైలి, నిర్మాణాలు సరిగ్గా ఉండాలి. వస్తు వైవిధ్యం, శిల్పమూ కవిత్వానికి ముఖ్యమైనవి. వాటిమీద దృష్టిపెట్టకుండా రాస్తున్నవాళ్లు ఇదిగో ఇలా రజిత లాంటి కవులను చదవాలి!
‘గిదెవలి రాజ్యమే లచ్చవ్వ
గీడెవలిది సెల్లుతదే అవ్వ లచ్చవ్వ
నువ్వు సర్పంచువైనా, ప్రెసిడెంటువైనా సుత…’
ఈ కవిత్వంలోని వ్యంగ్యాన్ని చదవాల్సిందే!
‘నీ మొగుడైతే ఏంది/నీ కొడుకైతే ఏంది వాళ్లు ఎవ్వలైతే ఏంది/ నువ్వు గద్దెనెక్కితే మొగోళ్ల గర్ర దిగిపోదే లచ్చవ్వ’
ఏ ఇంట్లో స్త్రీలు చదువుకుంటారో ఆ ఇల్లు బాగుపడుతుందనేది పాత మాట! ఏ రాష్ట్రంలో స్త్రీలు రాజకీయాల్లో రాణించగలరో అప్పుడే రాష్ట్రం బాగుపడుతుందనేది కొత్త మాట! ఈ మాట ఎప్పుడో చెప్పారు మన రజిత!!
‘దస్తకత్’, ‘నన్హే ఓ నన్హే’, ‘మార్కెట్ స్మార్ట్ శ్రీమతి’ కవితా సంపుటాలు ‘గోరంత దీపాలు’ నానీలు, ‘మట్టి బంధం’ కథా సంపుటి కూడా రజిత రచనలు. ఉసురు (2002) కవితా సంపుటిని కాళోజికి అంకితం ఇస్తూ.. ‘జీ హుజూర్లను ఛీత్కరించినోడు అయ్యా బాంచన్ అంటేఉరిమి చూసినోడు
బాధితుల పీడితుల పక్షం నిలిచినోడు…’ఒక మహా ఉత్తేజానికి తనదైన రీతిలో స్పందన. ‘బడి పలుకులు గాదు, పలుకు బడులు’ కావాలన్న ఆ పెద్దాయన మాటను రుజువు చేస్తూ తెలంగాణ నుడికారాన్ని ప్రోదిచేస్తూ రాశారు రజిత.
‘కాకిరి బీకిరి చదువులు గెలికి
ఏండ్లకేండ్లు కాలచ్చేపంజేసి
పట్టాబుచ్చుకొని పైసలకెగబడతరు! అవ్వల్ల!’..
అంటారామె. ఇదీ సామాజిక దృక్కోణం. లోకంలో ప్రతి ఒక్కలూ పలుగు పారా పట్టుకొని మట్టిని తవ్వుతూ బతకాలంటెట్లా? బుద్ధి జ్ఞానంతో చేసే సేవకు విలువ లేదా? ‘ఇదిగో తవుటం’ అనే కవితలో కవయిత్రిగా రజిత తన బాధ్యతను ఇలా చూపెట్టారు. ‘ఎంత చదివావు అన్నదే కాదు, ఎంత బాగా చదివావు’ అన్నదీ ఎంత ముఖ్యమో ఈ రెండు పాదాలు చదివితే తెలుస్తుంది. సమస్య ఎక్కడుందో చూపి, సరిదిద్దుకొమ్మని కొరడా దెబ్బల్లా కొట్టి తేల్చిచెప్పిన రజిత కవిత్వం నిజంగానే తమస్సులో ఉషస్సు వంటి కవితా కాగడాలను వెలిగించిందని అంటాను. రజిత ఇంకొన్నాళ్లయినా తన కలం ఝళిపించి, తన గళం వినిపిస్తే బాగుండేదనీ అంటాను.
-డాక్టర్ కొండపల్లి నీహారిణి