కోడి కుయ్యగానే లేసి
పాసి పనులు చేస్కుంటూనే
ఇంకా వీడు లెవ్వలేదా….
అని ఎదురుచూపు
నేను లేసిన అలికిడి విని
పండ్లు తోముకో
చాయ్ సల్లగైతదని
కాలు కాలిన పిల్లిలా
అటు ఇటు తిరుగుకుంట
వీడు ఇంకేమి చేస్తుండు
ఇంకా రాకపాయే
అని ఎదురుచూపు
ఉదయం 10 అయినా,
మధ్యాహ్నం 2 అయినా,
రాత్రి 8 అయినా,
ఏమయిందిరా…
ఇంకా తినే టైమ్ కాలేదా
అని అన్నం కోసం ఎదురుచూపు
వాడు ఎలా బతుకుతాడో
అనలేక మేము ఎట్లా
బతుకుడో.. ఏమో..
రోజు పొద్దుగూకుతుంది
తెల్లారుతుంది.. ఏదైనా ఇంత
పని ఉంటే మంచిగుండు
అని పనికోసం ఎదురుచూపు
ఇప్పుడు వాళ్ల వయసు
ఒకరిది 65 ఉంటే
ఇంకొకరిది 85 ఉంటది
వాళ్లు చేసెదంతా
నా కోసమే…
అయినా నా వయసు
40 సంవత్సరాలు
కానీ వాళ్ల దృష్టిలో
నేనింకా చిన్న పిల్లవాణ్ణే..
-పిట్ల నర్సింలు
9704430466