ఆమె చేతిలో కలం
చరచరా ఉద్యమాల సిరా కదలిక
ఆమె బొండిగలో గళం
గలగలా పోరాటాల ధ్వని తరంగ
ఆమె ఆలోచనా స్రవంతులు
ప్రజాస్వామిక ఆకాంక్షల లేఖనాలు
ఆమె నిరంతర చైతన్య జ్వాల
ఆమె ఎక్కుపెట్టిన లక్ష్య నిర్దేశిత
ఎల్లిపోయావా రజితవ్వా!
కలాలు కాయిదాలు విడిచిపెట్టి
వేగిరమే వెళ్లిపోతివా అనిశెట్టీ
నీవు అలవిగాని శ్రమజీవన స్వప్నం
అలసిపోని కార్యాచరణ సముద్రం
అనగనగా కాలంలో కలిసిపోజాలవు
గులాబీలను ఇంకా జ్వలింపజేస్తున్నావు
ఆకాశమూ నల్ల మబ్బయి వ్యాపిస్తుంది
చెమట చెట్టుగా పెరిగి పరిమళిస్తుంది
మట్టి బంధమై రెపరెపలాడుతుంది
తెరవే ప్రరవే బహుజనావళి కార్యశీలత
కథలు కవిత్వం వ్యాసాల సృజనాత్మకత
సభలు సదస్సులు ప్రయాణాల కదలిక
ఉద్యమ సహచరులే సకుటుంబ పరివారం
జీవితం ఆగిపోయేదాకా రగరగ చలనశీలత
కుమార్‌పల్లి కేయూ కాజీపేట గోపాలపురం
హనుమకొండల దారులన్నీ చిన్నబోయినయి
రామలక్ష్మి శ్యామలమ్మ బిల్ల మహేంద్ర
సోపతిగాళ్లంతా దుఃఖపడుతున్నరు చూడు
వైద్య విద్యకు పాఠ్యమైన అచేతన దేహంతోనూ
దానమిచ్చిన నయనాలోంచైనా చూస్తూనే ఉండు
కాళోజీతో కలిసి నడిచిన అడుగులు
జయశంకర్‌తో జై కొట్టిన నినాదాలు
సావిత్రీబాయి మెడలో పూలదండలై
రుద్రమ్మ ఊపిరి సమ్మక్క సారక్కల శౌర్యం
సాహిత్య ఆకాశంలో నక్షత్రాలైన జ్ఞాపకాలు
ఓరుగల్లు బిడ్డా! నిన్ను మరువదీ గడ్డ
కాకతీయ ద్వారమంతా రజిత కాంతిమయం
-అన్నవరం దేవేందర్
9440763479