మళ్లీ పొరపాటు పడ్డాను
అతను నా కోసం ఫోన్ చేయలేదు
మొదట క్షేమం అడిగింది
అతని పనిని సరిగ్గా వినడానికి
ఎలా వచ్చాయో అలాగే పోయాయి
సముద్రంలో అలల్లాగే
సిరిసంపదలూ
చివరికి ఎడతెగని బాధలు కూడా
ఇంత చేసిన తండ్రీ!
మాయగాడా
కన్నుమూసేటప్పుడు
ఇంత కాఠిన్యమేల నీకు
కన్నీళ్లు ఉన్నవాళ్లే
ఉన్నవాళ్లు
అవి లేని కళ్లు
ఎడారుల కంటే బీళ్లు
నీరు లేని ఎడారిలో కూడా
కన్నీరు కవిని
అంటిపెట్టుకునే
ఉంటుంది
తెలివి తెల్లారిందంటే
మొదట అర్థం కాలే
వెచ్చాల దగ్గర గిచ్చి గిచ్చి బేరమాడి
పసిడి కొనుగోలు దగ్గర
ఉదారంగా ధారపోసినప్పటి దాకా
కాలం వేగంగా నడుస్తుందంటారు గానీ
మొత్తం ఖాళీగా ఉండి చూడండి
చిన్నప్పటి కంటే మెల్లగా నడుస్తుంది
గడియారం ముల్లు!
ఆ రోజులు వేరు కదా! కొడుకా
నిన్ను నవ్వించడానికి బోల్తా పడ్డా!
ఇప్పుడు కాలం తిరగబడ్డది
నువ్వు నవ్వుతున్నవ్, నే బోల్తాబడ్డ!
అది రహదారి
తను నడవకుండా
మనల్ని నడిపించే
జిత్తులమారి
అంతెత్తు ఎదిగాక
ఎక్కువ మాట్లాడకూడదు మరి
స్వర్గంలో దేవతలకు
విశ్రాంతి భంగమవుతుంది
అది ఆకాశం
తానెక్కడా లేకుండానే
అంతటా ఉన్నాననే
ఊహా సుందరి
ఎవరూ ఏదీ పుట్టియ్యరు
సృష్టిలో ఉన్నదాన్నే
సహస్రాంశంలో సహస్రాంశాన్ని
కనిపెడతరు
-ఏనుగు నరసింహారెడ్డి
89788 69183