బాధ,ఐరావతమై, గుండె పొర మీద
నింపాదిగా కూర్చుంది
చూపును కాపు కాచే కనురెప్పలు
బరువుగా మూతపడ్డయి
గుసగుసల శబ్దాల్ని సైతం
ఆకళింపు చేసుకునే వీనులు
వినజాలని బధిర గుహలో దూరినై
జిహ్వ మీది మాటలు, తడియారి,
ఉనికి పోగొట్టుకున్నయి
చీకటిలా, భయంకరమైన నిశ్చలమై
ఎక్కడ పారుతున్నదో లేదో
తెలియని అయోమయావస్థలో
రక్త నది తెల్లబోయింది
నరాల దారులు మ్యూకస్
కబ్జాకు లోబడినై
ముఖబింబంలో వెలుగు బింబం
వికసించటం మానేసింది
హస్తాలు, ఆకాశ కేళిలో పాల్గొనటంలేదు
కాళ్లు, సముద్రాన్ని లంఘించే
పద్యం మరిచిపోయింది
తీపి పెదవులు వర్రెలు తేలిన వాగులైనయి
గిలగిల కొట్టుకున్న
ఊహలే, ముంగిట్లో వాలినై
శుష్కప్రియాల, శూన్యహస్తాల
రుతుపవనాల్లా,
భావనలు కురిసేదేం లేదు
బాధా ప్రియతమా! నువ్వావహించి,
కొత్త జన్మలో మేల్కొనేటట్లు చేశావు
మార్పోదయమే యిప్పటి నుంచి..
మనిషిని ఆత్మగీతంలా పాడుకుంటున్నా
రాలే కంటి బిందువుకు దోసిలౌతున్నా
లోకం పలకపై, నువ్వుండని లోకాన్ని సృజించబోతున్నా
మరి వెళ్తావా!
పోతూ పోతూ, కొన్ని కన్నీటి చుక్కల్ని
మానవ సమూహాలపై చిలకరిస్తూ పో!
మళ్ళీ నీ అవసరం వుండదు,ఒట్టు..
-దాసరాజు రామారావు