ఊళ్లె బతుకుదెరువు లేక
ఇయ్యిల గాదు నిన్న గాదు
ముప్పై ఏండ్ల కింద పట్నమొచ్చినం
ఆడీడ ఇండ్లల్ల పనిచేసినం
అప్పుడప్పుడు
కడుపు కట్టుకొని కూలి చేసినం
మా వెంట గిర్క తిరిగినట్లు తిరిగినోల్ల
మాయమాటలు నమ్మి
పల్లెల పగ్గమంత పొలముంటే అమ్మినం
తెలిసో తెలువకనో
గీడ జాగ కొన్నం
మాకేం తెల్సుతది
చెరువు భూమని బఫర్జోనని
నాలాలు, శిఖమని, ఎఫ్టీఎల్ అని
మాకెవ్వడు చెప్పకపాయె
అమ్మినోడు అమెరికాలో ఉన్నడంట
అనుమతిచ్చినోనికి ప్రమోషనట
వాళ్లిప్పుడేడున్నరొ తెల్వదు
ఎవరికి సెప్పాలి
యాడికివోవాలి
రాత్రికి రాత్రే
బతుకు గూళ్లు కూల్చితే నీడెట్ట
దారెవ్వరు దాపెవ్వరు?
బతుకు ముక్కలేనా?
మార్పు మార్పంటూ
ఇయ్యాల మాట్టాడుతున్నోళ్లందరు
నిన్న, మొన్న, ఆవలి మొన్న
అధికారంల ఉన్నోళ్లె
ఎవలి మీద కక్షతోనో
ఎవలి మీద ప్రేమ తోనో
మా పానాల మీదికి ఎసరొచ్చె
అయ్యా!
జెర మా గోసలిను
ఆడ పొలం వాయె
ఈడ గూడు వాయె
మీకేమో
ఇండ్లు, బంగ్లలు,
కలల మేడలు, ఫారమిండ్లు
మాకేమో
తలదాపులు బతుకు దెరువులు
ఈ పరువు పందెంల
మేం కూలిపోయినం
రోడ్ల వెడల్పుల నష్టపోవాలి
వరదల్ల కొట్టుకపోవాలి
ప్రాజెక్టుల కింద మాయం కావాలి మేమే
ఎవరికీ ఏది తక్కువైనా ఎక్కువైనా
మీ సూపులు గడ్డపారల్లే మా మీదనే
తప్పులు
మీరు సేస్తరు
తిప్పలు మాకంటరు
ఇందిరమ్మ రాజ్యమంటున్నరు
బుల్డోజర్లు తెస్తున్నరు
కూల్చడం నిర్మాణం కాదు
పేదోల్లకు సాయమై నిలబెట్టు
చెరువులు తవ్వు సెలిమెలా నిలబడు
తెప్పలు మీదపడ్డట్టు
మా గుండెలు కూల్చి మీరు నిలబెట్టేదేంది
మా చేతులతోని ఓట్లేసినందుకేనా
మా కన్నీళ్లు మూటగట్టుకునేది
వనపట్ల సుబ్బయ్య
94927 65358