ఎండాకాలమనగానే
నాకు
మా నాయిన గుర్తొస్తాడు
తాటి చెట్టును నిచ్చెనగా చేసుకుని
ఆకాశంలోని అమృతభాండాల్ని
నేలకు దించి
ఊరందరి వేసవి దాహాన్ని తీర్చిన
మా నాయిన గుర్తొస్తాడు
చలికాలమనగానే
నాకు
మా అమ్మ గుర్తొస్తుంది
ఊర్లోని వరి పొలాలన్నిటా
కలుపు మొక్కల్ని పీకేసి
ఊరందరి ఆకలికి
రైతందించే అన్నం ముద్దలో
తానూ ఒక మెతుకైన
మా అమ్మ గుర్తొస్తుంది
వర్షాకాలమనగానే
నాకు
మా అమ్మా నాన్నలిద్దరు గుర్తొస్తారు
కురిపించిన చెమట వర్షంలో
తడిసి ముద్దయి మొలకెత్తి
ఏపుగా పెరిగి పెద్దయి
పచ్చబడిన పంట చేనులాంటి
ఇవాళటి
నా బతుకు గుర్తొస్తుంది
చిత్తలూరి
91338 32246