గెలుస్తావు నువ్వు
గెలిచి తీరుతావ్
కమ్ముకున్న పొగమేఘాలు
నీ చైతన్యపు సూర్యకిరణాల
ముందు దూదిపింజలై పోతాయ్
నిన్ను కమ్మేసిన నిందల నివురు
నీ సౌహార్దపు పిల్ల గాలి వల్ల
గాలిలో కలిసిపోతుంది
ముళ్ల కంచె వీరుల
దారిలో కొత్తది కాదు
బందిఖానా ఉద్యమం
పిడికిలికి సవాలు కానే కాదు
ఎవరు విసిరిన ఉండేల రాయి
వాళ్ల వైపే వెళ్లే ఒకానొక వాయు శక్తి
ఎదురుచూపు ఉండనే ఉంటుంది
దిగులు లేదు
అలుపు లేదు
మనం ఉన్నది ఎడారి భూమిని
లలిత వనం చేయడానికి
ఇంకా తెగిపోని ప్రాణ
దీపానికి చమురు కావడానికి
కత్తులు దులపరించే
చిలకలుంటాయ్
ఆకాశాలను శాసించే
మౌనజలధులుంటాయ్
అడుగులకు ముడి
పడిపోయిన ఆకాశాలు
తెగిన తీగలను మళ్లీ అతికించే
చేతి వేళ్ల కోసం చూస్తున్న పాటలు
ఉద్యమం పొడుపును తిలకంగా
ధరించిన ఉత్సాహపు జీవితాలు
ఇట్లా ఎన్ని చూడలేదు?
జనపు గుండెల భేరీల మీద
యుద్ధ నినాదం చేయలేదు?
ఎప్పుడైనా ఇరిగిపోని
ధైర్యానిదే అంతిమ విజయం
ఎగరగలిగే పక్షి
రెక్కలదే ఆవలి తీరం.
కాంచనపల్లి గోవర్ధన్ రాజు
96760 96614