గాయాలు మానుతున్నప్పుడైనా
గతాలను ప్రేమించాలి
సేద తీరుతున్నప్పుడైనా
ఒంటిని తడిమి చూసుకోవాలి
వీపులపై నిలిచి పోయిన
లాఠీ గాయాలైనా
మనసు తెరల పైన మానని
అవమానాల చిత్రపటాలైనా
ఈ విరిసిన చిరునవ్వుతో సత్కరించుకోవాలి
ఎన్ని మైళ్ళు నడిచామో
ఎన్ని రహదారులను నినాదాల
వరదలై ముంచెత్తామో
విశ్వవిద్యాలయాల ప్రాంగణాలన్నీ
ఎన్ని ఉద్యమ శపథాలై
ఎదురు నిలిచాయో
ఎన్న్ని పోరాట గీతాలు
ఎందరు కవుల మేలుకొలుపు
కవితా ధారలు
గాలి పురికొసలపైన
పిడికిళ్ళను బిగించి
ఎన్ని గుండెలను జెండాలను
చేసి ఎగరేసామో
గమ్యమొక్కటే ఆశగా, ఆచరణగా
ఎన్ని వందల లాంగ్ మార్చ్ నడకలమయ్యామో
నీ ప్రాంతమొస్తే ఏమొస్తుందన్న ప్రశ్నకు నేనిప్పుడు ముప్పయి మూడు జిల్లాల పరిపూర్ణ సమాధానం
నువ్వు మైదానమవుతావన్న మాటకు
కాళేశ్వరం చుట్టిన పచ్చని పావడే సమాధానం
అవమానాలు పడిన భాష
అసలు భాష కావడమే సమాధానం
అడవి సంస్కృతి అన్న
నా బతుకమ్మను
నువు తలపై మోయడమే సమాధానం
డాక్టర్ చెమన్
94403 85563