జిట్టపులి సంకలనంలో ఉన్నవి పన్నెండు కథలు. రచయిత మ్యాకం రవి రాసిన తొలికథ ‘యాపచెట్టు’.
2011కి పూర్వం తెలంగాణలో ఉన్న రైతు జీవితాన్ని విజువలైజ్ చేసిన కథ ఇది.
అప్పు పుట్టడం ఒక యుద్ధమైతే, పుట్టిన అప్పును తీర్చడం మరో యుద్ధం. ఆ యుద్ధాల నడుమ రైతు ‘కుదవ పెట్టిన జీవితం. కుదురుకోని పాణం’. చెట్టు మనిషికి నీడ మాత్రమే కాదు, ఆపదలో ఆదుకున్న తోడు కూడా అని చెప్పిన కథ ఇది. ఇందులో ఉన్న దాదాపు అన్ని కథలు కొంతమంది కథా రచయితలకు తెలిసినవే అయి ఉంటాయి. వివిధ కథల పోటీల్లో బహుమతులు గెలుచుకోవటం, ఆయా మాధ్యమాల ద్వారా వివిధ సందర్భాల్లో ప్రచురితమయ్యాయి. యాపచెట్టు (2011) నుంచి ‘అర్ధరాత్రి ఫోన్‌కాల్’ (2024) దాకా కథలన్నీ దేనికవే వస్తువులో, శిల్పంలో ఆఖరికి ముగింపులో ప్రత్యేకమైనవి.
ఇందులోని కథలన్నీ పాఠకుడికి జీవితాన్ని దృశ్యమానం చేస్తాయి. తెలంగాణ మట్టి పొత్తిళ్లు వెదజల్లిన మనిషి సుగంధం ఈ కథల నిండా ఉంది. చదువుతుంటే పాత్రలు మనతో ముచ్చట పెట్టినట్టే అగుపిస్తది. మన భాషను అంతలా అచ్చుగుద్దినట్టు దించిండు రచయిత. మచ్చు కు.. ‘ఎదురుచూపులు’ కథలో బతుకుదెరువు కోసం బొంబాయికి పోతున్న కొడు కు బస్సెక్కినంక కన్నపేగును సాగనంపుతున్న దైన్యాన్ని ఇలా రాశాడు.. ‘డ్రైవర్ కీకపెడ్తుంటే ఆడిని గట్టిగ పట్టుకున్న. పాలు దాగుతున్న దుడ్డెను తలుగుపెట్టి గుంజుతున్నట్టుగనే నన్నిడిసి బోవట్టిండు’. ఇంతక న్నా బలమైన చిత్రణ ఏం కావాలె? అటువంటివి కథల నిండా అనేకం.
నూర శ్రీనివాస్