ఒకటి రెండు, లేదా కొన్ని పంక్తులకు మాత్రమే పరిమితమై ఉండే సాహిత్య సాధనాలు (Literarydevices) ఇంకా చాలా ఉన్నాయి. వాటిలోని కొన్నింటిని ఇప్పుడు చూద్దాం.
ఒనొమటోపియా (Onomatopoeia): ధ్వనిని సూచించే పదాలు వరుసగా రావడాన్ని ఒనొమటోపియా లేదా echoism అంటారు. ఉదాహరణకు hiss, buzz, rattle, bang, ting, clap, grunt, swish మొదలైనవి. లార్డ్ టెన్నిసన్ రాసిన The Princess అనే కవితలోని ఈ పంక్తులను క్లాసికల్ ఉదాహరణలుగా చూపిస్తారు ఆంగ్లేయ విమర్శకులు: ‘The moan of doves in immemorial elms,/ And murmuring of innumerable bees.’ ఇందులోని moan, murmuringలు ధ్వని సూచకాలు. తెలుగులో ఐతే బుస్సు, కిర్రు, ఢాం, గలగల, ఘల్లు మొదలైన మాటలు చోటు చేసుకోవచ్చు.
శ్రీశ్రీ రాసిన ప్రసిద్ధ కవితలోని ‘గర్జిస్తూ,’ ‘హరోం! హరోం హర! హర! హర! హర! హర! హరోం హర!’, ‘హోరెత్తండీ’, ‘ప్రళయఘోష’, ‘ఫెళ ఫెళ’, ‘సల సల’ మొదలైన పదాలు చక్కని ఉదాహరణలు. చెల్లెలి కాపురం సినిమాలోని సినారె అద్భుత గీతం మరొక మంచి ఉదాహరణ. ‘చరణ కింకిణులు ‘ఘల్లు ఘల్లు’మన/ కర కంకణములు ‘గలగల’లాడగ’. ‘డమరుధ్వని’, ‘జలధరార్భటుల,’ వికృత ‘ఘీంకృతుల,’ సంచలిత ‘ఫూత్కృతుల’ – ఇలా ధ్వనిని సూచించే పదాలతో ఈ పాట దద్దరిల్లిపోయింది.
మెటానమీ ( metonymy) , సినిక్డికీ (synecdoche)లు తెలుగు కవిత్వంలో కొంచెం అరుదుగా కనిపించే సాహిత్య సాధనాలు. ఆంగ్ల రచనలలో Kingకు బదులు crown (కిరీటం) లేదా sceptre (రాజదండం), సినిమా పరిశ్రమకు బదులు Hollywood, ఇంకా languageకు బదులు tongue – ఇలా పదాలను వాడటం మెటానమీ కిందికి వస్తుంది.
ఎమ్వీ రామిరెడ్డి తన ఒక కవితలో రైతులు అనే మాటకు బదులు తలపాగాలు, వెన్నెముకలు, అదేవిధంగా దళారీలకు బదులు దిష్టిబొమ్మలు, నక్కలు అనే పదాలను ప్రభావవంతంగా వాడారు. తెల్ల కోట్లు (డాక్టర్లు) సమ్మె చేస్తున్నై, నల్లకోట్లు (న్యాయవాదులు) వాదిస్తున్నాయి మొదలైన వాక్యాలు కూడా మెటానమీకి ఉదాహరణలే. సినిక్డికీ కొంతవరకు మెటానమీ లాంటిదే కానీ, అందులో ఒక నామవాచకాన్ని మొత్తంగా కాకుండా దాని ఒక భాగాన్ని సూచించడం ఉంటుంది. ఉదాహరణకు vehicleకు బదులు wheels, shipకు బదులు sails, workersకు బదులు hands మొదలైనవి. I have no hands under me now అంటే, ఇప్పుడు నా కింద పనివాళ్లు లేరు అని అర్థం. తెలుగులో కూడా కొన్ని సందర్భాల్లో ‘నా కింద చేతులు లేవు,’ అంటారు.
Malapropism: నవ్వు తెప్పించే విధంగా ఒక పదానికి బదులు వేరొక తప్పు పదాన్ని వాడటాన్ని మాలప్రాపిజమ్ అంటారు. ఇంగ్లిష్లో దీనికి చాలా ఉదాహరణలున్నాయి.
I was most putrefied (petrifiedకు బదులు putrefied)., I reprehend you perfectly (comprehendకు బదులు reprehend)., Capital punishment is a detergent to crime (deterrentకు బదులు detergent). అదేవిధంగా tenterhooksకు బదులు tender hooks, death knellకు బదులు death nail వాడటం ఉదాహరణలు. తెలుగులో ఉదాహరణలు చూడండి: కోర్టువారు ఇంజెక్షన్ ఇచ్చారు. (ఇంజంక్షన్/ injunctionకు బదులు ఇంజెక్షన్). రొమాంటిక్ ఫీవర్తో బాధ పడుతున్నాను. (రుమాటిక్ ఫీవర్/ Rheumatic feverకు బదులు రొమాంటిక్ ఫీవర్). నా సైకిల్ టైరు పంప్ చార్ అయింది. (పంక్చర్/ puncture కు బదులు
పంప్ చార్).
క్లాస్ మేట్కు బదులు క్లాస్మెంట్, టెంపొరరీకి బదులు టెంపర్వరీ అనడం కూడా మాలప్రాపిజం అని చెప్పవచ్చు. సాధారణంగా, ఆంగ్లభాషలో నిష్ణాతులు కాని తెలుగువారు రోజువారీ వ్యవహారంలో ఇంగ్లిష్ పదాలను తప్పుగా పలకడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుంది.
పారాలిప్సిస్ (paralipsis)లో ఒక అంశం గురించి మాట్లాడను అని, వెంటనే దాని గురించి మాట్లాడటం ఉంటుంది. గ్రీకు భాషలో paraleipein అంటే to leave aside or omit. ఉదాహరణకు, షేక్స్పియర్ రచించిన జూలియస్ సీజర్ అనే నాటకంలో మార్క్ ఆంటోనీ ఒక సంతాపసభలో ఇలా అంటాడు. I Came to bury Caesar, not to praise him. కానీ, వెంటనే సీజర్ను పొగడటం మొదలు పెడతాడు. రోజువారీ జీవితంలో కూడా ఇటువంటి సంఘటనలు ఎదురవుతాయి. ‘నీ గది శుభ్రత గురించి నేను మాట్లాడదలుచుకోలేదు కానీ నీ రూము ఎంత చండాలంగా ఉందంటే, దాన్ని శుభ్రం చేసుకున్న తర్వాతే పడుకోవాలి నీవు,’ అని ఒక తండ్రి తన చిన్న అమ్మాయితో లేదా అబ్బాయితో అనడం పారాలిప్సిస్ కిందికే వస్తుంది. వాక్చాతుర్యం, వ్యంగ్యం కలగలిసి ఉంటాయి ఇందులో.
Parallelism (సమాంతరత)లో ఇదివరకే ఉన్న ఒక నానుడి లేదా సామెతలోని సింటాక్స్ను (వాక్య నిర్మాణాన్ని) అనుకరిస్తూ దానికి సమాంతరంగా వ్యాఖ్య చేయడం ఉంటుంది. జోగీ జోగీ రాసుకుంటే బూడిదే రాలుతుంది అనే వాక్యం కోవలో, ధనవంతుడూ ధనవంతుడూ రాసుకుంటే నోట్లే రాలుతాయి అనడం Parallelism కిందికి వస్తుంది. ‘అడుసు తొక్కనేల కాలు కడుగనేల’కు సమాంతరంగా, చెత్త సినిమా చూడనేల చిత్తం పాడు చేసుకోనేల అన్నప్పుడు అందులో Parallelism చోటు చేసుకున్నట్టు భావించాలి. ఇతర సాహిత్య ఉపకరణాలను వివరించే మరో వ్యాసంతో మళ్లీ కలుద్దాం.
-ఎలనాగ