నింగి ఒడిలో కదులుతున్న శిశువు
లోకానికి వెచ్చటి స్పర్శనివ్వడానికి
ఆత్రంగా వస్తుంటాడు!
గాలి తన చేతులతో
ఆకులను పక్కకు జరిపి
వెచ్చటి కిరణాలకు దారినిస్తుంది!
వెలుగు
చీకటిని కాజేస్తూ
లోలోపలికి దూసుకుపోతుంది!
మెలకువ స్నానం చేసిన దేహం
మనసునూ తట్టి లేపుతుంది,
నిద్రపోతున్న అణువణువూ
రెక్కలను తొడుగుతుంది!
వెలుతురు కళ్ళలోనే కాదు
వెలిగించే ప్రకృతిలో ఉందని
కండ్లు తెరుచుకుంటాయి !
రంగులు నింపుకొన్న సీతాకోక
నవ్వులను జల్లుకుంటూ
గర్వంతో ఎగిరిపోతుంది!
పదునెక్కిన ఎండ
తన ప్రతాపాన్ని చూపిస్తున్నా,
మట్టిలో దాచుకున్న చెట్టు హృదయం
పచ్చని పరిమళమై స్పందిస్తుంది!
రేపటిని చూస్తామో లేదో
తెలియని కండ్లకు
ప్రతి ఉదయం ఒక కొత్త జన్మ,
విరబూసే ప్రతి ఉదయం
ప్రతి మనసుకు ఒక కొత్త స్పందన!