నీ కంటిలో రెటీనా పొరను
కరెన్సీ తెరలు కమ్ముకున్నాక
నీ మనోదృష్టి యవనికపై
కపట కోణం కనిపిస్తుంది తప్ప
కరుణ కిరణాలకు చోటెక్కడిది ?
నీ మస్తిష్క వేళ్ళ మొదళ్లకు
స్వార్థపు తెగుళ్లు సంక్రమించాక
నీ ఆలోచనల కొమ్మలకు
విషపు పిందెలే కాస్తాయి తప్ప
వికాస ఫలాలకు తావెక్కడిది?
నీ దేహం అణువణువులో
పాప పంకిలం పారుతున్నాక
నీ అడుగుజాడల్లో
నమ్మకద్రోహపు నీడలే తప్ప
నైతిక విలువలకు నెలవెక్కడిది ?
నీ అంతరంగ కుహరంలో
విద్వేషం గూడు కట్టుకున్నాక
విధ్వంసం సృస్టిస్తావే తప్ప !
విశ్వశాంతినెలా స్వాగతిస్తావు?
నవ నాగరికుణ్నని తలచి
అకృత్యాలకు తెగబడుతూ
పతనమవుతున్న మనిషీ!
ఇప్పటికైనా
మస్తిష్కంలో వేళ్ళూనిన
కలుపుమొక్కల తెగదున్ని
విలువల సాగుబాటు సాగిస్తే
నీ గుండె గొంతుకలో
ప్రేమనాదం ప్రతిధ్వనిస్తుంది
నీ హృదయ క్షేత్రంలో
నవ జీవన వేదం ప్రస్ఫుటిస్తుంది
కోడిగూటి తిరుపతి
95739 29493