వచన కవితా పితామహుడిగా వినుతికెక్కిన కుందుర్తి ఆంజనేయులు అభ్యుదయ కవి, తెలుగు రచయిత, ఆంధ్రదేశంలో వచన కవితోద్యమానికి ఆద్యుడు. పాతకాలం పద్యం, వర్తమానం వచన గేయం అని ఎలుగెత్తి చాటిన వచన కవితోద్యమకారుడు కుందుర్తి ఆంజనేయులు. పద్యానిదే పై చేయిగా ఉన్నరోజుల్లో ఛందస్సు పై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు కుందుర్తి…మధ్య తరగతి, పేద, బడుగు వర్గాల జీవన స్థితిగతుల గురించి, శ్రామికులు, కర్షకుల బాధలు, వారి జీవన విధానం గురించి ఎంతో అందంగా తన కవితల ద్వారా చిత్రీకరించిన గొప్ప అభ్యుదయ కవి. తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళలపై పోలీసుల అమానవీయ, అమానుషమైన చర్యల గురించి తన కవితల ద్వారా ఎలుగెత్తి చాటారు.
వచన కవిత్వం రాయాలని ఒక ఉద్యమంగా ప్రచారం చేసి వర్తమాన, భవిష్యత్కాల కవులంతా వచనంలోనే కవిత్వం రాసే విధంగా పునాదులు వేశారు కుం దుర్తి. ఆయన జీవితం, సాహిత్యం ఒక దానితో ఒకటి ముడిపడిపోయా యి. ఆయన వచన కవితా పితామహుడుగా చిరకాల కీర్తిని ఆర్జించారు. కుందుర్తి ఆంజనేయు లు 1922లో గుంటూరు జిల్లా నరసరావుపేటలోని కోటవారి పాలెం లో జన్మించారు. నయాగరా, తెలంగాణ, ఆశ, నగరంలో వాన, నాలో ని నాదాలు, మేఘమాల, దండియాత్ర, నా ప్రేయసి, రసధుని, తీరా నేను కాస్తా ఎగిరి పోయాక మొదలగునవి ఆయన రచనలు.
పాఠకులకు సాహిత్యాన్ని చేరువ చె య్యాలనే ఉద్దేశంతో ప్రజల భాషలో వచన కవితలు రాసి పాఠకులకు చేరువయ్యారు. అందులో శ్రీశ్రీ, పట్టాభి, శ్రీరంగంనారాయణ, కుందుర్తి మొదలగువారు ముందు వరుసలో ఉంటారు. సామాన్యు ల సమస్యలను, బాధలను తమ మాటల్లో రాశారు. ‘ఫ్రీవర్స్ ఫ్రంట్’ అనే సంస్థను స్థాపించారు. అలతి మాటలతో, పలుకుబడులతో వ్యంగ్యాన్ని ప్రదర్శించే లక్షణం కుందుర్తి కలానికున్నది.
రచనల పూల తోటలో
ఛందస్సుల మొక్కలు నాటాను
భావనలో సామాన్యుని
జీవితం వలయాలు దాటాను
సామాన్య జీవిత చిత్రణలో నుడికారాల ప్రయోగంవల్ల కవిత్వంలో దేశీయత కనిపిస్తుంది. తెలుగు కవిత్వానికి సంబంధించినంత వరకు తెలుగుదనం కనబడుతుంది. తెలుగు నేలలోని మట్టి వాసన కవిత్వమై హృదయానికి తాకుతుంది. సామాన్య ప్రజలతో తాదాత్మ్యం చెందుతూ, వచన కవిత్వాన్ని సామాన్యుని దగ్గరకు చేర్చుతూ కవితా పరిధిని విస్తృతం చేశారు.
‘స్వార్థం కట్టిన గులకరాళ్ళ
వంతెనే ఆలంబనగా
సామాన్యుల బతుకు
బాటకొక లంబంగా
ప్రగాడ కాంక్షలతో
ప్రతినిమిషం బతుకు మీద ఆంక్షలతో
పరిపాలన సాగింది (తెలంగాణ)
అని తెలంగాణలో నిజాం నవాబు పరిపాలన సాగిస్తున్న తీరును వర్ణించాడు. నిరంకుశ పాలనను చూడలేక ప్రజలుపడుతున్న ఇబ్బందులను తన కలం లో నింపుకుని భావాల వెల్లువను కురిపించారు. తెలంగాణ ని జాం నవాబును తనదైన కవిత్వంతో ప్రశ్నించాడు.
‘విసుక్కునే నగర ప్రజల
వీపులు చిల్లులు పొడిచే
జల్లులతో వెక్కిరిస్తుంది
సగం వచ్చి సగం రాక
స్వాగతం చెప్పని పట్న వాసాల
సాగిన ఉదయపు జల్లు
రాత్రి వచ్చిన చుట్టంలా తిష్టవేస్తుంది.
తీరిగ్గా’ (నగరంలో వాన)
నగరంలో కారణం లేకుండా పడే వాన గురించి చెబుతూ- మనసులో విసుక్కు న్నా రాత్రి వచ్చిన చుట్టాన్ని మర్యాదచేయక తప్పని మధ్య తరగతి మనస్తత్వా న్ని చెబుతారు. పేదవారు వారి గుడిసె లు ఎక్కడ కొట్టుకుపోతాయోనని బి క్కు బిక్కు మంటూ గడుపుతారు.
పరిమితమైన జీతాలు, అపరిమితమైన అవసరాలు ఈ రెంటికీ సమన్వయం సాధించడానికి అవస్థ పడే సగటు ఉద్యోగస్తుల గురించి చెబుతూ-
‘హృదయ పాత్రలేకుండా
కవితా తటాకంలో దిగి
మంచి నీరు ముంచుకోలేక
మరలారు వట్టి చేతుల యింటికి’
(నాలోని నాదాలు)
వచన కవిత కూడా ఒక కవితా మార్గమేనా? అంటూవెక్కిరించిన వారిని స ముద్రాన్ని వెక్కిరించిన వాన పాములతో, మదపుటేనుగు నడకను చూసి నవ్విన దోమలతో పొలుస్తారు కుందుర్తి. కవిత్వాన్ని ఆస్వాదించడానికి హృదయం కావాలి. హృదయం లేని వారు తన కవిత్వంలోని లోతు తెలుసుకోలేరంటారాయన.
‘దీనికి కురవడం రాదు
పేదల్ని కరవడం ఒకటే వచ్చు
నేల మీద ప్రభువుల వాగ్దానాల
పాటకు పల్లవిగా
ఇది ఆకాశం తొడుక్కున్న
అబద్ధాల ముసుగేమో!
ఈ వీస్తున్న గాలికి ఇది ఇంకా
ఎంతసేపుంటుందిలే
ఆవిరితో కట్టిన ఈ గూడు ఏమంత గట్టిగా నిలుస్తుందిలే (మేఘాలు)
రాజకీయ నాయకులను మేఘాలతో పోల్చాడు. అవసరం లేకున్న మేఘాలు కు రుస్తూనే ఉంటాయి. కానీ,రాజకీయ వర్షం ఓట్లకోసం కురుస్తుంది. పేద, బడుగు వర్గాలే లక్ష్యంగా వాగ్దానాలతో తడిపేస్తారు. రాజకీయ ప్రభువులు హామీలకు పల్లవిగా తాళం వేస్తుందని చమత్కారంగా చెప్పారు.
నా ఊహలో వచన కవిత్వం అంటే ప్రజల కవిత్వం, నా కవిత్వానికి వ్యాకరణా లు ప్రజలు, నాకు నిఘంటువులు ప్రజల కవిత్వం, నాకు అలంకారాలు ప్రజలు అని తన కవిత్వం గు రించి చెప్పుకున్నాడు కుందుర్తి. నయగారా అనే మొట్టమొదటి కవితా సంకలనాన్ని ఏల్పూరి సుబ్రహ్మణ్యం, బెల్లకొండ రామదాసులతో కలిసి వెలువరించారు. ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ, రాష్ట్రసాహిత్యఅకాడమీ అవార్డులు, సోవియట్ లాండ్ నెహ్రూ పురస్కా రం లభించాయి.
– బట్టు విజయ్ కుమార్ 95055 20097