భారతదేశంలో కుల వివక్షతను వేలెత్తి చూపడమే కాకుండా దాని నిర్మూలన కోసం జీవితాంతం కృషి చేసిన మహానుభావుడు, బహుజన ఉద్యమ స్ఫూర్తిప్రదాత, సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు పూలే. ఆధునిక కాలంలో పూర్తి ఆధునిక దృక్కోణంతో బహుజన సమస్యను విశ్లేషిస్తూ సకల ఆధిపత్యాలపై తిరుగుబాటు జెండా ఎగరేసి బీసీ, ఎస్సీల ఆత్మగౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం ఆయన పోరాటం చేశారు. భారతదేశ సామాజిక పునర్వికాస ఉద్యమానికి మూలపురుషుడు. తన సతీమణి సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పించి తనతో పాటుగా సంఘసంస్కరణ కోసం కృషిచేసేలా తీర్చిదిద్దారు. ఆ దంపతులు అందించిన స్ఫూర్తిని ప్రతిఒక్కరూ తమ మనసుల్లో నింపుకోవాలన్న ఉద్దేశంతో వనపట్ల సుబ్బయ్య, డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ల సంపాదకత్వంలో ‘ధిక్కార’ కవితా సంకలనం రావడం హర్షించదగిన విషయం.
ధిక్కార కవితా సంకలనంలో 156 కవితలు ఉండగా.. అవన్నీ పాఠకులను చైతన్యపరిచేవే. కులాధిపత్యం కోసం మతం, దేవున్ని ఏ విధంగా వాడుకున్నారో జూకంటి జగన్నాథం రాసిన ‘కొత్త ఊపిరి’ కవిత తేటతెల్లం చేసింది. ‘వేల ఏండ్ల నుంచి భుజాలు అరిగే వరకు/ మోసిన అగ్రవర్ణాన్ని బరువై దించేందుకు తల్లడిల్లుతుంటే/ మతాన్ని, దేవుని ప్రతిభను వెంట తీసుకువచ్చారు’ అని స్పష్టపరిచారు. ‘అస్థిపంజరాల అస్తిత్వ ఉద్యమం మొదలైంది/ బీసీ కుంజరాల ప్రభంజనం దిగంతాల ధ్వనిస్తుంది’ అని ‘బీసీ ప్రభంజనం’ కవిత ద్వారా అమ్మంగి వేణుగోపాల్ తెలియజేశారు.
‘క్షమించు’ కవితలో కవయిత్రి గోగు శ్యామల.. ‘నీవు గులాంగిరిపై చెర్నకోలను మా చేతికందించినవ్/ అయినా మాకు సోయి లేదు క్షమించు క్షమించు’ అంటూ బహుజనుల్లో అస్తిత్వ స్పృహ ఇప్పటికీ లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తీకరించారు. అన్నవరం దేవేందర్ రాసిన ‘విప్లవ సుతారి’ కవితలో.. ‘మూలవాసుల మూల సుక్క/ బహుజన జీవితాల తూర్పు రేఖ/ బానిస భావాల ముక్తి ప్రదాత/ నిత్యం రగరగ పొడుస్తున్న పొద్దు’ అంటూ పూలేను నిత్య చైతన్యమూర్తిగా అభివర్ణించారు.
‘నాలుగో కన్ను’ కవితలో.. ‘ఉదయానికి ముందు ఎరుపెక్కిన తూరుపులా/ ప్రసవానికి ముందు తల్లి పెట్టిన పెనుకేకలా/అదిగో ప్రయాణం అదిగో మహాయానం’ అంటూ బహుజన రాజ్యాన్ని జూలూరి గౌరీ శంకర్ బలంగా కాంక్షించారు. జ్వలిత రాసిన ‘జ్ఞానఖడ్గమా’ కవితలో.. ‘ప్రజలను విద్యకు దూరం చేసిన/ స్వార్థ దోపిడీ ముఠాల వీధి నాటకాలను ఉత్తరించ/ అంటకత్తెరపై మొలిచిన ప్రశ్నల అంకురమా’ అంటూ శూద్రుల కోసం పూలే పడిన తపనను గుర్తు చేశారు. ‘శతాబ్దాల పొడుగు సాగిన కొత్తకొత్త కిరాతకత్వాల ఎత్తుగడలెన్నున్నా/ చేతనత్వాన్ని రగిలించినవాడు పూలే’ అంటూ వేణు సంకోజు ‘చేతన జ్వాల’ కవిత ద్వారా తెలియజేశారు. ‘నాలుగు తలల నాగశిరసుపై/ కాళియమర్దన తొలిపాదం పూలే’ అంటూ బి.నర్సన్ ‘జాతిపిత’ కవితలో పూలే పోరాటాన్ని దృశ్యమానం చేశారు.
‘కులం ముండ్ల మీద గులాబీలు మొలిపించి/ భారతీయ ఎడారి బతుకుల్లో/ పూలు పూయించిన పూలే అతడు’ అంటూ ‘కలల పూల తోటమాలి’ కవిత ద్వారా తైదల అంజయ్య వ్యక్తీకరించిన విధానం బాగుంది. పూలేను తండ్రీ అని సంబోధిస్తూ బూర్ల వెంకటేశ్వర్లు రాసిన ‘పురాణ సారమెల్ల’ కవితలో.. ‘ఎన్ని వేషాలు విప్పి చెప్పినవ్ తండ్రీ/ ఎన్ని మోసాలు బండగొట్టినవ్ తండ్రీ’ అంటూ అవతారాల గుట్టును పూలే ఎలా రట్టు చేశారో వివరించారు.
‘అక్షర జ్ఞానం లేక స్త్రీ బానిస అయినప్పుడు/ నువ్వు మనిషిని ఖడ్గంగా నిలబెట్టావు’ అంటూ డాక్టర్ వెల్దండి శ్రీధర్ ‘నువ్వు లేని కాలంలో’ కవిత ద్వారా పూలే తత్వాన్ని కవిత్వీకరించారు. ‘సాగిలబడ్డ మా ఎన్నెన్నో దేహాల్ని/ మళ్లీ నీ కళ్లు లేపి నిలబెడుతున్నాయ్ మహాత్మా’ అంటూ జి.లక్ష్మీనరసయ్య రాసిన కవితా పంక్తులు పూలే నుంచి పొందిన స్ఫూర్తిని తెలియజేస్తున్నాయి. ‘కుహనావాదుల కుట్రలను జ్ఞానఖడ్గమై ఛేదించిండు/ గూడు కట్టుకున్న సంకుచిత భావాలను సమూలంగా తుడిచిపెట్టి/ సంస్కరణ దృక్పథ బావుటాను ఎగరేసిండు’ అంటూ డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య ‘జ్ఞాన భాస్కరుడు’ కవిత ద్వారా పూలే గొప్పతనాన్ని తెలియజేశారు. ‘కాలం పొరల కింద కదులుతున్న/ సత్యాన్ని వెలికితీసిన ప్రయోగ శోధకుడివి’ అంటూ డాక్టర్ ఎస్.రఘు ‘నిర్మాణాత్మక విధ్వంసం’ కవిత ద్వారా చెప్పిన విధానం బాగుంది.
‘నువ్వు గుర్తొస్తున్నప్పుడల్లా/ లోపలేదో వెలుగుతుంటుంది’ అంటూ పూలే ద్వారా తాను పొందిన స్ఫూర్తిని సీతారాం తెలియజేశారు. ‘జాతి రత్నమై మెరిసెనే పూలే/ జ్యోతిగా వెలుగునిచ్చేల ఘనమైన పూలే చరిత దెల్సుకోని/ జగమందు మన భవిత రాసుకుందామా’ అనే పల్లవితో సాగే ‘జాతిరత్నమై మెరిసెనే’ అనే పాట ద్వారా అంబటి వెంకన్న పూలే చేసిన కృషిని వివరించారు. ‘నాలుగు బాటల కాడ నువ్వు/ ఇవాళ ఉత్త విగ్రహానివే కాదు/ నాలుగు వేల ఏండ్ల ఈ దేశ ఆత్మగౌరవ పతాకానివి’ అంటూ డాక్టర్ పసునూరి రవీందర్ కవితా నీరాజనమిచ్చారు.
‘అవమానాల్ని అనుభవాల కొలిమిలో సరిసి/ అక్షరాయుధాల్ని చేసుకున్న అక్షరయోగి/ అసమానతల రూపురేఖల్ని మార్చేసిన ఆధునిక సంస్కర్త’ అంటూ డాక్టర్ బాణాల శ్రీనివాసరావు ‘బహుజన ధృవతార’ కవిత ద్వారా తెలియజేశారు. ‘నా అక్షరాలతో దండ కడియాలు చేయించిన/ నువ్వొచ్చె దారిలో నల్లగొంగడి పరిచిన/ ఎర్ర రుమాలు కట్టిన పూలే తాతా!/ నువ్వు వేసిన బాటగుండనే రా/నీ ముని ముని మనవండ్ల
పిల్లలను చూసి పో/సత్యశోధన పండ్లు పంచిపో’ అంటూ పూలే పునరాగమనాన్ని తగుళ్ల గోపాల్ ఆకాంక్షించారు.
‘ఆవరించిన అమావాస్యలను చెరిపివేసి/ శూద్రావనిలో సూర్యోదయమయ్యావు/ బడికి ‘మడి’గట్టిన చాందసవాదాన్ని ధిక్కరించి/ ఒడినే బడిగా మలచి బతుకు విలువను బోధించావు’ అంటూ సావిత్రిబాయి పూలే గొప్పతనాన్ని కోయి కోటేశ్వరరావు ‘తల్లీ! నిన్ను దలంచి’ కవిత ద్వారా ఆవిష్కరించారు. ‘ధ్వజమెత్తిన అగ్రహార అహంకారాలపై/ అధర్మ విలయతాండవాలపై/ మనుధర్మాల మారణ హోమాలపై/ సత్యశోధకుని పొలికేక/ తొలి కోడి జ్ఞానకూత/ ఉద్యమతరంగ జలపాతం’ అంటూ ‘దారిదీపం’ కవిత ద్వారా వనపట్ల సుబ్బయ్య పూలేను కీర్తించారు.
ఇలా అన్ని కవితలను స్పృశించ లేకపోయినా ప్రతీ కవిత పూలే దంపతుల సంఘసంస్కరణ దృక్పథాన్ని, జీవితాంతం అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన తీరును, అగ్రవర్ణ ఆధిపత్య ధోరణిని వ్యతిరేకించిన విధానాన్ని తమ తమ కవితల ద్వారా ఆవిష్కరించారు. స్తబ్దంగా ఉన్న సమాజంలో ఒక అలజడిని సృష్టించి గుండె గుండెలో ఉద్యమ స్ఫూర్తిని నింపడానికి ప్రయత్నం చేశారు. పూలే దంపతులు చూపిన మార్గంలో మనందరి ప్రయాణం కొనసాగినప్పుడే ఈ కవితా సంకలనం సంపాదకుల కృషి ఫలించినట్లవుతుంది.కవితలకు సార్థకత లభిస్తుంది.
-డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య
97047 31346