‘అత్యనాథు గాంచి, యశ్రూదకము జిమ్ము
కరుణ నాగుండె పురుటి గేము
మంజులాలంకార మకరందముప్పొంగు
కవితకు నా జిహ్వ కల్పతరువు’
అంటూ ఆధునిక కవిత్వంలో అందమైన కవిత్వానికి తాను కల్పతురువు లాంటి వాడినని జాషువా ప్రకటించుకున్నది అక్షర సత్యం. ఎవరి కవిత్వం వింటే హృదయముప్పొంగిపోతుందో, ఎవరి కవిత్వం వింటే మనస్సు వెన్నలా కరిగిపోతుందో, ఎవరి కవిత్వం వింటే పారవశ్యంతో కనుల నుంచి నీరు జలజరాలి మానవత్వాన్ని తట్టి లేపుతాయో ఆ కవియే అపర వాల్మీకి అమృత హృదయుడు గుఱ్ఱం జాషువా.
‘కులమతాల గీచుకున్న గీతల చొచ్చి
పంజారన కట్టుబడను నేను
నిఖిల లోకలమెట్లు నిర్ణయించిన, నాకు
తరుగులేదు, విశ్వనరుడ నేను.’ ’
అంటూ కులమతాలకతీతంగా విశ్వ మానవునిగా మానవతా ప్రబోధంతో కన్నీరు పెట్టించగలిగిన కవి శేఖరుడయినాడు జాషువా. 1895 సెప్టెంబరు 28న జన్మించిన గుఱ్ఱం జాషువా కరుణరసార్ద్ర కవితకు పట్టం గట్టిన కవివరేణ్యుడు. జాషువా రాసిన ఖండకావ్యాలు ఏడు సంపుటాలు, గబ్బిలము, ఫిరదౌసి, నా కథ ముంతాజ్మహల్ మొదలైనవి తెలుగు సాహిత్యపరులందరినీ ఆకర్షించడానికి కారణం వాటిలో ఆవిష్కృతమైన మృదుమధుర మనోహర కవితా సౌందర్యమే. కులమతాలనెడి కర్కశ క్రకచ కరాళదంష్ట్రలు కరకరలాడచున్న కాలంలో జన్మించిన జాషువా నిజ జీవితంలో ఎదురైన అవమానాలు అతనిలో కవితా హృదయాన్ని మేలుకొలిపినవి. జాషువా పడిన ఈ ఆవేదనయే ఆయన కవిత్వానికి బీజం వేసింది. నిజానికి ఆవేదనే కవితకు కన్న తల్లి. జాషువా చిన్ననాడు పడిన కష్టాలు, పరాభవాలు ఆయనను ఆవేదనాగ్నిలో పూటి పాకంవేసి కరుణరసమూర్తిగా తీర్చిదిద్ది కవితలోను కరుణరసాన్ని ప్రవహింపజేసినది. జాషువా ప్రతి ఖండికకు, కావ్యానికి ముక్తాయింపు కరుణరసం. ఏ సామాన్య వస్తువు గ్రహించినా కరుణరసంతో రం గరించి శోత్రుపాఠకుల హృదయాలను కరిగించే అసామాన్యశిల్పం జాషువా కవిత్వం.
జాషువా తన కావ్యానికి ‘గబ్బిలం’ అన్న పేరును ఎంపిక చేసుకోవడంలోనే తనకు సమాజం పట్ల గల తిరస్కార భావాన్ని ప్రతీకాత్మకంగా వెల్లడించినాడు. లోకస్వభావాన్ని ఎండగట్టడంలో జాషువా కవితకున్న శక్తి చాలా గొప్పది. ఉదాహరణకు..
‘నరుని కష్టపెట్టి నారాయణుని గొల్చు
ధర్మశీలురన్న ధరణి మీద
కాలు మోపగలేక గబ్బిల మొక్కటె
చరణయుగళి దివికి సాచి నడచు’
అంటూ సాగిన వీరి వ్యంగ్య రచనాధోరణిలో సుతిమెత్తని పదజాలంతో సమాజానికి తీవ్రమైన మందలింపును, ఎత్తిపొడుపును మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది జాషువా కవిత్వ నైజగుణం. ఒక సామాన్య మానవునికి ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఒక బలమైన టానిక్ వలె నూరిపోయడం జాషువా కవిత్వంలో కనిపిస్తుంది.
అతడు వేమన! భువనమాయా తమస్సు
జీల్చి చెండాడిన బలశాలి! సిద్ధమూర్తి!
సకల సామ్రాజ్య భోగపిశాచములను
గోచిపాతకు బలియిచ్చికొన్న ఘనుడు!
అని వర్ణించడంలో భువన మాయా తమస్సు జీల్చి చెండాడిన బలశాలి, సకల సామ్రాజ్య భోగపిశాచములను గోచిపాతకు బలియిచ్చిన ఘనుడు అన్న ప్రయోగాలు కూడా ఆ వ్యక్తి గొప్పతనాన్ని మనసుపై ముద్రవేసినట్లుగా చెప్పడం జాషువా కవిత్వంలోని గొప్పతనమే. సృష్టిలోని ప్రతి ప్రాణికి తల్లి కంటే మధురమైన అనుభూతి మరొకటి లేదు. ఆ వాత్సమల్యామృత రుచులు మనసారా గ్రోలినాడు జాషువా. ఆయన వ్రాసిన ‘మాతృప్రేమ’ అనే ఖండిక ఆయన హృదయానికి అద్దం లాంటిది. పాల పొదుగు భారంతో మెల్లమెల్లగా నడచివచ్చె ధేనువు వలె కావ్యం విపుల రసభావభరితమై ఉండాలనడంలో తెలుగు కవిత్వం పట్ల జాషువా హృదయంలో ఉన్న పవిత్రమైన భావన కనిపిస్తుంది. స్వచ్ఛమైన ఆయన హృదయ వైశాల్యానికి సామాజిక దర్శనానికి ఆన కవిత్వం ఒక గొప్ప ఉదాహరణగా దర్శనమిస్తుంది మనకు.
(వ్యాసకర్త: తెలుగు అకాడమీ పూర్వ సంచాలకులు)
(సెప్టెంబర్ 28న గుర్రం జాషువా జయంతి)
-ప్రొఫెసర్ కె.యాదగిరి
93901 13169