నిన్నటి నుంచి నేటిలోకి
నేటి నుంచి రేపటిలోకి
వజ్రోత్సవం వైపు
పరిగెడుతున్న రజతోత్సవం
దేశ విదేశాల్లో విజయకేతనం
విత్తు పంటకు వాగ్దానం చేసినట్టు
తెలంగాణ వాగ్దానంతో ఉద్యమం
స్వరాష్ట్రం పర్జన్య సమర శంఖం
అవిరళ కృషి చైతన్య సందేశాలు
సబ్బండులేకమై అలుపెరుగని పోరు
స్వేచ్ఛకు ఊపిరులు జూన్ రెండు
రాష్ట్ర సాధనతో
ముంగిళ్లలో నదుల పరుగులు
అడుగడుగు అలల హోరులై పల్లెల్లో ప్రగతి
సాధికారత సజ్జకంకులు మురిసిన కులవృత్తులు
దేశానికి మార్గం తెలంగాణకు గౌరవం
నడిచిన దారంతా పూల తేరేమి కాదు
సీతమ్మ శోకం బాలనాగమ్మలా నలిపేశారు
నేలంతా అంతస్థులై అణచేశారు
అహంకారంతో అవమానించారు
కారుణ్యం వట్టిపోయిన కాలాన ఉద్యమ సూరీడు
నిప్పులో కాలి చలిలో వణికి
ఎండలో ఎండిన మానవహారాలు
అనేకానేక ఉద్యమాలు, సమ్మెలు, సత్యాగ్రహాలు
అరెస్టులు, బలిదానాలు,
నేల నేలంతా నెత్తురు సాళ్లు
మలిదశ ఉద్యమ ప్రస్థానాలు సందేహాలు సవాళ్లు
కలాలు గళాలు మట్టి మనిషి,
తట్టా బుట్టా, పుట్టా పార
ఉద్యమ నెగళ్లయి
నాటి నుంచి… అగమాగం అయోమయం కుట్రలు
తిన్నింటి వాసాలు లెక్కపెట్టే హీనులు
కనిపెంచిన తల్లినంటే కాదు కాదు
పినతల్లివని కారుకూతలు
దివ్వెను చూసిన చక్షువు దుర్మార్గాన్ని వీక్షిస్తుంది
భారత స్వాతంత్య్ర త్యాగాలనూ విన్నాం
మలిదశ తెలంగాణ పోరాటంలో పాల్గొన్నాం
భయపెట్టిన సింగాలు మాటుగాసిన తోడేళ్లు
వెక్కిరించిన నక్కలు ఇంటి నుంచి గెంటేసిన ఎలుగుబంట్లు విజయాన్ని కండ్లారా
చూసి ముడుచుకున్న తోకలు
సమైక్యవాదం చెల్లని నాణెం
జై తెలంగాణంటూ
ప్రజా పోరాటం తుది విజయం
తెలంగాణ కంటిలో కోటికాంతుల వెలుగులు
నమస్తే తెలంగాణ
(మలిదశ తెలంగాణ ఉద్యమం 25 ఏండ్ల సందర్భంగా…)
– వనపట్ల సుబ్బయ్య 94927 65358