దయచేసి ఈ రాళ్లనేం చెయ్యకండి
ప్రతి రాయి కిందా మూలిగే శవం ఉంది
శవం పక్కనే ఓ మనిషి ఏడుస్తూ ఉంది
ప్రతి రాయిలో ఒక నిశ్శబ్దం, అనేక శబ్దాలు
శబ్దరసాలే ప్రాణవాయువులుగా
జీవిస్తోంది-కాలగర్భంలో శిల
ప్రతి శిలలో శబ్దాన్ని మోస్తూ తిరుగుతోంది కాలం
కొంత సవ్యంగా, మరికొంత అపసవ్యంగా
పూల కొమ్మలతో విరిసి వసంతాలాడిన శబ్దం
మట్టిని కప్పుకొని శిలాజమైంది
దాని మీద మొలకెత్తిన శిల పర్వతమైంది
ఒకప్పుడు గలగలా పకపకా ఉరికిన నది
ఇప్పుడు పర్వతంలో సుడి తిరిగే కాలమైంది
చందమామలోని జింకపిల్ల చెంగు చెంగున దూకుతూ
శిల లోపలి సూర్యుడి చుట్టూ తిరిగే కాలమైంది
శబ్దాలు రుతువులై ఊహలై శిలల్లో కలలయ్యాయి
నా శకలాలే శిలారణ్యమై విస్తరించాయి
నా శకలాలే శిలారణ్యాల్లో
రాకాసి బల్లులై సంచరించాయి.
నేను అనేకమై శబ్దాన్ని పగలగొట్టి ముక్కలు చేశాను
మేము నిశ్శబ్దాన్ని పగలగొట్టి ఖండాలు చేశాం
పంచ ప్రాణాల కంటే ఎక్కువ ప్రేమగా
ఎవరి కలల గండశిలను వారు మోసుకుంటున్నాం
నా శకలాలు ఢీకొని నెత్తురోడే
సంగతి నాకు తెలియదు
అదేదో కర్రలతో కొట్టుకునే ఉత్సవంలా
తలలు పగిలి గాయాలై… రక్తమోడుతూ…
నాకు రోజూ శబ్ద శిలలు రువ్వుకునే పండుగే
ఉత్సవం ముగిసేసరికి, శబ్దాలు సద్దుమణిగిపోయి
ప్రతి శిలకిందా గాయాలతో మూలిగే మనిషి
ప్రతి మనిషి పక్కనా దుఃఖించే మరో మనిషి
ప్రతి శిల కిందా ఇంకోసారి ఉత్సవం కోరుకునే మనిషి
– వసీరా 91777 27076