బతుకమ్మ పండుగ చుట్టూ తెలంగాణ సంస్కృతి అల్లుకున్నట్టు… గౌడ వృత్తి చుట్టూ మానవ జీవితం పెనవేసుకొని ఉన్నది. గౌడ వృత్తి చుట్టూ పరుచుకున్న మానవ సంస్కృతిని అనేక కోణాల్లో, ఆకులోకి కల్లును ఒంపుకున్నంత సహజంగా కవిత్వంలోకి ఒంపిన తొలి గౌడ కవితా సంపుటి శీలం భద్రయ్య ఇటీవల వెలువరించిన ‘ముస్తాదు’ (A Radiant Armor).
దేశంలో కులగణన జరుగుతున్న సందర్భంలో శీలం భద్రయ్య వెలువరించిన ఈ ‘ముస్తాదు’ తెలుగు సాహిత్యంలో చిన్న కదలికను తెచ్చిందనే చెప్పాలి. ఆయా కులాల అస్తిత్వం, ఉత్పత్తులు ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తున్న తీరు, సంస్కృతిని ప్రభావితం చేస్తున్న పద్ధతి, జీవన విధానం అంతా చర్చ పెట్టాల్సిన సందర్భం ఇది. విశ్రాంతి వర్గాలకు, దోపిడీ వర్గాలకు, ఉత్పత్తి కులాలకు, బహుజన వర్గాలకు మధ్య గల అంతరాలను, జీవన వ్యత్యాసాలను దరువు వేసి చెప్పాల్సిన కాలం ఇది. తెలుగు నేల మీద అస్తిత్వ ఉద్యమాలు తారాస్థాయికి చేరుకున్న తరుణంలో ఈ ‘ముస్తాదు’ నిజంగానే బహుజన వర్గాలకు తేజోవంతమైన కవచం.
గౌడ వృత్తి కేంద్రంగా 360 కోణాల్లో సృజించిన మినీ కవిత్వం ఈ ‘ముస్తాదు’లో తొంగిచూస్తుంది. ఆత్మగౌరవాన్ని ప్రకటించుకోవడం అస్తిత్వ ఉద్యమాల ప్రాథమిక లక్షణం. అందుకే, ఈ కవి ‘కల్లు మా కుల దేవత/ మండువా మా భరతమాత/ తాటి చెట్టు మా జాతి పతాక/ సర్వాయి మా జాతిపిత’ అని సగర్వంగా చాటుతున్నాడు. పోకిరి జనాలు కొంతమంది గీత వృత్తిని చులకనగా చూస్తుంటారు. ‘కల్లుందా? పిల్లుందా? అని అడగకండి/ మండువాలో… అమ్మా చెల్లి ఉంది’ అని వృత్తికి కుటుంబ మద్దతు ఎంత అవసరమో చెప్తున్నాడు. కల్లు విక్రయంలో సహకరించే మహిళలను ఎలా చూడాలో కూడా చెప్తాడు.
‘ముస్తాదు’లో సామాజిక దృక్పథంతో పాటు కవిత్వ దినుసు కూడా ఎక్కువే ఉన్నది. కవితా, శైలి శిల్పాలు, కవి వాడిన ప్రత్యేక జార్గాను, భావచిత్రాలు, ప్రతీకలు కొత్తచూపును ప్రసాదిస్తాయి. ‘కల్లు తాగిన వెన్నెల/ నవ్వితే/ చీకటి కూడా చిన్నబోయింది’ అంటాడు. ఇక్కడ ప్రాణం లేని వెన్నెలను ‘కల్లు తాగింది’ అని, అది ‘నవ్వింది’ అని, ‘చీకటి చిన్నబోయింది’ అని మానవ లక్షణాలను (Personification) ఆపాదించిన తీరు అమో ఘం. వెన్నెలకు మత్తును ఆపాదించడం ద్వారా ఒక వినూత్న భావనను సృష్టించాడు కవి. సాధారణంగా స్వచ్ఛంగా, ప్రశాంతంగా ఉండే వెన్నెలకు మత్తును జోడించడం ద్వారా ఒక అసాధారణమైన, ఉల్లాసభరితమైన రూపాన్నిచ్చాడు. నవ్వు ఆనందానికి, ఉత్సాహానికి ప్రతీక. వెన్నెల నవ్వినప్పుడు చీకటి కూడా సిగ్గుపడి, చిన్నబోయిందని చెప్పడం అతిశయోక్తి. ఇది వెన్నెల కాంతి ఎంత శక్తివంతంగా, అద్భుతంగా ఉందో తెలియజేస్తుంది.
‘ముస్తాదు’ కవితా సంపుటి గౌడ వృత్తి జీవన చిత్రణకు మాత్రమే పరిమితం కాకుండా, ఆ వృత్తిలోని శ్రమ, సంస్కృతి, ఆత్మగౌరవం, సవాళ్లను లోతుగా ఆవిష్కరించింది. కవి తన అనుభవాలను, ఆ వృత్తిలోని ఆటుపోట్లను ఎంతో ఆర్ద్రంగా, శక్తివంతంగా ఆవిష్కరించిన తీరు, గౌడ వృత్తి పట్ల ఒక సరికొత్త అవగాహనను, గౌరవాన్ని పెంపొందిస్తుంది. ఈ సంపుటి గౌడ వృత్తిలోని ప్రతి అణువును ఆవిష్కరించిన జీవనయాత్ర. ఇందులోని ప్రతి అక్షరం గౌడ వృత్తి పట్ల లోతైన అంతర్దృష్టిని కలిగిస్తుంది. ‘ముస్తాదు’ కవితా సంపుటి గౌడ వృత్తి జీవనశైలికి ఒక చారిత్రక రికార్డు. సామాజిక అధ్యయనాలకూ ఒక విలువైన వనరు.
– డాక్టర్ వెల్దండి శ్రీధర్ 98669 77741