పుడమితల్లితో కలిసి బతుకుతాడతడు.
కృషీవలుడై కాలంతో కుస్తీ పడుతాడతడు.
అతడినిచూస్తే బీడుభూములన్ని
పానం పోసుకుంటాయి.
అతడిపాదం మోపితే మాగానిసాలన్ని
పచ్చని పందిరై పరవశిస్తాయి.
మనందరి ఆకలి రుణం తీర్చుకోవడానికి
పుట్టాడేమో ఆ అన్నదాత.
అతడి రెక్కలెప్పుడు మట్టితో
పెనవేసుకుంటాయి.
దేహంనుంచి రాలుతున్న చెమటచుక్కలు…
భూమాతను ముద్దాడుతూ..
పసిడిసిరులను కురిపిస్తాయి.
తన కళలప్రపంచాన్ని
పొలంగట్టుకాడ సమాధిచేసి..
రూపంలేని ఆకలిబాధలను తీర్చడానికి..
సేద్యకాడై పోరుచేస్తాడు.
చీకటి బతుకులో కన్నీటిపాటనందుకుంటాడు.
అశ్రుధారలతో మొక్కలకు జీవం పోస్తాడు.
అతని తనువంత మట్టి..గంధమై
అంటుకుంటుంది.
కష్టాల పవనాలు వీస్తువున్నా..
చలించని కష్టజీవై సేనులో..
ఆకుపచ్చని పంటలరాగమందుకుంటాడు.
నక్షత్రాలను మూటగట్టి
విత్తనాలుగా చల్లుతాడు.
కాలుతున్న కడుపులమీద…
అతడి కష్టాన్ని కరిగించి..
బుక్కెడుబువ్వయి ఆకలితీరుస్తాడు.
మనందరికి గోరుముద్దలు తినిపించే…
అమ్మలాంటి అన్నదాత అతడు.
కష్టానికి ఫలితం ఆశించని అసలుసిసలైన
ధర్మాత్ముడతాడు.
ప్రపంచానికి పట్టెడన్నం పెట్టడానికి
అనునిత్యం రవికిరణాలై వెలుగుతాడతడు.
పళ్ళెంలో నాలుగు మెతుకులు వేసుకొని
ఐదువేళ్ళు నోట్లోకి వెళ్లినప్పుడల్లా
మా గుండెలో… నువ్వు శంఖువై మోగుతావు.
కళ్ళలో కన్నీటి సుడులై తిరుగుతావు.
-అశోక్ గోనె
94413 17361