కొంత పురాణ పాండిత్యం ఉన్నవారికి బాదరాయణుడు అంటే వ్యాస భగవానుడే గుర్తుకువస్తాడు. పురాణ పాండిత్యం లేనివారికి బాదరాయణ సంబంధం అంటే ఏమిటో అర్థం కాదు. ఇలాంటివారి దగ్గర ఏదో ఒకటి వాగేస్తే సరిపోతుందనుకుంటే తర్వాత తర్వాత వారి అర్థ రహిత వాగుడే వారి తలకు పామై చుట్టుకునేటట్లు కాలం తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తుందన్నది కాల ధర్మం.
ఆంగ్ల భాష ప్రభావంతో తెలుగు నాట సామెతలు, నానుడులు, పొడుపు కథలు వంటివి తగ్గుముఖం పట్టాయి. విద్యారంగంలో అక్కడక్కడ కనిపిస్తున్నప్పటికీ, అవి పరీక్షలకే పరిమితమవుతున్నాయి. వాడుకలో మాత్రం తగ్గిపోతున్నాయి. సామెతలు, నానుడులు, పొడుపు కథలు మన ప్రాచీన ఆచార వ్యవహారాలను, సంస్కృతి, సంప్రదాయాలను, విజ్ఞాన విషయాలను తమలో నిక్షిప్తం చేసుకుని ఉంటాయని పెద్దలు చెబుతారు.
అలాగే మన యాస, బాష, కట్టు, బొట్టు ఒట్టు, కనికట్టుల మూలాలన్నీ సామెతల్లో దర్శనమిస్తుంటాయి. అయితే అందులో కొన్ని సామెతలు, నానుడులు కుల, మత, వర్గ వైషమ్యాలను పెంచి పోషించేవి విధంగా ఉంటాయన్న విషయం మరిచిపోరాదు.
సామెతలు, నానుడులను కొన్నిటిని జాగ్రత్తగా పరిశీలిస్తే వాటి వెనుకనున్న అర్థాలకు ఆయా పదబంధాలకు అసలు సంబంధం ఉండదు. దీనినే అర్థ విపరిణామం అని భాషా శాస్త్రవేత్తలు రకరకాల నిర్వచనాలను ఇస్తారు. నిర్వచనాల సంగతి పక్కనపెడితే అలాంటివి సమాజానికి మేలు కంటే కీడే ఎక్కువ చేస్తాయి. ముఖ్యంగా పెద్దల మార్గాన్ని అనుసరించాలనుకునే సాత్వికులు ఇలాంటి సామెతలు, నానుడులు వంటివి విశ్వసించి ఇబ్బందులకు గురవుతుంటారు.
ఉదాహరణకు బాదరాయణ సంబంధం అనే పద ప్రయోగాన్ని తీసుకుందాం. ‘ముక్కు మొహం తెలియనివాళ్ల దగ్గరకి వెళ్లి తెలివిగా ప్రవర్తించి తన అవసరం తీర్చుకోవడం కోసం ఏదైనా ఒక సంబంధం కలుపుకోవడానికి వేసే ఎత్తుగడ’నే బాదరాయణ సంబంధం అని అంటారు. మన పండితుల్లో ఎక్కువ మంది ఇదే అర్థాన్ని చెబుతారు. అలాగే వివిధ నిఘంటువులు కూడా ఇదే అర్థాన్ని చెబుతున్నాయి.
బాదరాయణ సంబంధం అనే అంశంపై మనవారు ఒక కథ కూడా చెబుతారు. అదేమిటంటే.. ఒక పెద్దాయన ఎద్దులబండి మీద వేరే ఊరికి వెళ్తున్నాడు. మధ్యాహ్నం 12 గంటలు దాటింది. ఆయనకు బాగా ఆకలి వేసింది. దీంతో రేగు చెట్టు ఉన్న ఒక ఇంటిని చూసి ఆగాడు. ఇంట్లోకి వెళ్లాడు. ఆ ఇంట్లో ఇల్లాలు మాత్రమే ఉంది. ఆమెను కుశల ప్రశ్నలు అడిగి, తను ఆమె భర్త బంధువుగా పరిచయం చేసుకున్నాడు. కొంచెం సమయం అయ్యాక ఆమె భర్త వచ్చాడు. తన అతని భార్య బంధువుగా అతన్ని పరిచయం చేసుకున్నాడు. చక్కగా ఆందరూ భోజనాలు చేశారు. మళ్లీ బంధుత్వ చర్చ వచ్చినప్పుడు భార్య ‘ఆయన మీ బంధువట కదా?’ అంటుంది. ‘కాదు, కాదు.. మీ బంధువేనట కదా?’ అని భర్త అంటాడు. అప్పుడు ఇద్దరూ కలిసి ఆయనతో ‘అయ్యా! మీకూ, మాకూ సంబంధం ఏమిటి?’ అని అడుగుతారు. అప్పుడు ఆయన ఇలా చెబుతాడు.
‘యుష్మాకం బదరీ చక్రం అస్మాకం బదరీ తరుః.. బాదరాయణ సంబంధో యూయం యూయం వయం వయం’
దీన్ని బట్టి అతగాడు సంస్కృత భాషా పండితుడు అని తెలుస్తుంది. (శ్రీ సూర్యరాయాంధ్ర అయిదవ సంపుటం 90వ పేజీలో ఈ శ్లోకం ఉంటుంది.) మా బండి రేగు చెక్క తో తయారు చేయబడింది. మీ ఇంటి ముం దు రేగు చెట్టు ఉంది. ఇదే మన సంబంధం బాదరాయణ సంబంధం అని ఈ శ్లోకానికి అర్థం. నిజానికి బాదరాయణ సంబంధం అనే పదబంధానికి ఈ కథకు ఎలాంటి సంబంధం లేదు. అలాగే వెర్రిబాగులవాడిని, అసమర్థుడిని బాదరాయణుడు అని పిలుస్తారు. వాడుత్త బాదరాయణుడు అంటే పనికి మాలినవాడని అర్థం.
నిజానికి బాదరాయణుడు అంటే వేదవ్యాసుడు అని అర్థం. బదరీ ద్వీపంలో పుట్టినందు వలన వ్యాసునికి బాదరాయణుడు అనే పేరు వచ్చింది. బాదరాయణుడు అని పిలవబడే వ్యాసుడు వెర్రివాడు కాదు. పంచమ వేదం అనదగిన మహాభారతాన్ని గణపతి రాస్తుండగా తను చెప్పాడు. అలాంటి బాదరాయణుడు వెర్రివాడు ఎలా అవుతాడు? అంటే కొందరు పండితులు ‘ఆ.. ఇదంతా జానపదులు ఎవరో కల్పించారండి’ అంటూ ఆ తప్పును జానపదుల మీదకు తోసేస్తారు. మరికొందరు బాదరాయణుడు.. ఆ బాదరాయణుడు కాదండి’ అంటారు.
కొంత పురాణ పాండి త్యం ఉన్నవారికి బాదరాయణుడు అంటే వ్యాస భగవానుడే గుర్తుకువస్తాడు. పురాణ పాండిత్యం లేనివారికి బాదరాయణ సంబం ధం అంటే ఏమిటో అర్థం కాదు. ఇలాంటివారి దగ్గర ఏదో ఒకటి వాగేస్తే సరిపోతుందనుకుంటే తర్వాత తర్వాత వారి అర్థ రహిత వాగుడే వారి తలకు పామై చుట్టుకునేటట్లు కాలం తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తుందన్నది కాల ధర్మం.
ఇక పై కథ, శ్లోకం ప్రకారం సశాస్త్రీయంగా ఆలోచిస్తే అది బదరీ సంబంధం అవుతుంది కానీ, బాదరాయణ సంబంధం కాదు. పురాణాల లెక్క ప్రకారం హిందువుల పూజలో ప్ర ధానంగా నిలిచే వృక్షాల్లో బదరీ ఒకటి. సూర్య భగవానునికి రేగు పండ్లు అంటే మహా ఇష్టం. బద్రీనాథ్‌లో ఉన్న బదరీ నారాయణునికి రేగు పండ్లు అంటే ఇష్టం. అరణ్యంలో ఉన్న శ్రీరామచంద్రుడు తండ్రి చనిపోయాడని తెలియగానే బదరీ పండ్లతోనే తండ్రికి పిండ ప్రదానం చేశాడు. శ్రీరామునికి శబరి తినిపించినది కూడా రేగు పండే. నర నారాయణులు బదరీ వనమునందే తపస్సు చేశారని పోతన గారి కింది పద్యం ద్వారా తెలుస్తున్నది.
‘అనఘులు బదరీవనమున
వినుత తపో వృత్తి నుండ,
విబుధాధిపుడున్
మనమున నిజ పద హానికి
ఘనముగ చింతించి
దివిజకాంతామణులన్’
ముక్కూ మొ హం తెలియని వాడి దగ్గరకు వెళ్లి తెలివిగా ప్ర వర్తించడం అనే అర్థాన్ని చెప్పడం కూడా నూ టికి నూరు శాతం అశాస్త్రీయమే. అయితే, ఈ బాదరాయణ సంబంధం పద సృష్టి ఎలా జరిగింది? అంటే వ్యాస భగవానునిది, గణపతిది బాదరాయణ సంబంధం. వ్యాసుడు చెబుతుంటే పంచమ వేదం అనదగిన మహాభారతాన్ని గణపతి రాశాడు. బంధువు కాకున్నా, శిష్యుడు కాకు న్నా, మిత్రాదులు కాకున్నా పవిత్ర కార్యంలో పాలుపంచుకున్న వారిని ఉద్దేశించి ‘మీది బాదరాయణ సంబంధం’ అని అనాలి. అంతేగానీ ముక్కూ మొహం తెలియని వాని దగ్గరకు వెళ్లి అతి తెలివిని ప్రదర్శించినవానిది బాదరాయణ సంబంధం అనడం, అలాగే వెర్రివాని సంబంధం బాదరాయణ సంబంధం అనడం వలన పురాణాల మీద గౌ రవం కంటే అవహేళన అధికంగా కలుగుతుంది.
– వాగుమూడి లక్ష్మీరాఘవరావు 62814 90160