పొక్కిలై వెక్కిరించిన వాకిళ్ళు
నెర్రెలు బారి ఏడిపించిన ఎవుసం
ఉపాధి లేక వలస పోయిన ఊర్లు
పరాయి పాలకుల వెర్రి కూతలు
అవమానాలను ధిక్కరించి
శిథిల తెలంగాణను పచ్చని శిల్పంగా మలిచిన పాలన!
చెరువులు అలుగులు దుంకిన జీవ కళ
ఉపాధి దొరికి మనాది మరిచిన జీవితం
రైతు కాళ్ళను పెనవేసుకున్న పచ్చటి పంటలు
పాలపిట్టలతో ముచ్చట్లు పెడ్తున్న
రైతు రాజ్యం నా వర్తమాన తెలంగాణ!
కరోనా వేళ దేశమంతా తలుపులు వేసినా
వలసకార్మికున్ని వడిలోకి తీసుకొని
భరోసా ఇచ్చిన మానవత్వపు ప్రతీక నా తెలంగాణ!
రైతు పంటను ప్రతిగింజను కొని
దేశానికి తిండి పెట్టి
భరతమాత సిగలో తంగేడు పువ్వై సంబురపడ్డది
నా బంగారు తెలంగాణ!
ఆధ్యాత్మిక క్షేత్రాల వెలుగు దీపాల దారిలో
సకల మత సమారాధన పూల సుగంధం నా తెలంగాణ!
తెలంగాణ ఇంకా తెలివితోనే ఉంది
ఉమ్మడి జాబితాను ఉరి వేసి
సమాఖ్య పాలనను సమాధి చేసి
కులమతాల కుంపట్లను రాజేసే దుష్ట శక్తులకు
వాతలు పెట్టేందుకు
నా తెలంగాణ కొలిమి రాజేస్తున్నది…
-ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్
98490 82693