తెలంగాణమా!
నా ప్రాణమా!!
ఒక గుడి, ఒక మసీదు, ఒక చర్చి..
నడిచివెళ్లే ఇంటింటికీ
ఇనుప గోడలల్లుతున్న
సాలీడులు తిరుగుతున్నాయి…
గడపలకు
విద్వేష బొట్లు పెడుతున్నాయి
దుఃఖం మీద దునుకులాడుతూ
దూరదూరాలు పంపిణీ చేస్తున్నాయి
వాటి అడుగుల్లో
మంటలు లేస్తుంటాయి
వాటి మాటల్లో
విద్వేష వాసనొస్తుంది
నా ప్రియతమా!
మూసీ ప్రవహిస్తున్న గుండెల్లో
మానవతా పరిమళాల మాగానివి
గోదావరై ప్రేమలు ప్రవహించేదానా!
మనసులు కలిసిన చేతుల మీంచి
ఇనుప నాడాలతో నడిచిపోతున్నాయి
పంట కావలి మంచై చార్మినార్
కమ్మటి దాల్చా జుర్రుకునే
మతాతీత మనసులు
అలాయి బలాయి ఆత్మీయతలు
పీర్ల పంజాలు తాబుతులు పోచమ్మల
పట్టుకు తిరిగే మానవీయ గానమా!
లోపాల మనసుల
దారి పడనీయకు
పాలకంకుల మనసుల గొంతుల్లో
ద్రోహ శిరస్సుల
విషధారలు కురువనీయకు…
వడ్డెబోయిన శ్రీనివాస్
98857 56071