చితికిన దక్కన్ గుట్టలకు ..కూల్చికాల్చివేస్తారన్న భయంతో
వణుకుతున్న గునుగుపూల భూమికి ఉద్యమాల నీరుతాపి
కాలం కమ్మీ పై ఆరని ఉద్యమజ్యోతుల్ని వెలిగించిన
నిప్పు రవ్వనీ తెలుసు
ఎర్రమట్టి పులుముకున్న చెదగడపల పొక్కిలి దుఃఖం
తంగేడుపూల జాతరలో ఘల్లుమన్న ప్రత్యేక తెలంగాణ కోటికలల దేహంపై తొడ చరిచిన వీరుడిగా..
మా ఉద్యమ ఊపిరి నీవేనని తెలుసు
నెత్తురోడుతున్న జొన్నకంకి భూమి
కుట్రదారుల దౌర్జన్యాల నెగడుపై నుసిగాక మునుపే
రక్తపాత రహిత ఉద్యమకారుడిగా..
ఇనుపబూట్లను గూట్లో ముడిచిన
నీ గులాబీ దండ కడియం భుజంపై వాలిన శాంతి కపోతం సాక్షిగా..
నీవే మా శాంతి దూత వనీ తెలుసు
పరాయితనం ..ఎక్కిరింతల ఎకసెక్కాలతో
సోయిదప్పి చిద్రమౌతున్న అణగారిన గొంతుకల దూపదీర్చి..
ఆత్మను తొలచి మలచిన దేహంగా..
కుదేలైన కులవృత్తుల దిగూట్ల దీపం బెట్టిన
దఖ్ఖనీ పీఠభూమి మెరిశేటి దీపస్థంభమా..!
నీవే మా హక్కుల స్వరమనీ తెలుసు..
ఉద్యమాలఉక్కుస్వరమై.. రజాకర్ల క్రౌర్యంతో
కుతకుతలాడిన మాభూమి కొలిమిలో
పేలిన తూటాగా నీ మాట బతుకును పణంగా పెట్టిన నీ శౌర్యం
నయవంచకుల వెన్నులో చలికేంద్రకమై అంటుకుపోగా..
పెచ్చులూడుతున్న తెలంగాణ ఆత్మకి ఆదిగురువై కట్టుకట్టి ..
ఒక పరాధీనరేఖ వెంబడి ఎతచితలైన
ఇక్కడి మనుషుల సరిహద్దు గాయాలను
ఒక సంచార దుఃఖపాత్రుడివై..కంచెగట్టి నిలిపిన ఆచార్యుడివనీ తెలుసు
సబ్బండ వర్ణాల దుఃఖపు తిత్తుల్ని జోడించిన కలల పాలపిట్టగా..
మా సుదీర్ఘ లోకాల వెలుతురు దర్వాజపై జజ్జనకనజనారే గజ్జెల గజ్జెలల్ల స్పర్శతో దరువేస్తున్న అవిశ్రాంత పోరుతరంగం..
మా పాడువడ్డ బాయిలల్ల పేరుకున్న
గుబులు చీకట్లను పారదోలే ఉద్యమ వేకువ కంజిర..
మా బతుకులకు భరోసా నిచ్చే సాహిత్య సామాజిక దార్శనికుడివనీ.. నివద్దిగ తెలుసు..!!
బి.కళాగోపాల్ 9441 631029