యుద్ధంలో కావలసింది
యుద్ధం చేయడం
ఆర్తనాదాలు కాదు
కన్నీళ్లు కార్చడం కాదు
గులగటాలు కాదు
మబ్బుల రాక కోసం నింగి వైపు
చూడటం కాదు
యుద్ధమేఘాల జాడలున్నాయి
వాటిని పసిగట్టడం కావాలి
యుద్ధంలో కావలసింది
యుద్ధం చేయడం
ఈ నేల రక్షణకు
ఈ జాతి భవిష్యత్తుకు
తెలంగాణ తల్లి చిరుహాసానికి
గతం పునరావృతం కాకుండేందుకు
పోరాటాల వారసత్వం మాసిపోక నిలిచేందుకు
ఇప్పుడు కావలసింది యుద్ధం
యుద్ధంలో కావలసింది
యుద్ధం చేయడం
ఈ గడ్డ తెర్లుతెర్లు కాకుండేందుకు
తిరిగి వస్తున్న పొరుగు రాబందులు మళ్లీ
హైదరాబాద్‌పై రెక్కల నీడలు పరవకుండేందుకు
ఇప్పుడు కావలసింది యుద్ధం
యుద్ధంలో కావలసింది
యుద్ధం చేయడం
ఎడతెగని సమీక్షలు కాదు
ఎటూతేలని భాషణలు కాదు
కాలయాపనలు కాదు
అంతులేని వ్యూహరచనలు కాదు
ఇప్పుడు కావలసింది యుద్ధం
యుద్ధంలో కావలసింది
యుద్ధం చేయడం
-టంకశాల అశోక్