రెండు చేతులు
చేయూతనిచ్చే చేతులు
సమాజ దేహ గౌరవాన్ని
సంరక్షించే చేతులు
చేనేత చేతులు
కుల, మత, వర్ణ, ధారలను
అల్లికలుగా కలిపి జాతీయత
బావుటాను ఎగురవేసిన చేతులు
చేనేత చేతులు
ఫకీరు నుంచి ప్రధాని దాకా
బట్టలు లేనిదే బయటికి రారు
అందమైన బట్టలను నేసి అందించి
గౌరవాన్ని కాపాడిన చేతులు
చేనేత చేతులు
ఎందరో దుర్యోధన సోదరుల నుండి
ఎందరో పండితుల
ప్రాణ మానాలను కాపాడిన చేతులు
చేనేత చేతులు
కాలం ఏదైనా
కలకాలం నీ వెంట నడిచి
నీ దేహంలో భాగమై
నిన్ను కలికాలం నుంచి
కాపాడే చేతులు
చేనేత చేతులు
పండుగకు, పబ్బాలకు
పట్టు వస్ర్తాలనందించి
పాత బట్టలు కట్టుకున్న
పరహిత చేతులు
చేనేత చేతులు..
బహుళ జాతి కంపెనీల
వేటుకొక చేతి తెగి
ఒంటి చేత్తో జీవన యుద్ధం చేసే
చేనేత చేతులకు
రాయితీ, సబ్సిడీల వంటి
మందుపూసి ఆదుకోవాల్సిన
కేంద్ర ప్రభుత్వం మాటు కాటు వేస్తే
పన్ను వేసి వెన్ను విరిస్తే
మగ్గంపై మగ్గిపోతున్న
జీవితాలకు అగ్గిపెట్టే జీఎస్టీ
కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తే
ప్రభంజనమై హోరెత్తి
ప్రభుత్వాన్ని నిలదీస్తాం!!
ప్రగతి దారులు మేం వేస్తాం!!
– చిక్కొండ్ర రవి బుద్ధారం