అందమైన కావ్యకన్యక
అద్భుతంగా నడిచింది పోటీ గదిలోకి
నిర్వాహకులు నిశ్చేష్టులయ్యారు
న్యాయ నిర్ణేతలు నోరెళ్లబెట్టారు
ఆమె నడకలోని నయగారాన్ని చూసి.
సంభాషణ సాగింది..
నిరుపమానంగా వెలుగుతున్నావ్
కానీ, నిన్ను సృష్టించినతను రావాలిటు
అప్పుడే ఈ పోటీలో నీకు చోటు…
ఆయనకు బిడియం, బెరుకు
బిడియాన్ని బింకంగా, బెరుకును బెట్టుగా
అపార్థం చేసుకోకండి అయ్యల్లారా!
నన్ను పుట్టించింది ఆయనే అయినా
పోటీకి వచ్చింది నేనే..
అమ్మాయీ, లాభం లేదు
ఆయన వేంచేయకుంటే నీకు అవకాశం రాదు..
అయ్యో, ఇదేమి విడ్డూరం?
ఇందులోని ఔచిత్యం హారతి కర్పూరం
అలాగే ఆవిరైపోతుందది ఇది సత్యం
దయవుంచి నన్ను చేర్చుకోండి పోటీలో..
నా భవితవ్యాన్ని తేల్చండి అటో ఇటో..
విచిత్రంగా కనిపించవచ్చు నీకు మా రూల్సు
కానీ, పోటీని ఎలా నడపాలో మాకు బాగా తెల్సు
ఎంతగా కోరినా వాళ్లు ఒప్పుకోలేదు..
అక్కణ్నుంచి ఆమె వెళ్లక తప్పలేదు
మల్లగుల్లాలు పడ్డాక
వెల్లడించారు విజేతను
మామూలు ప్రతిభకు మాన్యత దక్కింది
అపురూప రచనకు ఆదరణ కరువైంది..
-ఎలనాగ , 98669 45424