నేను కన్నీటి నిజాన్ని
అమ్మకు, నాన్నకు
సమాన దూరాన్ని
వారి నడినెత్తిన భారాన్ని…
అమ్మ ఒడిలో
బడిలో పెరగని
ఓ విషాద తంత్రిని…
చాకిరికి నేస్తాన్ని
చీపురు కట్టకు దోస్తీని
నాటుకు, కోతకు మధ్య
నిరంతరం శిలువ
వేయబడుతున్న
కన్నీటిధారను…
మట్టి పొరలలో దిగబడుతున్న
ముత్యమంత ముగ్గును..
ఆర్ద్రత నిండిన జీవితంలో
భద్రత లేని భూ మండలంలో
నన్ను నేను వెతుకుతున్న
కలని, మనోభారాన్ని…
ఏ రేఖ మండలంలో
నాదైన కాలాన్ని వెతకాలి?
ఏ అక్షాంశంలో
నా ఆనందపు అడ్రస్ దొరికేది?
ఆడపిల్లను
అవనికి, అంబరానికి
చెందని
ఓ వింత పదాన్ని
మనో చింతను
ఆడపిల్లను.
-సాదె సురేష్