బాల్యమంతా గొడ్డు గోద తోటి
శేను శెల్కల పొంటి భారంగా గడిచింది
బలపం పట్టుకొని బడి తోవ కంటే
కాడి మేడితోటి కాలమెల్లి పోయింది
పగటి పూట ఆకలి రాకాసి రంకెలేస్తుంటే
ఊస బియ్యం ఊదుకుంటూ తిని
శెలిమల నీళ్లు తాగి సేదతీరిన రోజులు
ఇంకా నా మది నిండా
మెదులుతూనే ఉన్నాయి.
నా బతుకంతా ఆటుపోటుల సంద్రమే
సర్కస్ లో తీగపై నడిచే వ్యక్తి చందమే
కన్నీళ్ల సుడులను కనురెప్పల
మాటున దాచుకుంటూ,
మాటల ఈటెలకు వరి కంకిలా
వంగిపోకుండా
కష్టాల వాగులో ఎదురెక్కిన చేపను నేను
ఎదలో రగిలిన కోరికలను కొట్టంలోకట్టేసి
కండ్లను కాగడాలుగా చేసుకొని
పుస్తక ఆకాశంలో అక్షర చుక్కలను
ఏరుకున్న ఉషోదయ కిరణం నేను
మాట్లేసిన లాగులు, పల్లుబట్టిన అంగీలు
పాదాలకు పాద రక్షకాలు నోచకుండా
కళాశాలకు కదిలిన రోజులను,
గండి పడ్డ గుండెను ఓదార్చుకుంటూ ,
కన్నీటి బిందువులకు
ఆనకట్ట వేసుకుంటూ
కదనరంగమై కదులుతున్నాను
పండగకు నాన్న దాచుకున్న
ఒక్క పంచెను చింపి
నా ఒంటిమీదకి అంగీగా
మార్చిన మా అమ్మ చేతులు
ఇంకా నా కండ్ల ముందు
కదలాడుతూనే ఉన్నాయి
అమ్మ చెప్పిన కష్టాల కథలు
నాన్న ఒంపిన ధైర్యపు ఫిరంగులతో
దిగులు తెగులును తగలబెట్టుకొని
జ్ఞాపకాల బొంతను కప్పుకొని
జీవిత చక్రాన్ని లాగుతున్నాను
కాలం విసురుతున్న ఉలి దెబ్బలకు
నాకు నేను శిల్పంగా మారుతున్నాను.
-తాటిపాముల రమేష్ , 79815 66031