అప్పుడక్కడ నువ్వు లేవు
నీ ఆనవాళ్లు మచ్చుకైనా కానరావు
అది నీకు తెలుసు
నాకు తెలుసు
విశ్వం మొత్తానికి తెలుసు
అయినా నువ్వు కథలు చెబుతున్నావు
అలవోకగా…
నువ్వే కథా నాయకుడివైనట్లు
సమరానికి సారథిగా ఉన్నట్లు
నీ త్యాగాన్ని మరొకరు కబ్జా చేసినట్లు
నువ్వేమైనా చెబుతావు!
తప్పెట్లు మోగించి
దీపాలు వెలిగించి
జెండా లెగరేసి
ఛాతీలని పొంగించి
నీ కథలకు మురిసే మత పుష్పాలున్నాయి కదా!
అమృత గానం కోకిలది కాదు కాకి దంటుంటే
విజయ గర్జన తోలు కప్పుకున్న
నక్కదేనని నమ్మ బలుకుతుంటే
కనుల ముందు జరిగిన చరితపై
కాషాయం కప్పుతుంటే
సాక్షీభూతమైన కనులెందుకో
స్రవిస్తున్నాయి రుధిరాన్ని
నీ తెంపరితనానికి నిరసనగా…
రగులుతున్న ఆగ్రహ జ్వాలకు సంకేతంగా…
(స్వాతంత్య్ర పోరాటంలో కానీ, తెలంగాణలో సాగిన నైజాం వ్యతిరేక పోరాటంలో కానీ
ఏ మాత్రం పాత్ర లేనివాళ్ళు వేస్తున్న వీరంగాలకు కినిసి)
-వి.ఆర్. తూములూరి