ఔను… ప్రతి జననమూ అతి బీభత్సమే
తల్లి గర్భంలోని ‘మాయి’ సంచిని చీల్చుకొని
పుట్టడం ఒక ప్రాణాంతక పెనుగులాట
జనన బీభత్సం గురించి…
ఒక తెలంగాణ మనిషినడుగు.. చెప్తాడు
690 ఏండ్ల బానిస బతుకు గురించి
సుల్తాన్లు, బహమనీలు, కుతుబ్‌షాహీలు
మొఘల్లు, అసఫ్‌జాహీల నుంచి…
ఆంధ్ర పాలకుల దాకా
అరె- అది కొచ్చెటి ఇనుప మేకులపై
బోసిపాదాలతో ఉరుకుడు
కళ్ల నిండా రక్తాశ్రువులు నిండిన
వెట్టిచాకిరి పశు బతుకులు
తెలంగాణ సాయుధ రైతాంగ
పోరాటమై చిమ్మిన లావాలో నుండి
పుష్పించిన రక్త చరిత్రలో
ప్రతి మరణమూ సౌందర్యమే
జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌లు, సర్దేశాయిలు
దొరలు, జమీందార్లు
ఒక మనిషికి లక్షా యాభై వేల
ఎకరాల భూమున్న కాలం
దేశం ఒకటే ఐనా
తెలంగాణ పౌరులకు రెండు స్వాతంత్య్ర దినాలు
ఒకటి 14 ఆగస్టు 1947
మరొకటి 17 సెప్టెంబర్ 1948
ఒకటి కన్న తల్లి, మరొకటి మరుమన్న తల్లి
తల్లి ఎవరైనా ‘భూదేవి’ ఒక్కతే…
తెలంగాణ అంటే భూమికీ
మనిషికీ మధ్య పేగు బంధం
తెలంగాణ అంటే భూమి నుండి
మొలకెత్తిన శివుని అగ్ని శూలం
1969 భీకర విముక్త పోరాటంలో
వందల మంది ప్రాణార్పణ… తొలి ఉద్యమం
2001 నుండి తెలంగాణ జాతిపిత
కేసీఆర్ మృత్యుకుహర ప్రయాణంతో
మొదలైన రణనినాదం…
‘తెలంగాణ వచ్చుడో చచ్చుడో’
సూర్యుడొక్కడే… తెలంగాణ ప్రజాపతి ఒక్కడే…
ఆదిపురుషుడు.. భగీరథుడు
అప్పటికి 2014లో అది చీకటి రాజ్యమే
అన్నీ బయటి శత్రువుల, ఇంటిదొంగల
అపహాస్య వెక్కిరింపులే
కాని ప్రభాతోజ్వల ప్రాణదాత కేసీఆర్ ఒక్కడే
ఈ నేలను, ఈ గాలిని
ఈ ప్రజలను , ఈ దుఃఖాన్ని
ప్రేమించి అనునయించిన
దార్శనిక రుషి ఒక్కడే.. కేసీఆర్
అరె- దక్కన్ పీఠభూమిరా ఇది
నదులు జరజరా జారుకుంట
సముద్రంతో సంభోగించడమే
ఇది జలరహిత గొడ్రాలు నేల శతాబ్దాలుగా
అందుకే కాకతీయులు
‘గొలుసుకట్టు చెరువు’లన్నరు
నిజాం నవాబులు ‘సాగర్’లన్నరు
అట్ల కాదని గోదావరిని రివర్స్ ఇంజినీరింగ్‌తో
170 కిలోమీటర్ల దూరం
618 మీటర్ల ఎత్తుకు ఎదురు ఎగబాకించి
ఒక్క కాళేశ్వరంతో ప్రపంచ కీర్తిని
సాధించిన ప్రజాచక్రవర్తి అతడు
కోటి ఎకరాల నేల పచ్చని పట్టుచీరను
సింగారించుకున్నదిప్పుడు
ఇంటింట్లో గోదావరి
ఇంటి బయట వాకిట్లో
కట్టేసిన ఎడ్లలా విద్యుత్ శక్తులు
పదుల సంఖ్యలో ప్రజా సంక్షేమ
పథకాలతో ‘సర్వేజనా సుఖినోభవంతు’-
యువ ప్రపంచాన్ని జ్ఞానమయం చేస్తూ
సరళతర విధానాలతో
నిజాయితీ, తెలివీ, ధైర్యం, ఆత్మ విశ్వాసాలే
ఆయుధాలుగా బయల్దేరిన కేటీఆర్
విశ్వ పరిశ్రమలను రాజధానికి
సింహాల మందవలె తోలుకొస్తుంటే
ఇక్కడి నేల పల్లవించి పరిఢవించింది
నడుస్తున్న కాళ్లల్లో కట్టె పెట్టే ఇంటిదొంగలను
తరుముతూ విక్రమిస్తున్న కుటుంబం అది
పిచ్చోళ్లారా.. అది కుటుంబ పాలన కాదు
కుటుంబ సభ్యులందరూ రేయింబవళ్లు
సమిష్టిగా శ్రమిస్తున్న శాస్త్రీయ పాలన
ఒక ‘కంపోజిట్ మోడల్’
వాళ్లు నామినేటెడ్ కారు..,
ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన ప్రజావీరులు వాళ్లు
తెలంగాణ ఇప్పుడు
ఐదు వేళ్లు బిగించిన పిడికిలి
పర్వతాలు తలలు వంచి
మోకరిల్లి స్వాగతిస్తుంటే
ఇప్పుడు కొత్తగా లిఖించబడుతున్న
ఒక మహోజ్వల మానవ చరిత్ర తెలంగాణ
ఇప్పుడు తెలంగాణ
ఎవరికీ తలవంచని మహోధృత మహాసముద్రం…
-రామా చంద్రమౌళి, 93901 09993