‘To distroy a nation distroy its culture ‘ఒక జాతిని నిర్మూలించాలంటే ముందుగా ఆ జాతి సంస్కృతిని విధ్వంసం చేయాలన్నది వలసవాద నియంతల విధానం. తెలంగాణ విషయంలో నాడు సమైక్య రాష్ట్రంలో జరిగిందీ అదే. నేడు కాంగ్రెస్ పాలనలో జరుగుతున్నదీ అదే. సాంస్కృతిక అస్తిత్వ ఆత్మగౌరవ పతాకం చేతబట్టి దశాబ్దాలపాటు త్యాగాలు చేసి ఉద్యమించి సాధించుకున్న తెలంగాణలో మళ్లీ మునుపటి పీడకలలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
కేసీఆర్ పాలనలో తోక ముడిచి పుట్టల్లో దాక్కున్న మిన్నాగులు బయటకొచ్చి పడగలు విప్పి బుసలు కొడుతున్నాయి. మూగబోయిన ప్రమాద ఘంటికలు మళ్లీ కర్ణ కఠోరంగా ప్రతిధ్వనిస్తున్నాయి. తెలంగాణ సంస్కృతి కోటగోడలు క్రమక్రమంగా బీటలు వారుతున్నాయి.
చరిత్ర, భాష, కళలు, సాహిత్యం, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, వృత్తులు, జీవన విధానం పునాదులై ఒక జాతిని ఐక్యంగా నిలుపుతాయి. వాటన్నిటినీ దండలో దారంలా అస్తిత్వం, వారసత్వం నిరంతరం కాపాడుతుంటాయి. వాటి విలువ నేటి కాంగ్రెస్ పాలకులకు తెలియదు. ఏనాడూ పిడికిలెత్తి ‘జై తెలంగాణ’ అని నినదించని నాయకుడి పాలనలో ఆ సున్నితమైన భావోద్వేగాలను ఆశించలేం. ఎందుకంటే ఆయన తెలంగాణ ఉద్యమం సహా ఇతరేతర ఏ ఉద్యమాల్లో ఏనాడూ లేరు. కనుకనే బాధ్యతలు స్వీకరించగానే ప్రజలకిచ్చిన వాగ్దానాలు పక్కన పెట్టి ప్రభుత్వ అధికార ముద్రలో ఉన్న కాకతీయ శిలా తోరణం, చార్మినార్ గుర్తులను తొలగించడానికి సాహసించారు. అవి రాచరిక చిహ్నాలు కాబట్టి తొలగిస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ఇంకేముంది ఆయన వందిమాగధ బృందాలు ఆ చిహ్నాలు లేకుండానే లెటర్ హెడ్లు, బోర్డులు, ఫ్లెక్సీలు చేయించేశారు. ఈ వైపరీత్యం సహించని తెలంగాణ సమాజం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆ ప్రతిపాదన అంతటితో ఆగింది. అయితే సాంస్కృతిక ధ్వంసరచన ఇతరత్రా కొనసాగుతూ వచ్చింది.
దశాబ్దాలుగా ప్రజలంతా పూజిస్తున్న
తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చిన రేవంత్‌రెడ్డి, తెలంగాణ భావోద్వేగాలపై దాడికి పాల్పడ్డారు. అందుకు నిరసనగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, సాంస్కృతికోద్యమ చైతన్య ప్రతీక ప్రముఖ కవి నందిని సిధారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఖరీదైన ఇంటి స్థలం, కోటి రూపాయల పురస్కారాన్ని కొనగోటితో తిరస్కరించారు.
తెలంగాణతల్లి విగ్రహం ఉద్యమకారుల గుండెల్లోంచి అవతరించిన అస్తిత్వ ప్రతీక. సమైక్య రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగు తల్లి భావనను తిరస్కరించిన తెలంగాణ కవులు, కళాకారులు ఉద్యమకారులు సమైక్యంగా రూపొందించుకున్న తెలంగాణ తల్లి విగ్రహం అది. ప్రపంచంలో ఎక్కడా లేని తెలంగాణకే ప్రత్యేకమైన తొమ్మిది రోజుల పూలపండుగలో సబ్బండ వర్ణాలు కొలిచి పూజించే బతుకమ్మ తెలంగాణ తల్లి చేతిలో కనులపండుగగా కొలువైంది. ఆరాధనీయమైన ఆ విగ్రహానికి ఇప్పుడున్న మంత్రులు చాలామంది దండ వేసి దండం పెట్టుకున్నవాళ్లే. సబ్బండ వర్ణాల ఆధ్వర్యంలో వాడవాడలా తెలంగాణ తల్లి విగ్రహాలు వెలిశాయి. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదికే తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ, కిరీటం, నగలు మాయమయ్యాయి. కాంగ్రెస్ ఎన్నికల గుర్తు హస్తం వచ్చి చేరింది. సోనియాగాంధీ జన్మదినమైన డిసెంబర్ 9న జనామోదం లేని కాంగ్రెస్ తల్లి విగ్రహం సచివాలయంలో ఆవిష్కృతమైంది. సచివాలయానికి ఎదురుగా అమర వీరులజ్యోతి సమీపంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు ఉద్దేశించిన స్థలంలో రాజీవ్‌గాంధీ విగ్రహం వచ్చి చేరింది. త్యాగాలకు గుర్తుగా అమరుల జ్యోతి, రాజకీయ అస్తిత్వానికి ప్రతీకగా సచివాలయం, సామాజిక న్యాయానికి నిలువెత్తు రూపం అంబేద్కర్ మహా విగ్రహం, ఒకవైపు కరుణామూర్తిబుద్ధ విగ్రహం, మరోవైపు బిర్లా మందిరం మధ్యలో ఆత్మగౌరవ కంజాతవల్లి తెలంగాణ తల్లి విగ్రహం ఇలా ఒక అద్భుత దృశ్య సమాహారాన్ని సమాజానికి అందించడం కేసీఆర్ సంకల్పం. కానీ ప్రభుత్వ పెద్దలు తెలంగాణకు ఏమాత్రం ప్రత్యక్ష సంబంధం లేని రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తెచ్చిపెట్టి తెలంగాణ తల్లికి చోటు లేకుండా చేశారు. అమరులజ్యోతి నిర్వహణ అటకెక్కింది. మొన్న మొన్నటిదాకా అంబేద్కర్ విగ్రహం కూడా ఆలనాపాలన లేకుండా మూలనపడింది. కేటీఆర్ హెచ్చరికతో బెదిరిపోయిన పాలకులు రెండేండ్ల తర్వాత మొన్నటి అంబేద్కర్ జయంతి రోజున తాళాలు తెరిచారు.
తెలంగాణ ఉద్యమానికి బీజాలు వేసిన వివిధ ఆగ్రహకారణాల్లో విగ్రహాలు కూడా ఒకటి. సమైక్య రాష్ట్రంలో సీమాంధ్ర ప్రాంతంలో తెలంగాణ వైతాళికుల చారిత్రక మహనీయుల విగ్రహాలు కనిపించేవి కాదు (నేటికీ అదే పరిస్థితి). తెలంగాణలో మాత్రం అడుగడుగునా వారి విగ్రహాలే. చివరికి ట్యాంక్‌బండ్ మీద ఉన్న విగ్రహాలలో కూడా ప్రాంతీయ సమతూకం పాటించలేదు. ఈ వివక్షకు నిరసనగా 2011లో మిలియన్ మార్చ్ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఆగ్రహం ఏ స్థాయిలో పెల్లుబికిందో ప్రపంచమంతా చూసింది.
12 ఏండ్లు గడిచాక కాంగ్రెస్ పాలనలో మళ్లీ విగ్రహాల వివాదం మొదలైంది. లక్డీకాపూల్ చౌరస్తాలో రోశయ్య విగ్రహంతో ప్రారంభమైన నిరసన రవీంద్రభారతిలోఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహంతో పతాకస్థాయికి చేరింది. కళలు, సినిమా రంగానికి సంబంధించిన వారినే అక్కడ ప్రతిష్ఠించాలి అనుకుంటే తెలంగాణలో ఎందరో ఉన్నారు.
రాజ్‌కపూర్, దిలీప్‌కుమార్ కంటే ముందే బాలీవుడ్లో హీరోగా వెలిగిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పైడి జయరాజు, తెలుగు సినిమా పుట్టిన తొలినాళ్లలో 90 ఏండ్ల క్రితమే పాటలు రాసిన చందాల కేశవదాసు, తొలి తెలుగు టాకీ నిర్మాత హెచ్ఎం రెడ్డికి గృహలక్ష్మిచిత్ర కథను అందించిన సోమరాజు రామానుజరావు, ఎన్టీఆర్, నాగేశ్వరావుతో సమానంగా హీరోగా వెలిగిన టీఎల్ కాంతారావు, సినిమా రంగానికి చెందిన కార్మికులు కళాకారుల కోసం ఉద్దేశించిన చిత్రపురి కాలనీకి మణికొండలో పది ఎకరాలు ఉచితంగా దానం చేసిన నిర్మాత నటుడు ప్రభాకర్‌రెడ్డి, గద్దర్, అందెశ్రీ, చిందు ఎల్లమ్మ, కాపు రాజయ్య ఇలా ఎందరో ఉన్నారు. కళాకారులకు ఎల్లలు లేవన్నప్పుడు వీరి విగ్రహాలను విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో, విశాఖపట్నం రామకృష్ణ బీచ్‌లో ప్రతిష్ఠించాలి కదా? అనేదే ఉద్యమకారుల ప్రశ్న.
తెలంగాణ మహనీయుల విగ్రహాలను ఒక్కటైనా అమరావతిలో ప్రతిష్ఠిస్తానని చంద్రబాబు ఇంతవరకు అనలేదు కానీ అమీర్‌పేట్ చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్ర హం స్థాపిస్తానని రేవంత్‌రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించడం గమనార్హం. సికింద్రాబాద్ గన్‌పార్క్‌ను సుందరీకరించడానికి చేతులు రాని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్టీఆర్ ఘాట్ మరమ్మతులకు లోకేశ్ అడిగిందే తడవుగా పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసింది.
అయినవారికి ఆకుల్లో, కానివారికి కంచాల్లో పెట్టడం అంటే ఇదే. సామాజిక ప్రయోజనం ఆశించని ఫక్తు కమర్షియల్ హింస, అశ్లీలం, నేరాలు, స్మగ్లింగ్ సినిమాలకు పెద్దపీట వేసే నిర్మాతలు, దర్శకులు, హీరోలదే నానాటికి పైచేయి అవుతున్నది. తెలంగాణ చలనచిత్ర వైవిధ్యం కళాకారుల వైదుష్యం మళ్లీ మసకబారి పోతున్నది. జీవితకాలం జనం కోసం గజ్జ కట్టి గొంత్తెత్తిన గద్దర్ ఆశయం నెరవేరడం లేదు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల విషయంలో తెలంగాణవాదులు తీవ్ర నిరాశకు గురయ్యారు. రాష్ట్ర అవతరణ ఉత్సవాల సందర్భంగా తెలంగాణ పాటలు కనుమరుగై పనికిమాలిన సినిమా పాటలు మార్మోగుతున్నాయి. జానపద నృత్యాలు ప్రదర్శించిన ప్రభుత్వ వేదికలపై రికార్డింగ్ డ్యాన్స్‌లు ప్రత్యక్షమవుతున్నాయి.
ప్రభుత్వం అందెశ్రీ రాసిన రాష్ట్రగీతం బాణీని మార్చడాన్ని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేదు. ఆ బాణీలో ఉద్యమ భావోద్వేగం ప్రతిబింబించలేదు. ప్రజలు ఇప్పటికీ పాత బాణీలోనే పాడుకుంటున్నారు.
కవులు, రచయితలతో పుస్తక ప్రచురణలు, ఆవిష్కరణలతో నిత్యం కళకళలాడిన సాహిత్య అకాడమీ రెండున్నరేండ్లుగా వెలవెలబోతున్నది. రవీంద్రభారతి నానాటికీ పరాయీకరణకు లోనవుతున్నది. శిల్పారామం సినీ హీరోల బూతు పాటలు, అర్ధనగ్ననృత్యాలతో మలినమైపోతున్నది. తెలంగాణపై బాహాటంగా విషం చిమ్మడమే ధ్యేయంగా పుట్టుకొచ్చిన చానళ్లు, పత్రికలు పదేండ్లపాటు నోరు మూసుకొని రెండున్నరేండ్లుగా మళ్లీ గొంతు సవరించుకొని తెగబడుతున్నాయి. తరతరాల వారసత్వ సంపద హైకోర్టు భవనం అస్తిత్వం కోల్పోనున్నది. మూసీ సుందరీకరణ ముసుగులో నిజాం ప్రభువు నిర్మించిన ఎన్నో ప్రాచీన కట్టడాలకు ప్రమాదం పొంచి చూస్తున్నది. పరిసరాల్లో ఉన్న ఆధ్యాత్మిక కేంద్రాల పరిస్థితి అగమ్య గోచరంగా మారనున్నది.
కేసీఆర్ ఉద్యమించిన 14 ఏండ్లలో, పరిపాలించిన తొమ్మిదిన్నరేండ్లలో తెలంగాణ సాంస్కృతిక వైభవం రాష్ట్రవ్యాప్తంగా వెల్లివిరిసింది. కృష్ణాగోదావరి పుష్కరాలు, గుళ్ల్లూ, గోపురాలు, ప్రార్థనాస్థలాల పునరుద్ధరణ, ఆధునీకరణ, జిల్లాలు, ప్రతిష్ఠాత్మక సంస్థలు, నిర్మాణాలు, పురస్కారాలకు తెలంగాణ వైతాళికుల పేర్లు, నీటి పథకాలకు దేవతలు, గ్రామదేవతలు, కులదేవతల పేర్లు, వివిధ కులాలకు ఆత్మగౌరవ భవనాలు, సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీ, సాంస్కృతిక సారథి ఏర్పాటు, పాఠ్యాంశాల్లో, పోటీ పరీక్షల పుస్తకాల్లో అంతటా తెలంగాణ గత ప్రాభవం, ఘన వైభవం చోటు చేసుకున్నది. కాకతీయుల కోట, గోల్కొండలో జెండావందనం ఇలా ఒకటా రెండా కేసీఆర్ పాలనలో అనునిత్యం, అడుగడుగునా తెలంగాణ ఆత్మగౌరవం సాక్షాత్కారించింది. 2017లో ప్రతిష్ఠాత్మక ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించటం చరిత్రలో కీలక ఘట్టం.
150 మంది తెలంగాణ వైతాళికుల పేరుతో స్వాగతతోరణాలు, ప్రాంగణాలు, పెద్దఎత్తున దేశ విదేశీయులు ఆగమనాలు సాహిత్య, సాంస్కృతిక సంబురాలు వెరసి తెలంగాణ యావత్తు ఒకే కుటుంబమై జరుపుకొన్న ఐదు రోజుల పండుగ అది. నేడు అవెక్కడ? ఆ రోజులేవీ?
నోరు తెరిస్తే బూతు పంచాంగాలు, ఇండ్ల కూల్చివేతలు, కబ్జాలు, అణచివేతలు, అక్రమ కేసులు, రైతుల్లో దైన్యం, యువతలో అసహనం, ఆత్మహత్యలు, అభాగ్యులు, ఆశాజీవుల ఆక్రందనలు ఇదే కదా నేటి తెలంగాణ దృశ్యం. జయశంకర్ సార్ చెప్తూ ఉండేవారు. తెలంగాణ రాగానే అంతా అయిపోయినట్టు కాదు. వ్యతిరేకులు రకరకాల రూపాల్లో దాడి చేస్తారు. ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే ఉద్యమించాలి అని. ఆ సమయం ఆసన్నమైందేమో!
-డా. అయాచితం శ్రీధర్
9849793238