చేనులో మంచి దోస విత్తనాలు వేస్తాము. తీగలు బాగా వచ్చి కొంతకాలం మంచి కాయలు వస్తాయి. తర్వాత సీజన్ అయిపోయి కుక్కమూతి పిందెలు రావటం మొదలవుతుంది. అది ప్రకృతి సహజమైన క్షీణత గనుక అంతటితో వదలి పెడుతాము. కాంగ్రెస్ పరిస్థితి అదే విధంగా ఉన్నది. అనేక దశాబ్దాలపాటు దేశానికి మంచి నాయకులను ఇచ్చింది. కొంతకాలంగా కుక్కమూతి పిందెలను కాయటం మొదలుపెట్టింది. వారు నడిపే ప్రభుత్వాలు కూడా అందుకు తగినట్టుగా ఉండటం సహజం. కనుక వారినిక వదిలివేయటం తప్ప ప్రత్యామ్నాయంలేదు.
తెలంగాణలో ప్రస్తుత పరిస్థితిని చూద్దాము. స్వయంగా తమ ప్రతిభ ఏమీ లేకున్నా కొన్ని కారణాల వల్ల అధికారానికి వచ్చారు. వివేకం, సమర్థత ఉన్నవారైతే బాగా పరిపాలిస్తారు. పార్టీని బలోపేతం చేసుకుంటారు. తమ అధికారం దీర్ఘకాలికం అయ్యే విధంగా ప్రజాదరణ సంపాదిస్తారు. కానీ, పరిపాలన సగకాలం గడిచేసరికే పరిస్థితులు ఏ విధంగా మారుతున్నాయో ప్రతిరోజూ చూస్తున్నాము. ఒకవైపు ప్రభుత్వ పాలన, మరొకవైపు పార్టీ నిర్వహణ కూడా. అగ్ర నాయకుల నుంచి కింది వరకు. అందువల్లనే పార్టీ ఇట్లా తయారవుతున్నది.
సాక్షాత్తు ముఖ్యమంత్రి నుంచి పీసీసీ అధ్యక్షుడి నుంచి, ఇతర మంత్రుల వరకు రకరకాల ఆరోపణలకు గురికావటం ప్రతిపక్షాల నుంచి, ప్రజల నుంచి అయితే అది వేరు. కానీ కాంగ్రెస్ పార్టీకే చెందిన సీనియర్ నాయకులు ఆరోపణలు చేస్తుంటే? అందులో అవినీతి ఆరోపణలు కూడా ఉంటే? ప్రతిపక్షాలు, ప్రజలు చేస్తున్నటువంటి అవినీతి ఆరోపణలే వీరి నుంచి కూడా వినవస్తే? అవి కేవలం పార్టీ పదవులు, ప్రాధాన్యతకు సంబంధించిన ఫిర్యాదులు అవుతే రాజకీయాల్లో ఇది మామూలే అనుకుని వదిలివేయవచ్చు.
కానీ ఆర్థిక సంబంధమైన అవినీతి ఆరోపణలు కూడా అయితే? ఆ విధంగా ఏమి జరుగుతున్నదో ప్రస్తుతం మరొక రెండు చూస్తున్నాము. ఉదాహరణకు 22-ఏను పురస్కరించుకుని పరిపాలనాపరమైన గందరగోళం అటు ప్రజలను, ఇటు పాలనా వ్యవస్థను తీవ్రంగా కుదిపేస్తున్నది. అవినీతి ఆరోపణలు చెలరేగుతున్నాయి. అవి ముఖ్యమంత్రి వైపు కూడా తిరుగుతున్నాయి. అందువల్ల కలుగుతున్న అప్రతిష్ట నానాటికీ పెరిగిపోతున్నది. అటువంటి సంకటస్థితిలో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి చేయవలసిందేమిటి? ఇక్కడ ఉండి పరిస్థితులను చక్కబెట్టాలి. కానీ, ముఖ్యమంత్రి చేసిందేమిటి? అంతా సంబంధిత మంత్రిపైన, ఆయన సంబంధిత అధికారులపైన నెట్టివేశారు. ప్రభుత్వాధినేత అర్జంటుగా రెండువారాల విదేశీ పర్యటనలకు వెళ్లారు. అది రసాభాస కావడంతో మధ్యలో తిరిగివచ్చారు. ఇందులో మన ఆశ్చర్యాన్ని మరింత పెంచేది ఇంకొకటి ఉన్నది. 22-ఏకు సంబంధించిన అవినీతి ఆరోపణలు సంబంధిత మంత్రిపై ముఖ్యమంత్రిపై కూడా వినవస్తున్నాయి. అవి నిజం కావొచ్చు, కాకపోవచ్చు. కానీ నిజమై ఉంటాయనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నప్పుడు, సీతమ్మవలె అగ్నిప్రవేశం చేసి, విషయాన్ని పూర్తిగా నిగ్గుతేల్చి, అనుమానాలు నివృత్తి చేయటం ముఖ్యమంత్రికి, సంబంధిత మంత్రికి కూడా అవసరం. తను 19న ఢిల్లీలో జరిగిన పార్టీ సమావేశాల్లో పాల్గొని రాత్రికి తిరిగి వచ్చినట్టయితే వేరుగా ఉండేది. కానీ, ఇక్కడి ఇంత తీవ్రమైన సమస్యలను వదిలివేసి రెండు వారాలపాటు విదేశీయాత్రలకు సన్నాహాలు చేస్తే ఏమనుకోవాలి? అందుకు చెప్తున్న కారణం పెట్టుబడులను ఆకర్షించటం. కానీ, ఇంతవరకు చేసిన అటువంటి పర్యటనల్లో ఎంవోయూలకు మించి వచ్చిన వాస్తవ పెట్టుబడులు ఏమిటో అడిగినా చెప్పరు. అదీగాక, రాష్ట్రంలో తలెత్తిన అత్యవసర సమస్యలను కొలిక్కి తెచ్చిన తర్వాతనైనా పర్యటనలు పెట్టుకోవచ్చు.
అదట్లుంచి, 22-ఏతోపాటు రాష్ట్రంలోని ఇతరత్రా భూముల చుట్టూ తిరుగుతున్న భారీ అవినీతి ఆరోపణలు, ప్రభుత్వ నిష్క్రియాపరత్వం నేపథ్యంలో, 19 నాటి ఢిల్లీ వర్కింగ్ కమిటీ సమావేశంలో పార్టీ అధినాయకత్వానికి ముఖ్యమంత్రి ఇచ్చిన ఒక హామీ అనివార్యంగా గుర్తుకువస్తున్నది. వచ్చే సంవత్సరం జరిగే ఏడు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల కోసం ఎటువంటి చేయూత అవసరమైనా ఇచ్చేందుకు తెలంగాణ కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నదని ముఖ్యమంత్రి ప్రకటించినట్టు వార్తలు వచ్చాయి. చేయూత అంటే ప్రధానంగా ఆర్థిక వనరులని తెలిసిందే. ఏడు రాష్ర్టాల్లో గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ చిన్నవి. హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. భారీగా నిధులు అవసరమయ్యేవి యూపీ, పంజాబ్, గుజరాత్. మిగిలిన నిర్వచనాలు ప్రజలు చెప్పుకోవచ్చు. 22-ఏ వంటి కేసులను అట్లుంచి, అవినీతి ఎట్లా విజృంభిస్తున్నదో టి.జీవన్‌రెడ్డి వంటి నాయకుడు నిన్నటివరకు చెప్పగా, గతంలో, ఇప్పుడు కోమటిరెడ్డి సోదరుల నుంచి వింటున్నాము. వీరివలె ఇంకా పార్టీలోనే ఉన్న మరొక సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి, టికెట్ల అమ్మకం ఆరోపణలు చేశారు. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా అయితే సీరియల్ ఆరోపణలు చేస్తున్నారు. తమ జోలికి వస్తే ‘గుట్టంతా విప్పుతా’నని ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వ బాధ్యుల గురించి ఏమి చూస్తున్నామో, అదే పార్టీ పరిస్థితిలో అంతే అధ్వానంగా కనిపిస్తున్నది. ఒకటి కుక్కమూతి పిందె దశకు క్షీణించిననప్పుడు, రెండవ దాని పరిస్థితి కూడా అంతే కావడం అనివార్యం. కాంగ్రెస్‌లో గ్రూపు కలహాలు ఎప్పుడూ ఉన్నవేనన్నది తెలిసిందే. పార్టీ పదవులు, ప్రభుత్వ పదవులు, ప్రాబల్యాలు, పార్టీలో గతం నుంచి ఉన్నవారు, కొత్తగా వచ్చినవారు, పార్టీ కోసం కష్టించి పని చేస్తున్నవారు, డబ్బున్నవారు, పెద్ద కులాలు, చిన్న కులాల వంటి వివాదాలు కొత్తకాదు. ఇదంతా పార్టీలోని ప్రజాస్వామ్యానికి చిహ్నమని పార్టీ పెద్దలు సర్ది చెప్పగా, ప్రజలు కూడా అందుకు అలవాటుపడిపోయారు. కానీ అంత మాత్రాన కుక్కమూతి పిందెలురావు. ఇటువంటి పరిస్థితి గతంలో ఉండటానికి, ఇప్పటికి గల తేడాను గుర్తించకపోవటం పొరపాటవుతుంది. కొంతకాలం క్రితం వరకు ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంతోపాటు కేంద్రస్థాయిలో బలమైన, సమర్థవంతమైన నాయకత్వాలుండేవి. కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వాలకు కూడా. కనుక, రాష్ర్టాల్లో ఈ తరహా సమస్యలు తలెత్తినప్పుడు వారు తగు విధంగా సర్దుబాట్లు చేసి అదుపులో పెట్టేవారు. మంచి దోసతీగలు, మంచికాయలు అని మొదట అనుకున్నది దీని గురించే.
కొంతకాలంగా మనం చూస్తున్నది జాతీయస్థాయిలో, అత్యధిక రాష్ర్టాల్లో కూడా బలహీన నాయకత్వాల దశను. అంతకుమించి క్షీణ నాయకత్వాల దశను. అందువల్ల, పరిపాలనా సమస్యలు, పార్టీ సమస్యలు ఇంచుమించు ఒక విధంగా గతంలో ఉండి, ఇప్పుడు కూడా ఉన్నప్పటికీ, వాటి సర్దుబాట్లు, అదుపుచేసే నాయకత్వాలు ఇప్పుడు లేకుండాపోయాయి. రాష్ర్టాల స్థాయి సమస్యలను జాతీయ నాయకత్వం, జిల్లాస్థాయి సమస్యలను రాష్ట్ర నాయకత్వం అదుపు చేయలేకపోతున్నది. పైనుంచి కిందివరకు అంతా కుక్కమూతి పిందెల స్థితికి దోసతీగలు సడలిపోయాయన్నమాట.
ఇందుకు బలమైన కారణాలున్నాయి. పై నుంచి కింది వరకు మౌలికంగా నాయకత్వాల స్థాయి తగ్గిపోయింది. అవినీతి ఎప్పుడూ ఉన్నదే అయినా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ 2014 నుంచి వరుసగా మూడుసార్లు ఓడటం, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలు దారుణంగా తగ్గిపోవడంతో, పార్టీకి విరాళాలు కూడా తగ్గాయి. పార్టీ నిర్వహణ కోసం, లోక్‌సభకు, అసెంబ్లీలకు ఎన్నికలు వచ్చినప్పుడల్లా భారీ ఖర్చుల కోసం తమ ప్రభుత్వాలున్న రాష్ర్టాల్లో అవినీతి వసూళ్లపై ఆధారపడుతున్నారు. ఇదే అవకాశంగా స్థానిక నాయకులు తమ వాటాలు తాము చూసుకుంటున్నారు. ఇది తెలిసినా ఏఐసీసీ నాయకత్వం ఏమీ చేయలేని స్థితి. ఎవరెక్కువ వసూళ్లు చేయగలిగితే వారికే నాయకత్వమనే తరహాలో పరోక్ష వేలాలు. గతానికి, ఇప్పటికి మరొక ముఖ్యమైన మార్పున్నది. లోగడ కాంగ్రెస్ అనే చిరకాలపు మహత్తర పార్టీ సిద్ధాంతాలకు సుఖమైనా కష్టమైనా కట్టుబడి ఉండేవారు. సైద్ధాంతికంగా తీవ్రమైన విభేదాలు ఉంటే తప్ప చీలేవారు కాదు. కానీ ఇప్పుడు అటువంటి కట్టుబడటాలు అరుదుగా చూస్తున్నాము. అధికారం, సంపాదనల కోసం అత్యధికులు స్టాక్ మార్కెట్లలో పేరు నమోదు చేసుకునే వారే. అటువంటివి సాక్షాత్త్తు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురించే వింటుంటాము. వాస్తవానికి ఈ జాడ్యం అన్ని పార్టీలకు వ్యాపించగా, కాంగ్రెస్‌కు కూడా మినహాయింపు కాలేకపోయింది. అటువంటి నాయకులతో ఆ పార్టీ , ఆ ప్రభుత్వం ఇట్లాగే ఉంటాయి మరి.