‘ఒక రాష్ట్రం గురించి అడ్వైర్టెజ్‌మెంట్ విన్న. అందులో మహిళలు మాట్లాడుతరు. స్వయం సహాయక సంఘాలు పెట్టుకున్నం. అందుకే ఇప్పుడు రెండుపూటలా తింటున్నం. గ్రూపు లేకపోతే ఒకపూటే తిండి.. అనేది దాని సారాంశం. ఒక మిత్రునితో కలిసి అది చూసినప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగినయ్….
రేషన్ బియ్యం ఇస్తున్నం కాబట్టి మాకు ఓటెయ్యండని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అడుగుతున్నడు. ఎంత దారుణం! స్వాతంత్య్రం వచ్చిన 75 ఏండ్ల తర్వాత కూడా ఈ దేశ మహిళలు ఒకపూట తిండి తినాల్నా… ఇప్పుడు కొత్తగా రేషన్ బియ్యం ఇస్తున్నమని గొప్పలు పోవాల్నా? ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేముంటది.’
ఇవి ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం టీఆర్ఎస్ ప్లీనరీలో భావోద్వేగంతో చెప్పిన మాటలు…
దేశంలోని జీవనదుల్లో 65 వేల టీఎంసీల నీరున్నా, నీటి కోసం ఎందుకు యుద్ధాలు జరుగుతున్నయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. 4 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నా కూడా భారతదేశం ఏ రోజునా 2 లక్షల మెగావాట్లకు మించి విద్యుత్‌శక్తిని వినియోగించడం లేదనే వాస్తవాన్ని ఎత్తిచూపారు. ‘పిల్లలకు అమెరికాలో గ్రీన్‌కార్డు వస్తే ఇక్కడ తల్లిదండ్రులు సంబురపడే పరిస్థితి ఎందుకు ఉన్నది? మన దేశంలో నీరు లేకనా? ఖనిజాలు, అటవీ సంపద లేకనా? మేధోశక్తి లేకనా? ఈ దేశం ఎందుకు ఇలా కునారిల్లుతున్నదని ఆయన ప్రశ్నించారు.
ఇటీవలి కాలంలో దేశంలో పెచ్చరిల్లుతున్న పెడ ధోరణులను ప్రస్తావిస్తూ, ఇది భారత సమాజానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదని హితవు చెప్పారు. దిగజారుతున్న దేశ ఆర్థిక పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. దేశం ఎదుర్కొంటున్న విషమ పరిస్థితిని వివరిస్తూనే, ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి ప్రత్యామ్నాయ ఎజెండాతో, ప్రజల ఎజెండాతో ముందుకు పోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
దేశంలో ఒక రాష్ట్రంగా, ఒక భాగంగా మనం ఉన్నాం. దేశం కూడా మన స్థాయిలో పని చేసి ఉంటే మన జీఎస్డీపీ (రాష్ట్ర స్థూల ఉత్పత్తి) రూ.11.5 లక్షల కోట్లు కాదు, రూ.14.5 లక్షల కోట్లుగా ఉండేది. ఇది నేను చెప్తున్నది కాదు, ‘కాగ్’ చెప్తున్న, ఆర్థిక నిపుణులు చెప్తున్న లెక్క. మనం చేస్తున్న స్థాయిలో కేంద్రం పనిచేయడం లేదని చెప్పడానికి ఇది ప్రబల తార్కాణం. 75 ఏండ్ల స్వాతంత్య్రంలో ఏం జరిగిందో దేశ ప్రజలందరికీ తెలుసు. ఏ పద్ధతిలో స్వాతంత్య్ర ఫలాలు ప్రజలకు లభించాలో ఆ పద్ధతిలో లభించలేదు. ప్రజాస్వామ్య పరిపక్వత జరిగి ప్రజలకు అధికార బదలాయింపు జరగాలో ఆ పద్ధతిలో జరగలేదు. పెడధోరణులు మరింత ప్రబలిపోతున్నాయి తప్ప మంచి మార్గం కానరావడం లేదు. ఇటీవల దేశంలో విపరీతమైన కొన్ని జాడ్యాలు, అవాంఛిత, అవసరం లేని పెడధోరణులు ప్రబలుతున్నాయి. భారత సమాజానికి ఇది ఏమాత్రం శ్రేయస్కరం కాదు. సహనానికి ఆలవాలమైన సమాజం, అందరినీ ఆదరించే సమాజం మనది. అద్భుతమైన ఈ దేశంలో కొన్ని సంకుచిత, ఇరుకైన విధానాలు దేశ ఉనికినే ప్రశ్నించే స్థాయికి పోతున్నాయి. ఈ సందర్భంలో రాజకీయ పార్టీగా, రాష్ట్రంగా మన పాత్ర ఏ విధంగా ఉండాలనేది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటది. తీసుకున్న నిర్ణయాలను అమలుచేసి ఈ దేశ అభ్యున్నతికి శక్తివంచన లేకుండా కృషి చేయాల్సిన అవసరం కూడా ఉన్నది.
కరెంటును వాడుకోలేని దుస్థితి
ఈ రోజు దేశంలో 4,01,035 మెగావాట్ల స్థాపిత విద్యుత్‌శక్తి సామర్థ్యం అందుబాటులో ఉన్నది. ప్రపంచం మొత్తం, ఆధునిక సమాజం మొత్తం అభివృద్ధికి సంకేతాలుగా, ప్రగతికి నిదర్శనాలుగా భావించే పారామీటర్స్‌లో తలసరి విద్యుత్ వినియోగాన్ని ప్రప్రథమంగా తీసుకుంటారు. అంతటి ప్రధానమైన విద్యుత్‌శక్తి ఉత్పాదక సామర్థ్యం మన దేశంలో 4,01,035 మెగావాట్లు ఉన్నప్పటికీ దాన్ని వినియోగించుకోలేని అశక్తతతలో ఉన్నది మన భారతదేశం. నేనొక విషయం చెప్తే మీరు నమ్మరు.. మన దేశంలో 4 లక్షల మెగావాట్ల విద్యుత్‌శక్తి ఉంటే భారతదేశం ఏ రోజు కూడా 2 లక్షల మెగావాట్లకు మించి విద్యుత్‌శక్తిని వినియోగించడం లేదు. మనమందరం పేపర్లలో చూస్తూనే ఉన్నాం.. ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహించే గుజరాత్‌లోనూ భరించలేని కరెంట్ కోతలు, ఎండిపోతున్న పంట పొలాలు, రైతుల రాస్తారోకోలున్నయి. మన చుట్టూ ఉన్న రాష్ర్టాలు కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఏపీ, మహారాష్ట్ర.. ఏ రాష్ట్రం తీసుకున్నా కోతలు లేని రాష్ట్రమే లేదు. ప్రకటిత కోతలు, అప్రకటిత కోతలు తప్పడం లేదు. ఇబ్బందిపడని ప్రజలంటూ లేరు. చుట్టూ అంధకారం అలుముకుంటే, నా తెలంగాణ మాత్రం ఒక మణిదీపంలా వెలుగుతున్నదని గర్వంగా చెప్తున్నాను. ఏడేండ్ల కిందట మనకు కూడా అంధకారమే. మనకు కూడా భరించలేని కరెంట్ కోతలే. కానీ మనం ఏం చేసినం.. వెలుగు జిలుగుల తెలంగాణ ఎట్లా అయింది. 24 గంటలపాటు కరెంట్ ఇచ్చే తెలంగాణ ఎట్లా తయారైంది. ఇదే పని భారతదేశంలో ఎందుకు జరగలేదని నేను ప్రశ్నిస్తున్నా.
అందుకే నేను ఓ మాట చెప్పాను.. తెలంగాణ పని చేస్తున్న స్థాయిలో, పద్ధతిలో దేశం పని చేయడం లేదు. ఒకవేళ చేసి ఉంటే.. దేశంలో కూడా కచ్చితంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ముంబయి నుంచి కోల్‌కతా వరకు 24 గంటల కరెంట్ లభించేది. ఎందుకీ దౌర్భాగ్యం? దేశంలో కరెంటు లేకనా? ప్రజలు ఎందుకు చీకట్లో మగ్గాలి? ఇది భారతీయుల ఖర్మనా? వారి ప్రాప్తా? దీనికి సమాధానం చెప్పే వాళ్లెవరు?
దేశ ప్రజలు కనీసం తాగునీళ్లకూ నోచుకోరా?
ప్రకృతి లేదా భగవంతుడు భారతదేశానికి అందించిన మరో గొప్ప వరం నదులు. ఈ దేశంలో సజీవంగా ప్రవహించే నదుల్లోని నీటి లభ్యత 65 వేల టీఎంసీలు. ఇంకా నాలుగైదు వేల టీఎంసీల నీటి లెక్కలు తేలాల్సి ఉన్నది. అంతర్జాతీయ గొడవల్లో భాగంగా టిబెట్ నుంచి వచ్చే నీళ్ల లెక్కలు తేలలేదు. ఇప్పటికే లెక్కించిన, నిర్ణయించిన నీటి కేటాయింపులు 65 వేల టీఎంసీలు. కానీ, ఇప్పటి వరకు కట్టిన ప్రాజెక్టులు, ఇతర ప్రయత్నాలతో 30 వేల టీఎంసీల లోపే దేశం వాడుకుంటున్నది. దేశంలో ఎక్కడ చూసినా.. నీటి యుద్ధాలు. ఇది బుర్ర ఉండా? లేకనా? తెలివి ఉండా? లేకనా? శక్తి సామర్థ్యాలు ఉండా? లేక అసమర్థతనా? వివేకం ఉండా? అవివేకమా? దీనికి కారణం ఎవరు. ఈ మాట కూడా నేను ప్రధానమంత్రికి చెప్పిన. నీతిఆయోగ్ మీటింగ్‌లో కుండబద్దలు కొట్టినట్లు చెప్పిన. దేశంలో 65 వేల టీఎంసీల నీళ్లు ఉంటే.. కావేరీ జలాల కోసం కర్ణాటక, తమిళనాడు యుద్ధం చేసుకుంటున్నయి. సింధూ, సట్లేజ్ నదుల కోసం రాజస్థాన్, హర్యానా, పంజాబ్ రాష్ర్టాల మధ్య ప్రతిరోజు యుద్ధం. ఇది ఎందుకు? ఈ దేశానికి ఏమి దౌర్భాగ్యం?
దీని రహస్యం ఎక్కడ ఉంది. దేశ ప్రజలు కనీసం తాగునీళ్లకు కూడా నోచుకోరా? తాగునీరు లేదు, సాగునీరు లేదు, కరెంట్ లేదు.. ఉపన్యాసాలు వింటే మైకులు పగిలిపోతై.. హోరెత్తుతయి. కానీ వాగ్దానాల్లో హోరు.. పనిలో మాత్రం జీరో. ఈ దేశంలో ఎక్కడా ఎలాంటి పని జరగదు. మౌలికమైన వసతులు ఎక్కడా లేవు. 65 వేల టీఎంసీల నీళ్లు కలిగి ఉండి తాగేందుకు నీళ్లు లేని దుస్థితిలో ఉండటం ఏమిటి? ఇది ఎవరి అసమర్థత? దేనికి గీటురాయి? ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలి. చర్చలు జరగాల్సింది వీటిపైన. పరిష్కారాలు కనుగొనాల్సింది వీటికి. ఉపన్యాసాలు చెప్తే, ఊకదంపుడు మాటలు చెప్తే, అలవోకగా రాజకీయాలు చేస్తే ఫలితాలు రావు. ఒళ్లు వంచాలె, మేధోమథనం చెయ్యాలె, మెదడు కరగదియ్యాలె, జ్ఞానం ప్రాప్తి చేసుకోవాలె. పుట్టంగనే ఎవరికీ రాదు. జ్ఞానాన్ని స్వీకరించాలె. అన్నీ మనకే తెలుసనే అహంకారం వదిలెయ్యాలె. తెలిసినవారి దగ్గరినుంచి తెలుసుకోవాలె. అవన్నీ చేసినం కాబట్టే ముందున్నం.
దేశం లక్ష్యాన్ని కోల్పోయింది
మన దేశం లక్ష్యాన్ని కోల్పోయింది. పరిస్థితి బాగలేదు. నన్ను కొన్ని పార్టీల పెద్దలు కలిశారు. కమ్యూనిస్టు పార్టీ పెద్దలు కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు కలిశారు. అందరం ఏకం కావాలన్నరు. దేనికోసం అని అడిగిన. బీజేపీని గద్దె దించాలి, అదే మన లక్ష్యం కావాలని చెప్పినరు. ఇది చెత్త ఎజెండా అని చెప్పిన. దీని కోసం నేను మీతో రానని చెప్పిన. ఎవరినో గద్దె దించడానికో, ఎక్కించడానికో ఎజెండా అవసరం లేదని చెప్పిన. గద్దె ఎక్కించాల్సింది భారతదేశ ప్రజలను. పార్టీలను కాదు. మారాల్సింది పార్టీలు కాదు, దేశ ప్రజల జీవితాలు. ఆ దిశగా పనిచెయ్యాలని సూచించిన. దేశ ప్రజల జీవన స్థితిగతులు, మౌలిక సదుపాయాలు, దేశ భవిష్యత్తును మార్చే కార్యక్రమాలు రావాలి. అందరూ గౌరవంగా తలెత్తుకొని జీవించే పరిస్థితి తీసుకురావాలి.
ప్రగతి ఎజెండా కావాలె
1980 వరకూ భారతదేశ జీడీపీ కంటే చైనా జీడీపీ తక్కువ. భారతదేశంలో పండే పంటల కంటే చైనాలో పండే పంటలు తక్కువ. వ్యవసాయ అనుకూలమైన భూమి కూడా భారత్‌లో కంటే చైనాలో తక్కువ. మరి ప్రస్తుతం చైనా పరిస్థితి ఏమిటి? నేడు ప్రపంచంలో రెండో ఆర్థికశక్తిగా ఉన్న దేశం ఏది అంటే.. చైనా! మరి మనమెక్కడ ఉన్నం? మనం ఏ దిశగా పోతున్నం? మన రాష్ట్రంలో ఒక జిల్లా అంత ఉండదు ఇజ్రాయెల్. అక్కడి నుంచి ఆయుధాలు కొంటున్నం. మన ‘తాలుకా’ అంత ఉండే ఆస్ట్రియా నుంచి (మన సాగునీటి ప్రాజెక్టుల్లో వాడే) ‘పంపులు’ తెచ్చుకుంటున్నం. ఏం ఖర్మ ఇది. ఏం దుస్థితి ఇది. దీని గురించి సీరియస్‌గా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది.
ఇప్పుడు కావాల్సింది, రావాల్సింది రాజకీయ ఫ్రంట్లు కాదు. ఇప్పటికే చాలా వచ్చినయ్. కానీ ఏం సాధించినయ్. రాజకీయ పునరేకీకరణలు కావు. డొల్ల మాటలు, కల్ల మాటలు కావు. ఇవాళ దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ ఎజెండా. ఒక అద్భుతమైన దేశాన్ని ప్రగతిపథంలో తీసుకెళ్లే ఎజెండా కావాలి. ఒక్కమాటలో చెప్పాల్నంటే… చెయ్యగలిగే సామర్థ్యం, సంకల్పం, చిత్తశుద్ధి ఉంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థికశక్తిగా ఎదిగే అవకాశం.. వసతులు, వనరులను కలిగి ఉన్నది నా భారతదేశం. ఏమీ లేక బాధపడితే వేరు కానీ కలిగి ఉండీ కటకటవడుతున్నది. దుఃఖపడుతున్నది. దీనికి ఏదో నివారణ జరగాలె.
దీనికోసం కేసీఆర్ ఇవాళ రాజకీయ ఫ్రంట్ ప్రకటిస్తడా? ఇంకోటి ప్రకటిస్తడా? అంటే.. ప్రాసెస్ జరుగుతది. తెలంగాణ కోసం మనం ఎట్లయితే ప్రాసెస్ చేసినమో? ఏ ప్రాసెస్ ద్వారా తెలంగాణ తెస్తమని నమ్మినమో? అట్లనే అద్భుతమైన భారతదేశ నిర్మాణానికి కూడా ప్రాసెస్ జరగాలె. ఆ ప్రాసెస్‌లో ఏం జరుగుతది అనేది భవిష్యత్తులో తెలుస్తది. సమయం తేల్చుతది. ఈ మధ్య నేను జార్ఖండ్ రాష్ర్టానికి వెళ్లినప్పుడు అక్కడి విలేకర్లు.. ‘ఏం సార్.. యాంటీ బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఎప్పుడు పెడుతున్నర’ని అడిగారు. అప్పుడు.. ‘ఇది యాంటీ కాదు ఫర్ కాదు. ఏదన్న పెడితే గిడితే.. భారతదేశ ప్రజల అనుకూల ఫ్రంట్ ఉంటది తప్ప.. దీనికి వ్యతిరేకం దానితో దోస్తీ దందా ఉండద’ని చెప్పిన. భారత ప్రజలను, భారత్‌ను గొప్పదేశంగా తీర్చిదిద్దే ప్రత్యామ్నాయ ఎజెండా ఉంటదని తేల్చిచెప్పిన. దేశం బాగుపడటానికి మన రాష్ట్రం నుంచే ఏదన్న జరిగితే.. అది మనందరికీ గర్వకారణం. తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ కోసం ఈ దేశ రాజకీయాలను ప్రభావితం చేయడానికి, దేశగతిని మార్చడానికి, స్థితి మార్చడానికి.. దేశాన్ని సరైన ప్రగతిపంథాలో నడిపించడానికి, ఒకవేళ హైదరాబాద్ వేదికగా ఒక కొత్త ఏజెండా, కొత్త ప్రతిపాదన, కొత్త సిద్ధాంతం తయారై దేశం నలుమూలలా వ్యాపిస్తే.. అది దేశానికీ, మన రాష్ర్టానికే గర్వకారణం. ఏదో చిల్లర మల్లరగా ఇద్దరు ముగ్గురు ముఖ్యమంత్రులను ఒకటి చేయడమో, నాలుగు పార్టీలను ఒకటి చేయడమో, ఒకరితో దోస్తానా కట్టడమో కాదు కావల్సింది. కావల్సింది ప్రత్యామ్నాయ రాజకీయ గుంపు కాదు.. రాజకీయ కూటమి కాదు.
దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ ఎజెండా. ఆ దారులు వెతకాలి. నూతన వ్యవసాయ విధానం రావాలె. ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ పాలసీ ఆఫ్ ఇండియా రావాలె. నూతన ఆర్థిక, పారిశ్రామిక విధానం రావాలె. ప్రతివాడు పనిచేసే అవకాశం కావాలె. అందుకు అవసరమైన వేదికలు తయారుకావాలె. ఆ భారతదేశం లక్ష్యంగా పురోగమించాలె. కానీ, కేవలం సంకుచిత రాజకీయ లక్ష్యం, ఎల్లయ్యనో, మల్లయ్యనో ప్రధానమంత్రిని చేయడం కోసమో, స్వోత్కర్ష కోసమో కాదు.
దేశానికి కావాల్సింది అభ్యుదయ పథం. అందుకు కావాల్సిన సిద్ధాంత ప్రాతిపదిక, అవంలంబించాల్సిన ఎజెండా, ఆచరించాల్సిన మార్గం కావాలె. అది వస్తే చాలా అద్భుతంగా దేశం బాగుపడతది. ఉజ్వలమైన దేశం తయారైతది. మన ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ ఒక పేపర్ల వ్యాసం రాసిండు. ‘టీఆర్ఎస్ను బీఆర్ఎస్ చేయాలె- తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి చేయాలె’ అని పేపర్ల చదివిన. అలాంటి ఆలోచనలు రావాలె.
ఏం ఆశించి విద్వేషాలు రెచ్చగొడుతున్నరు?
దేశంలో ఈరోజు ఏం జరుగుతుందో ప్రజాక్షేత్రంలో చర్చకు పెట్టాలె. అప్పుడే ప్రజలకు అర్థమైతది. ఏం జరుగుతా ఉంది దేశంలో! ఏం ఉపన్యాసాలు వింటా ఉన్నాం. జాతిపిత మహాత్మాగాంధీ మీదనే దూషణలు చేసే దేశమా భారతదేశం. ఇదేం పెడధోరణి. ఇదేం దుర్మార్గం. ఆయన ఉన్నతస్థితిలో ఉండి కూడా, దేశ స్వాతంత్య్రం కోసం దశాబ్దాల పాటు జైళ్లలో మగ్గి, వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి జాతిపితగా పేరు తెచ్చుకొన్న వ్యక్తి. ఆయనని దూషించడమా! ఇది సంస్కృతా? ఇది పద్ధతా? ఎందుకీ విద్వేషం? ఏం ఆశించి ఇది చేస్తున్నరు?
పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టుందని, పోయిన సర్కారే మంచిగుండే అని దేశ ప్రజలు చర్చించుకుంటున్నరు. జీడీపీ పడిపోయింది. పరిశ్రమలు మూతపడుతున్నయి. నిరుద్యోగం పెరిగింది. ఆకలి పెరిగింది. రైతులంతా ఇబ్బందుల్లో ఉన్నరు. అంతులేకుండా నిత్యావసరాల ధరలు పెరుగుతున్నై. రూ.30 వేలు ఉన్న స్టీలు రూ.90 వేలకు పోయింది. సిమెంట్ బస్తాల ధరలు కొండెక్కి కూసున్నయి. సామాన్యులకు బతుకు భారంగా మారింది.
ఇన్ని సమస్యలతో దేశం సతమతమవుతుంటే దీనిమీద దృష్టి లేదు. మంచినీళ్లు లేవు, సాగునీళ్లు లేవు, కరెంటు సక్కగ రాదు. దీనిమీద దృష్టి లేదు. ఏదో చెప్పి ఒక గోల్మాల్ చేసి ఒక ద్వేషం.. విద్వేషం పెంచుతున్నరు. దేశానికి ఒక పిచ్చి లేపి రాజకీయ పబ్బం గడుపుకొనే దుర్మార్గం ఇది. సమసిపోయిన గాయాలపై కారం చల్లే పరిస్థితి. ఎంత సిగ్గుచేటు అంటే.. ఏదైనా ఒక రాజకీయ పరిస్థితి వస్తే.. ఒక విద్వేషాన్ని రేపాలి. ఇగో పుల్వామా.. ఇగో సర్జికల్ స్ట్రైక్.. ఇగో కశ్మీరీ ఫైల్స్ అంటూ గోల్మాల్ చేస్తున్నరు. కశ్మీర్ పండిట్లే టీవీల ముందుకొచ్చి చెప్పిన్రు. ‘మానిన గాయాల్ని మళ్లా ఎందుకు రేపుతున్నరు, మా పుండు మీద కారం మళ్లా ఎందుకు చల్లుతున్నరు? ఏదైనా చేస్తే మాకు మంచి చేయండి. అది చేతకాదు కానీ, మా పేరు మీద రాజకీయాలు చేస్తారా?’ అని వాళ్లే అడుగుతున్నరు. ఇది ఎంత దౌర్భాగ్యం! ఏం మత పిచ్చి.. ఏం విద్వేషం. ప్రేమతోని, అనురాగంతోని, సౌభ్రాతృత్వంతోని.. సోదరభావంతోని ఒకరికొకరు భుజం ఆని.. ఒకరి ప్రగతికి మరొకరు దోహదపడి ఉజ్వల భారత నిర్మాణం జరగాలా? ఈ పిచ్చి కొట్లాటలల్ల పడిపోవాల్నా?
కొత్త రాజకీయ శక్తి అవిర్భవించాలి
ప్రజల కోసం రాజ్యాంగమా? దానికి ఉల్టానా? ఏం జరుగుతున్నది అసలు ఈ దేశంలో? రాజ్యాంగసంస్థల గతి ఏమైతా ఉన్నది. రాజ్యాంగ ప్రతిపత్తి ఏమైతా ఉన్నది. రాజ్యాంగ రక్షణలు ఏమైపోతా ఉన్నయి. ఇది రాజ్యాంగమేనా? ఇది భారత రాజ్యాంగ స్ఫూర్తా? అందుకే నేను కోరుతున్నదల్లా.. ఈ దేశం సరైన పద్ధతుల్లో ముందుకు పోవాలంటే.. రాజ్యాంగం ఉన్నదున్నట్టుగా అమలు కావాలంటే.. అంబేద్కర్ గారు కలలు గన్న రాజ్యాంగస్ఫూర్తి నిజం కావాలంటే.. అవసరమైనటువంటి మౌలికమైన మార్పులు, చేర్పులు చేసుకొని అద్భుతమైన ప్రత్యామ్నాయ, ప్రజల ఎజెండాతోటి కొత్త రాజకీయశక్తి ఈ దేశంలో తప్పకుండా ఆవిర్భవించాలి.
సందర్భానుసారం స్పందించే గుణం భారతదేశ లక్షణం. ఇండియా రియాక్ట్స్. ఇండియా బుద్దూగాళ్ల దేశం కాదు. ఇండియా బుద్ధిజీవుల దేశం. ఎస్ ఇండియా రియాక్ట్స్. తప్పకుండా వస్తాయి శక్తులు. మనం నిరాశపడాల్సిన అవసరం లేదు. తెలంగాణ కోసం అవసరమైననాడు టీఆర్ఎస్ రూపంలో రాలేదా? పెద్ద శక్తిపుట్టలే..! గాలిదుమారం లేపలే! తెలంగాణ రాష్ట్రం సాధించుకురాలే? అట్లనే దేశానికి అవసరమైన నాడు కూడా దేశంలో భూకంపం పుట్టించి.. తుఫాన్ సృష్టించి, ఈ దుర్మార్గాన్ని అంతా తరిమివేసే రోజులు దగ్గరలోనే ఉన్నయి.
సామూహిక లక్ష్యాన్ని కోల్పోయి, దేశ ప్రజలు ఒకతాటిపై నడవలేని దుస్థితికి దేశం చేరడానికి కారణమేమిటి? ఇంత సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం, యువశక్తి, అటవీ, ఖనిజ, జల సంపదలు, బంగారం పండించే 44 కోట్ల ఎకరాల భూములు, కష్టం చేయడానికి సిద్ధంగా ఉన్న కోట్లాది శ్రమజీవులను కలిగి ఉండి ఎందుకూ కొరగాని దేశంగా ఎందుకున్నది? ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చర్చించాల్సిన అంశం.
మట్టి కూడా లేని సింగపూర్ ఎలా ఎదిగింది?
సింగపూర్‌లో ఏమీ లేదు. మన్ను కూడా లేదు. మట్టి కావాలంటే పొరుగుదేశం ఇండోనేషియా నుంచి కొనుక్కుంటరు. మట్టిని నౌకలలో తెచ్చుకుంటరు. మంచినీళ్లు కూడా వారి సొంతానికి లేవు. మలేషియా నుంచి కొని.. వాటిని ట్రీట్మెంట్ చేసి మళ్లీ మలేషియాకే అమ్ముతరు. వాళ్లు ఎత్తే ఒక అన్నం ముద్ద కూడా వాళ్లది కాదు. వాళ్లు ఎత్తే ఒక కూరగాయ ముక్క కూడా వాళ్ల దేశంలో పండదు. కానీ ఇప్పుడు సింగపూర్ ఆర్థిక పరిస్థితి ఏమిటి? మన ఆర్థిక పరిస్థితి ఏమిటి? ఆ దేశంలో ఏమీ లేదు.. మరెందుకు సింగపూర్ అంత జాజ్వలమానంగా ఉంది. అక్కడ ఏం లేదు కానీ వాళ్లకు తెలివి ఉంది. మన వద్ద అన్నీ ఉన్నయి కానీ తెలివి లేదు. ఏమీ లేనివాళ్ల దగ్గర ఒక్క తెలివుంటే మిగతా అన్ని ఉంటున్నయి. అన్ని ఉన్నకాడ తెలివి లేక కునారిల్లుతున్నాం. ఇది కఠోరమైన వాస్తవం. నిప్పులాంటి నిజం. హేతుబద్ధమైన వాదం. రాజకీయ రణగొణ ధ్వనులతో, హుంకారాలతో, ఆడంబరమైన నినాదాలతో, మైకులు పగిలిపోయే ఉపన్యాసాలతో 75 ఏండ్లు గడిచినయి తప్ప.. దేశ ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేరలేదు.
భూమి లేకనా? నీరు లేకనా?
ప్రపంచంలో అత్యధికంగా యువ జనాభా కలిగిన దేశం భారతదేశం. మరేం దరిద్రం? 13 కోట్ల మంది భారతీయులు వారి ప్రతిభా పాటవాలను విదేశాల్లో ఖర్చు చేస్తున్నరు. అమెరికాలో గ్రీన్ కార్డు దొరికిన పిల్లలు తల్లిదండ్రులకు ఫోన్ చేసి ‘అమ్మా, నాన్నా నాకు గ్రీన్ కార్డు వచ్చింది’ అని చెప్తే.. ఇక్కడ ఆ తల్లిదండ్రులు ఇరుగుపొరుగు వారిని పిలిచి పార్టీలు చేసుకుంటున్నరు. ఏమిటీ దౌర్భాగ్యం. మనకు ఆస్తి లేకనా? భూమి లేకనా? నీరు లేకనా? ఖనిజ సంపద లేకనా? అటవీ సంపద లేకనా? మేధోశక్తి లేకనా? ఎందుకు ఈ దేశం ఇలా కునారిల్లుతున్నది. ఎందుకు ఈ దేశంలో ఇంతటి దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై మనందరం కూడా తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది.
మతం పేరిట ఈ దేశంలో ఇవేం గలీజు రాజకీయాలు. ఈ దేశం ఇట్లనే నాశనం కావాల్నా? లేదు, టీఆర్ఎస్గా మనం కూడా ఒక పాత్ర పోషిద్దామా? మన శక్తిని ప్రదర్శించి వక్ర గతిలో పోతున్న ఈ దుర్మార్గాన్ని నిలువరించి దేశానికి మంచి మార్గాన్ని చూపాలా వద్దా? ఇది మన ముందున్న ప్రశ్న.
సామూహిక లక్ష్యం ఉండాలె
దేశంలో ఒక పక్కకు వెళ్తే 40 ఏండ్ల కిందట మనం ఎట్లున్నమో ఇప్పుడు ఆ రాష్ర్టాలు అట్ల ఉన్నయ్. విచిత్రమేమంటే.. బాధాకరం ఏమంటే? రూ.75 వేల తలసరి ఆదాయం ఉన్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి రూ.2 లక్షల 75 వేల తలసరి ఆదాయం ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రికి నీతి పాఠాలు చెప్తడట. ఇదీ పరిస్థితి. అది మనం మౌనంగా వింటున్నాం. నిజంగా నిలబెట్టి అడిగితే.. ఏమైతది. ఈ రోజు భారతదేశం లక్ష్యమేమిటి? ఎవరికైనా తెలుసా? ఈ దేశం ఏ లక్ష్యం వైపు పోతున్నది.
దేశం తన లక్ష్యాన్ని కోల్పోయింది. దేశం, సిద్ధాంతం అంటే.. ఒక వ్యక్తి చెప్పే నాలుగు మాటలు కాదు. ఒక పార్టీ ప్రవచించే నాలుగు మాటలు కాదు. దేశం లక్ష్యం అంటే దేశ ప్రజల సామూహిక లక్ష్యమై ఉండాలి. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ పశ్చిమ కనుమల నుంచి తూర్పు దిశ వరకూ దేశం నలుమూలల ఉండే ప్రజల సామూహిక లక్ష్యం, గమ్యంగా మన దేశ లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం దిశగా దేశమంతా సామూహిక ప్రయత్నం చెయ్యాలె. అట్ల అన్ని దేశాలు చేస్తయి. మరి భారతదేశం ఎందుకు చేస్తలేదు. ఎందుకు గతి తప్పుతున్నది. ఎందుకు లక్ష్యం లేకుండా చీకట్లో బాణంలా, గుడ్డెద్దు చేలో పడ్డట్టు పోతా ఉన్నది. మనం మౌన ప్రేక్షకులుగానే ఉండాల్నా? లేక.. దేశం ఒక సామూహిక లక్ష్యాన్ని నిర్దేశించుకొని క్రమశిక్షణతో, నియంత్రిత విధానంతో, పట్టుదలతో పురోగమించి అద్భుతాలు సాధించాలా? ఏం జరగాలి?
తప్పకుండా సముజ్వలంగా తెలంగాణ కూడా.. టీఆర్ఎస్ పార్టీ కూడా దానిలో ఉజ్వలమైన పాత్ర పోషిస్తది. మరోసారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ నేను విరమిస్తున్నా. జై తెలంగాణ.. జై హింద్
లేమ్మీ! వేడి పుట్టింపగన్
ఈ దీపమ్ముల చుట్టు చీకటులు
పోనే లేదు, దయ్యాలటుల్
పాదుల్ కట్టుచు కూరుచున్నవి,
నిశా పక్షీంద్ర పక్షమ్ము లెం
తో దూరానకు గాలి వీచినవి,
ముద్దుల్ గుల్కు దీపమ్ములం
దేదో చల్లదనమ్ము ప్రాకినది,
లేమ్మీ! వేడి పుట్టింపగన్
దూరదూరాల దీపాల తోరణాల
భరత వీరుల నెత్తుటి వరద కలదు,
అందులో విచ్చె బంగారు టంబుజములు
భరత మాతృ పదమ్ముల వ్రాలు కొరకు
గుండెలను పిండి ప్రమిదల నిండ స్నేహ
మొలికి ప్రేమాగ్ని కళికలు నిలుప రమ్ము!
చీకటులు త్రావి మత్తిల్లి జీర్ణ కుటిని
గురుక వెట్టెడి జనుల మేల్కొలుప లెమ్ము
నవ యువక రక్త నాళాల పారు
నూత్న చైతన్య ధారయే నూనె గాగ
చీకటులు నింపుకొన్న మృత్స్నా కరండ
మీ ఇలా గోళకమ్ము వెల్గింతు నేను
– దాశరథి