పేదవాడికి గుడికి పోయి
గొప్పగా మండలం ప్రదక్షిణలు
చేసే క్షణం తీరిక ఎక్కడిది!
శ్రమతోనే కాలం చెమటై లోకక్షేమంగా ఫలిస్తుంది!
తన గుడిసె ముందునుంచే
ఉదయ భానుడికి ఆకాశానికి అంటేలా
రెండు చేతులెత్తి దండం పెట్టుకుంటాడు
ఈ రోజు అందరికీ మంచే జరగాలని!
వర్షం పడుతుంటే వాన దేవుడికి
లోకమంతా పంటల మేళ కావాలని
ఎవరి కడుపులోనూ ఆకలినాట్లు పడొద్దని
విశ్వ మానవుడిగా ఆకాంక్షిస్తాడు..!
ఆడంబరంగా పేదవాడి ప్రార్థనలో
సంస్కృత శ్లోకాలు తండ్లాడవు
ఢమరుక ధ్వని గుండె కొట్టుకునుడే…
పుష్పం లేదు, అగరొత్తి లేదు
తియ్యటి నీళ్లు ఒలికిపోయే
కొబ్బరికాయ కొట్టుడు లేదు…
రోజువారీ కైకిలి సంపాదనే తన అష్ట ఐశ్వర్యం
ఆకలితో గుడిసెముందుకు వచ్చినవారికి
దోసెడన్నం పెట్టుడే మహా దానం..!
ఏమీ కావాలని ఏ దేవున్ని కోరడు
కోరనివాడు పేద ఎలా ఔతాడు
శ్రీమంతుల్లో కెల్లా శ్రీమంతుడే మరి..!
పేదవాడి ప్రార్థన తులాభారాలకు అందనిది
ఏ ఆగమశాస్త్రంలో ఇంతవరకు
తులమంతైనా రాయలే…
సందేహం ఎందుకు?
భేషజం లేని పేదవాడి ప్రార్థనను
ఎవరైననూ ఆచరించవచ్చు..
కందాళై ,రాఘవాచార్య
8790593638