ఇది నీ కోసమే రాస్తున్న వాక్యం అవ్వొచ్చు
ఇది నిన్ను ఓదార్చే ఓ కావ్యం అవ్వొచ్చు
ఒంటరిగా ఉండాలని కలకంటావ్
ఒక్కడివే ఉండాలని కాసింత నిన్ను
నువ్వు పోగు చేసుకుంటావ్
సంద్రం తాకని తీరానికెళ్ళి సైకత శిల్పాన్ని
నిర్మించుకొని సేద తీరాలనుకుంటావ్
కాసిన్ని భయాలను మోస్తూ భ్రమల్లో
జీవితాన్ని గడిపేయాలనుకుంటున్నావా
పిచ్చివాడా! ఇక్కడేది నువ్వు అనుకున్నట్టూ నిర్మించబడలేదు
ఎవరికి వాళ్లు అనుకున్నట్లే నిర్మించుకున్నారు
నువ్వు కూడా అంతే.. ఈ నాలుగు కుడ్యాల మధ్య కూర్చొని
కుహనా ప్రపంచాన్ని అంచనా వేయకు
ఏ హద్దుల్లేని ఆలోచనల్లో నిన్ను నువ్వు హత్య చేసుకోకు
నిశ్శబ్దం గుట్టు చప్పుడుగా దాచుకున్నా మాటల మూట
నిన్ను మదన పెట్టవచ్చు
నిన్ను నిరూపించుకోవడానికి ఏ నిర్వచనం దొరక్క
ఎన్ని ప్రశ్నలు నిన్ను నిందించి ఉంటాయ్..
ఈ నీ బతుకు బోనులో ప్రత్యక్ష సాక్షివి నువ్వైనా
ఎన్ని వాదనలు వాగ్దానాలు నిన్ను
ఒంటరిని చేసుంటాయ్ కదా..
గొంతు సవరించుకొని ఓ దిగులు పాట పాడటానికి
కూడా కాసింత సమయం నిన్ను నిర్లక్ష్యం చేస్తుంది
అయినా పర్లేదు నువ్వేం బెంగపడకు
భంగపడటం, భగ్నపడటం.. బాగుపడటం, బాధపడటం
బోధపడటం, భయపడటం అన్ని ఓ దారికున్నా సూత్రాలే..
అన్నింటిని కాసింత ఆస్వాదించి అడుగులేయాలే తప్ప
ఏ హృదయం లేని దేహంలా నిరీక్షించకూడదు
ఇక్కడేదీ ఒంటరి కాదు
జీవితమూ కాలము దుఃఖం సంతోషం అన్ని
కనిపించని కాసింత తోడును వెంటబెట్టుకు వచ్చేవే..
పి.సుష్మ
99597 05519