భారతదేశం నా మాతృభూమి
అని గొంతు చించి అరుస్తున్నా..
వాళ్లకు వినపడట్లేదా..? లేక నటిస్తున్నరా..?
భారతీయులంతా నా సహోదరులే
అవును ఆ ఇద్దరితో సహా..
అయినా నాపై ఎందుకీ ద్వేషం..?
నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను
ఐదువేళలా ఇదే నేలను నుదుటితో ముద్దిస్తున్నా..
ఈ గాలిలోనే అత్తరు సుగంధమై పరిమళిస్తున్నా..
కళ్ళల్లో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నా..
గుండెల్లో ‘జై హింద్’ నినాదాన్ని మార్మోగిస్తున్నా..
వాళ్ళు చూస్తూనే, అంతా గమనిస్తూనే..
నా దేశభక్తిని గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తున్నరు..!
పదేపదే గాయపరిచి ఆనందిస్తున్నరు..!!
ఎత్తులు వేసి, నా కుత్తుకపై కత్తులు నూరుతూ,
మతం మత్తులో నన్ను చిత్తు చేయజూస్తున్నరు…
నా దాదాలు దాయని దస్తావేజులు తేవాలట,
తాజ్ పునాదుల్లోని రహస్యాలు తెలియాలట,
నా నోటికాడి కూడును ఈడ్చి తన్నే పాదాలు రావాలట,
నీడై నిలిచిన గూడును కూల్చే బుల్డోజర్లు కావాలట..
పూటకో నాటకం, రోజుకో నెపం..
కూడు, గూడు, గుడ్డపై ఏకకాల త్రివిధ దాడి..
పండ్లమ్ముకునే.. పూలమ్ముకునే..
మెకానిక్ షెడ్లల్లో గ్రీసును పూసుకునే..
బేకరీ బట్టీల్లో ఒళ్ళంతా కాల్చుకునే..
నేనంటేనే ఎందుకు కక్ష, నాపైనే ఎందుకీ వివక్ష..?
ఓ ప్రియ మిత్రుడా, జాన్ జిగర్ స్నేహితుడా..
వాళ్లంటే అనాది నుంచి నా ఉనికిని చిదిమేసి,
నా ఊసును చెరిపేయాలని చూస్తున్నోళ్ళు..
నీకేమైంది? నన్ను చూస్తే కొత్తగా నీ కన్నెందుకు ఎరుపెక్కుతోంది..
బుసలు కొడుతున్న నాల్కలు,
కుబుసం విడిచిన సర్పాలై కాటేసేందుకు వస్తున్నాయి,
మండూకమై చిక్కి మరణించడం కాదు,
ముంగీసలా మారి ప్రతిఘటిద్దాం నాతోరా..!
మోయ తుమ్మెద వాగొడ్డుకు పరక చేపలకు
గాలాల్ని సిద్ధం చేస్తున్నా నా కోసం రా..!
బాల్యపు జ్ఞాపకాల బావిలో మునకేసి
బురదంటిన మెదడును శుభ్రం
చేసుకోవడానికి మర్చిపోకుండారా..!!
జాబేర్ పాషా , మస్కట్ (ఒమన్)
00968 78531638