నవ్వుతూ నవ మాసాలు మోస్తుంది
పురిటినొప్పిని పంటికింద ఒత్తిపడుతూ
పండంటి పాపకు జన్మనిస్తుంది అమ్మ
ఎర్రని రక్తాన్ని తెల్లని పాలగా మార్చి
కడుపు నింపుతుంది అమ్మ…
జోలపాడుతూ నిద్రపుచ్చి
రామబంటులా కాపలా కాస్తుంది
బుడిబుడి అడుగులను చూస్తూ
తన అమ్మతనానికి మురిసిపోతుంది అమ్మ..
చంకనేసుకొని చందమామను చూపిస్తూ
గోరుముద్దలు పెడుతుంది
దాగుడుమూతలు ఆడిస్తూనే
భవిష్యత్తుకు బాటలేస్తుంది
తను ఆరిపోతూ మనల్ని
అందలం ఎక్కిస్తుంది అమ్మ…
అమ్మ మనల్ని ప్రేమ ఒడిలో
లాలిస్తే మనం ఆమెను
అనాథాశ్రమాల్లో బందీ చేస్తున్నాం!
అయినా.. అమ్మ శిక్షించలేని బిడ్డలమే
పట్టుబడని నేరస్తులమే..!
ఎందుకంటే అమ్మది
ప్రేమబంధం కాదు, పేగు బంధం
రాయిని పూజించే మనసున్న మనకు
అమ్మను ప్రేమించే మనస్సు రాదాయే..!
బిడ్డల్ని లాలిస్తూ.. ప్రేమిస్తూ..
క్షమించి వదిలేసే ‘అమ్మ’కు
శతకోటి వందనాలు..!
తుమ్మల ,కల్పన రెడ్డి
96404 62142