మెత్తటి ఇసుక తిన్నెల నడుం మీద
లేత ఎండ సీతాకోక vibesలో
సొట్టబుగ్గల పింకు నవ్వుల కాలం
రంగుల ఆకులు రాల్చే చెట్ల నీడలూ
రెక్కల మీది మోహపు రంగుల తీపి హేమంతాలూ
ఒకరి నడుం చుట్టూ ఒకరు చేతులు వేసి నడుస్తూ
శ్రావణ మేఘాల రహస్యపు వానల్లో తడుస్తూ
భోగి మంటలపొగల్లోంచి కాలవల మీది
చిత్రాల మధ్య కులుకుతూ
సూర్యకిరణాల మధ్య పకపకా నవ్వుతూండగానే
ఇట్టే జారి పోతుంది సీతాకోక
కాస్టూమ్స్ మార్చేస్తుంది కాలం
కొండల మధ్య నది నిద్రలోంచి
హేమంత కాంతిలోని కొబ్బరి చెట్ల తీరాలూ
వయ్యారాలు పోయే పడవల తూగులూ తీసుకుని
ఎక్కడికో ఎగిరెళ్లిపోతుంది కాలం సీతాకోక
జీవనోత్సవాల చుట్టూ మత్తెక్కి తిరుగుతూ
రంగుల జాతరల్ని చుట్టూ తిప్పుకునే పరిమళాన్ని నేనే
కాలం మార్చేసుకుంది సముద్రాన్నీ ఆకాశాన్నీ
తన రంగుల రెక్కలుగా
బహుశా ఇవాళ రాత్రే నా రంగులు మాయం కాగా
నేనో గొంగళి పురుగునై
గ్రీన్ రూంలోకి పోతా
బహుశ రేపే మళ్లీ వచ్చేస్తా
పూలచొక్కా తొడుక్కున్న కాలాన్నై
-వసీరా